పూర్తి స్థాయి బ్యాంకుగా మారాలని అనుకుంటున్నాం

పూర్తి స్థాయి బ్యాంకింగ్‌ సేవలు అందించాలన్నది ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ (ఐపీపీబీ) లక్ష్యమని ఆ సంస్థ ఎండీ, సీఈఓ జె.వెంకట్రాము తెలిపారు.

Updated : 19 Mar 2023 03:40 IST

ఇండియా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంక్‌ సీఈఓ వెంకట్రాము

దిల్లీ: పూర్తి స్థాయి బ్యాంకింగ్‌ సేవలు అందించాలన్నది ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ (ఐపీపీబీ) లక్ష్యమని ఆ సంస్థ ఎండీ, సీఈఓ జె.వెంకట్రాము తెలిపారు. అందరికీ బ్యాంకింగ్‌ సేవలను దరిచేర్చాలనే లక్ష్యాన్ని సాధించేందుకు తపాలా కార్యాలయాల శాఖల విస్తృత నెట్‌వర్క్‌ తోడ్పడుతుందని పేర్కొన్నారు. ‘ఐపీపీబీ 2018లో కార్యకలాపాలు ప్రారంభించినప్పుడు.. 80 శాతం లావాదేవీలు నగదు రూపేణా జరిగేవి. డిజిటలీకరణ కారణంగా ఇప్పుడు 20 శాతం లావాదేవీలు నగదు రూపంలో, 80 శాతం డిజిటల్‌ పద్ధతిలో జరుగుతున్నాయ’ని తెలిపారు. ‘తపాలా కార్యాలయాలకు దేశవ్యాప్తంగా ఉన్న శాఖల ద్వారా ప్రతి మారుమూలకు మా సేవలు అందుబాటులోకి తీసుకు రాగలమని అనుకుంటున్నాం. మాకు పూర్తి స్థాయి బ్యాంకింగ్‌ లైసెన్సు వస్తే... అందరికీ బ్యాంకింగ్‌ సేవలను దరిచేర్చడం సహా పలు లక్ష్యాలను సాధించేందుకు తపాలా శాఖలు ఉపయోగపడతాయ’ని వెంకట్రాము తెలిపారు. యూనివర్సల్‌ బ్యాంక్‌ లైసెన్సు కోసం ఆర్‌బీఐను సంప్రదించనున్నారా అనే ప్రశ్నకు సమాధానంగా ఆయన ఇలా పేర్కొన్నారు. చెల్లింపుల బ్యాంకుగా ఉన్న ఐపీపీబీ... డిపాజిట్ల స్వీకరణ, నగదు పంపిణీ, ఉపసంహరణ, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ లాంటి సేవలనే ప్రస్తుతం అందించగలుగుతోంది. రుణాలివ్వడం, క్రెడిట్‌ కార్డుల జారీ లాంటివి చేయలేదు. కంపెనీల చట్టం కింద వ్యవస్థాపితమైన ఐపీపీబీలో తపాల విభాగం ద్వారా ప్రభుత్వానికి 100 శాతం వాటా ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు