సింగపూర్‌ స్థాయికి భారత్‌ ఇపుడే వెళ్లలేదు

సులభతర వాణిజ్యానికి ఉన్న అడ్డంకులను భారత్‌ తొలగించాల్సిన అవసరం ఉందని భారత్‌-అమెరికా వ్యాపారాల సలహా బృందం (యూఎస్‌ఐఎస్‌పీఎఫ్‌) అధిపతి అభిప్రాయపడ్డారు.

Published : 19 Mar 2023 01:27 IST

కొంత ప్రగతి ఉన్నా.. చాలా సమయం పడుతుంది
సులభతర వాణిజ్యానికి అడ్డంకులు తొలగించాలి
యూఎస్‌ ఇండియా స్ట్రాటజిక్‌ అండ్‌ పార్టనర్‌షిప్‌ ఫోరమ్‌

వాషింగ్టన్‌: సులభతర వాణిజ్యానికి ఉన్న అడ్డంకులను భారత్‌ తొలగించాల్సిన అవసరం ఉందని భారత్‌-అమెరికా వ్యాపారాల సలహా బృందం (యూఎస్‌ఐఎస్‌పీఎఫ్‌) అధిపతి అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో సింగపూర్‌ లేదా హాంకాంగ్‌ స్థాయికి భారత్‌ చేరాలంటే చాలా సమయం పట్టొచ్చని యూఎస్‌ ఇండియా స్ట్రాటజిక్‌ అండ్‌ పార్టనర్‌షిప్‌ ఫోరమ్‌(యూఎస్‌ఐఎస్‌పీఎఫ్‌) ప్రెసిడెంట్‌ ముకేశ్‌ అఘి అభిప్రాయపడ్డారు. భారత్‌-అమెరికా అనుబంధం బలంగా ఉందనీ.. ప్రతి అంశంలోనూ సానుకూల ప్రగతి కనిపిస్తోందని ఆయన అన్నారు. ‘భౌగోళికంగా చూస్తే క్వాడ్‌ (ఆస్ట్రేలియా, భారత్‌, జపాన్‌, అమెరికా) ముందంజలో ఉంది. ఐ2యు2 (భారత్‌, ఇజ్రాయెల్‌, యూఏఈ, అమెరికా) కూడా రాణిస్తోంది. పుంజుకుంటున్న భారత ఆర్థిక వ్యవస్థ అమెరికాకు సహాయ పడుతోంది. అమెరికాకు చెందిన విమాన తయారీ సంస్థ బోయింగ్‌కు, భారత విమానయాన సంస్థ ఎయిరిండియా ఇచ్చిన ఆర్డరు వల్ల అమెరికాలో 10 లక్షల ఉద్యోగాలు లభించనున్నాయి. ఇండిగో కూడా పెద్ద ఆర్డరు పెడుతుందని ఆశిస్తున్నామ’న్నారు. ఎయిర్‌బస్‌, బోయింగ్‌లకు రూ.6.4 లక్షల కోట్ల విలువైన మొత్తం 470 విమానాల కోసం టాటా గ్రూప్‌ సంస్థ ఎయిరిండియా ఆర్డరు పెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో 220 విమానాలను బోయింగ్‌ నుంచే కొనుగోలు చేయనుంది. చేయాల్సింది ఇంకా ఉంది‘మనం చాలా ప్రగతి సాధించాం. సింగపూర్‌ లేదా హాంకాంగ్‌ లేదా ఇతర దేశాల స్థాయి ప్రమాణాలకు చేరడానికి ఇంకా చాలా సమయం పట్టొచ్చు. ఆ రెండు దేశాలతో వాణిజ్యం ఎటువంటి ఒప్పందాలూ లేకుండానే 70 బిలియన్‌ డాలర్లకు పైగా ఉంది. కాబట్టి చేయాల్సింది ఇంకా ఉంది. భారత్‌లో మా బంధాన్ని ప్రతి అంశంలోనూ బలోపేతం చేయాలని భావిస్తున్నామ’ని ముకేశ్‌ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు