సంక్షిప్త వార్తలు (7)

ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-ఫిబ్రవరిలో రష్యా నుంచి మన దేశానికి దిగుమతులు 5 రెట్లు పెరిగి 41.56 బిలియన్‌ డాలర్లకు చేరాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Updated : 19 Mar 2023 06:49 IST

రష్యా నుంచి దిగుమతులు 5 రెట్లు పెరిగాయ్‌
ఏప్రిల్‌-ఫిబ్రవరిలో 41.56 బి.డాలర్లకు

దిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-ఫిబ్రవరిలో రష్యా నుంచి మన దేశానికి దిగుమతులు 5 రెట్లు పెరిగి 41.56 బిలియన్‌ డాలర్లకు చేరాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆ దేశం నుంచి ముడి చమురును భారీగా దిగుమతి చేసుకోవడమే ఇందుకు కారణమని పేర్కొంది. 2021-22లో రష్యా నుంచి 9.86 బి.డాలర్ల విలువైన దిగుమతులు మనదేశానికి చేరాయి. అప్పుడు విలువ పరంగా రష్యా 18వ స్థానంలో ఉండేది. మన దేశం దిగుమతి చేసుకునే మొత్తం ముడి చమురులో రష్యా వాటా 0.2 శాతంగా ఉండేది. అది ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌-జనవరిలోనే 28 శాతానికి చేరింది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ నేపథ్యంలో పశ్చిమ దేశాలు రష్యా చమురుపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో, మన దేశానికి రాయితీ ధరకే చమురును రష్యా సరఫరా చేయడం ఈ మార్పునకు కారణం. జనవరిలో రోజుకు 1.27 మిలియన్‌ బ్యారెళ్ల చమురు రష్యా నుంచి దిగుమతి అయ్యింది.

అమెరికాకు పెరిగిన ఎగుమతులు: మన దేశం నుంచి అమెరికాకు అత్యధిక స్థాయిలో ఎగుమతులు జరిగాయి. 2021-22 ఏప్రిల్‌-ఫిబ్రవరిలో ఎగుమతులు 68.447 బి.డాలర్ల మేర జరగ్గా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో 70.99 బి.డాలర్లకు చేరాయి. యూఏఈకి 24.95 బి.డాలర్ల నుంచి 28.63 బి.డాలర్లకు మన ఎగుమతులు చేరాయి. చైనాకు ఎగుమతులు మాత్రం 19.81 బి.డాలర్ల నుంచి 13.64 బి.డాలర్లకు తగ్గాయి.


‘వీకో’ ప్రచార కర్తగా సౌరవ్‌ గంగూలీ

దిల్లీ: వీకో ల్యాబ్స్‌ ఉత్పత్తి అయిన వీకో షేవింగ్‌ క్రీమ్‌కు ప్రచార కర్తగా (బ్రాండ్‌ అంబాసిడర్‌) ప్రముఖ క్రికెటర్‌ సౌరవ్‌ గంగూలీ వ్యవహరించనున్నారు. వీకో ల్యాబ్స్‌ పలు రకాలైన ఆయుర్వేద ఉత్పత్తులు అందిస్తోంది. చర్మ వ్యాధులు, నొప్పులు, దంత సమస్యలు అదుపు చేసే ఉత్పత్తులు ఇందులో ఉన్నాయి. ఈ సంస్థ ఇటీవల  పలు కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించింది. వీకో ల్యాబ్స్‌ ఉత్పత్తులు ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగంగా మారినట్లు సౌరవ్‌ గంగూలీ పేర్కొన్నారు.


ఇంకా తేలని 80,000 పన్ను వివాదం కేసులు

 వీటిని తగ్గించేందుకు ప్రభుత్వ కమిటీ ఏర్పాటు!
 రెవెన్యూ కార్యదర్శి సంజయ్‌ మల్హోత్రా

దిల్లీ: సెస్టాట్‌ (కస్టమ్స్‌, ఎక్సైజ్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌)లో 80,000 పన్ను వ్యాజ్యం కేసులు పెండింగ్‌లో ఉన్నందున.. వీటిని త్వరగా పరిష్కరించేందుకు మార్గాలను సూచించేందుకు ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేస్తుందని రెవెన్యూ కార్యదర్శి సంజయ్‌ మలోత్రా వెల్లడించారు. సెస్టాట్‌ 40వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పన్ను చట్టాలు, నిబంధనల్లో స్పష్టత తీసుకురావడం వ్యాజ్యాల్ని తగ్గించడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు. వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉండటం అనేది ట్రైబ్యునల్‌కు నిరంతర సవాలుగా మారిందని తెలిపారు. సెస్టాట్‌ నుంచి మద్దతు తీసుకోవడంతో పాటు కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల మండలి (సీబీఐసీ) సహకారంతో ఒక కమిటీ ఏర్పాటు చేస్తామని, తద్వారా పెండింగ్‌ కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు.


సెరిమార్ఫిక్‌లో కొత్తగా 150 ఉద్యోగాలు

ఈనాడు, హైదరాబాద్‌: డీప్‌టెక్‌ సంస్థ సెరిమార్ఫిక్‌ రానున్న రెండేళ్ల కాలంలో 150 మంది సాంకేతిక నిపుణులను నియమించుకోనుంది. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ వైర్‌లెస్‌, కంప్యూటింగ్‌ చిప్‌లను అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే హైదరాబాద్‌ కార్యాలయంలో 160 మంది ఇంజినీరింగ్‌ నిపుణులు ఉన్నారు. కొత్త ఉద్యోగాలు ప్రధానంగా కృత్రిమ మేధ, మెషిన్‌ లెర్నింగ్‌, కంప్యూటర్‌ ఆర్కిటెక్ట్‌ తదితర డీప్‌ టెక్నాలజీలపై ఉంటాయని సెరిమార్ఫిక్‌ టెక్నాలజీస్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ వెంకట్‌ మట్టెల తెలిపారు. డేటా కేంద్రాల్లో వినియోగించే సూపర్‌ కంప్యూటర్లను రూపొందించే దిశగా పరిశోధనలు సాగుతున్నాయన్నారు. తక్కువ విద్యుత్‌ను వినియోగించుకునేలా చిప్‌లను రూపొందించడంలో సెరిమార్ఫిక్‌ కృషి చేస్తోందన్నారు. ఇప్పటికే 100కు పైగా పేటెంట్లను పొందినట్లు తెలిపారు. హైదరాబాద్‌లో చిప్‌ డిజైనింగ్‌ కోసం ఇప్పటి వరకూ రూ.240 కోట్ల వరకూ పెట్టుబడి పెట్టినట్లు వెల్లడించారు. సూపర్‌ కంప్యూటర్‌ చిప్‌ల అభివృద్ధి కోసం మరో రూ.500 కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టబోతున్నట్లు తెలిపారు. 2025 నాటికి వీటిని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్తతరం సాంకేతికతలు పెరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో రానున్న రెండు మూడేళ్లలో ‘రిలయబుల్‌ సూపర్‌ కంప్యూటింగ్‌’పై ఆధారపడటం పెరుగుతుందని తెలిపారు. వాహన, జీవశాస్త్రాలు, రోబోటిక్స్‌, డేటా సెంటర్లకు అధిక శక్తిగల చిప్‌ల అవసరం పెరుగుతుందని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని, హైదరాబాద్‌ కేంద్రాన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.


కార్పొరేట్‌ ప్రయాణాలు పెరుగుతాయ్‌

2023పై అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ సర్వే

దిల్లీ: ఈ ఏడాది కార్పొరేట్‌ ప్రయాణాలు పెరిగే అవకాశం ఉందని అమెరికా ఎక్స్‌ప్రెస్‌ సర్వే వెల్లడించింది. కిందటేడాదితో పోలిస్తే 2023లో ప్రయాణాల కోసం వెచ్చించడం పెరుగుతుందని 77 శాతం భారత కంపెనీలు సర్వేలో తెలిపాయి. ప్రయాణాల వ్యయాల చెల్లింపుల కోసం థర్డ్‌ పార్టీ బుకింగ్‌ సిస్టమ్స్‌ వద్ద తమకున్న ఖాతాలను ఉపయోగిస్తామని 66 శాతం కంపెనీలు తెలిపాయి. ఉద్యోగులే చెల్లించుకునేందుకు వీలు కల్పిస్తామని 61% కంపెనీలు వెల్లడించగా.. కంపెనీ క్రెడిట్‌ కార్డును ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తామని 57 శాతం కంపెనీలు తెలిపాయి. ప్రయాణాల బుకింగ్‌, వ్యయాల కోసం వ్యాపార ప్రయాణాల డేటా అనాలటిక్స్‌ను ఉపయోగించుకుంటామని 79 శాతం దేశీయ కంపెనీ తెలిపాయి. ‘భారత్‌లో కార్పొరేట్‌ ప్రయాణాలు పెరిగేందుకు సానుకూల పరిస్థితులు ఉన్నాయి.. గత రెండేళ్లలో వ్యాపార ప్రయాణాలు తాత్కాలికంగా తగ్గాయి. దేశీయంగా వ్యాపార ప్రయాణాలు కొవిడ్‌-19 ముందు స్థాయికి చేరాయి. అంతర్జాతీయ ప్రయాణాలూ పుంజుకున్నాయి. మున్ముందు ఈ ధోరణి కొనసాగుతుందని భావిస్తున్నామ’ని అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ బ్యాంకింగ్‌ కార్ప్‌, ఇండియా హెడ్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ మనీష్‌ కపూర్‌ తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లోని 500 కంపెనీలపై ఈ సర్వేను నిర్వహించారు.


రూ.19 లక్షల కోట్లతో శాంసంగ్‌ భారీ చిప్‌ ప్లాంటు

ప్రపంచంలోనే అతిపెద్ద సెమీకండక్టర్‌ తయారీ కేంద్రం

సియోల్‌: శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ ప్రపంచంలోనే అతిపెద్ద సెమీకండక్టర్‌ తయారీ కేంద్రాన్ని దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో నిర్మించాలని భావిస్తోంది. ఇందు కోసం వచ్చే 20 ఏళ్లలో 230 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.19 లక్షల కోట్ల)ను పెట్టుబడులుగా పెట్టనుంది. 2042 కల్లా జియోంగి ప్రావిన్స్‌లో చిప్‌ తయారీ మెగా క్లస్టర్‌ సిద్ధం కానుంది. ఇందులో 5 కొత్త సెమీ కండక్టర్‌ ప్లాంట్లను శాంసంగ్‌ నిర్మించనుంది. దక్షిణ కొరియా జాతీయ ప్రాజెక్టులో భాగంగా ఈ ప్లాంట్లకు కంపెనీ శ్రీకారం చుట్టనుంది. అత్యాధునిక చిప్‌ల తయారీ, డిజైన్‌కు ఉపకరించే సామగ్రి, విడిభాగాల తయారీలో ఉండే 150 కంపెనీలను ఇక్కడకు ఆకర్షించాలన్నది తమ లక్ష్యమని దక్షణ కొరియా వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. 6 కీలక సాంకేతిక పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వాలని ప్రభుత్వం బుధవారం నిర్ణయించింది. సెమీకండక్టర్‌ క్లస్టర్‌ ఇందులో భాగమే. ఎగుమతి ఆధారిత ఆర్థిక వ్యవస్థకు ఇవి చాలా కీలకమని ఆ దేశం భావిస్తోంది. 2026 కల్లా వివిధ ప్రాజెక్టుల ద్వారా 422 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాలని ఆ దేశం భావిస్తోంది.


రూ.260 కోట్లతో కొత్త ప్లాంటు

పీఎల్‌ఐ పథకం కింద ఒప్పందం  కుదుర్చుకున్న ఎంపీఎల్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ కేంద్రంగా పనిచేస్తున్న స్పెషాలిటీ స్టీల్‌ ఉత్పత్తి సంస్థ మహాలక్ష్మి ప్రొఫైల్స్‌ ప్రైవేట్‌ లిమిటెట్‌ (ఎంపీఎల్‌ గ్రూప్‌) రూ.260 కోట్లతో కొత్త మెగా ప్లాంటును ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం భారత ప్రభుత్వ ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాల(పీఎల్‌ఐ) పథకం కింద ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్‌ సింగ్‌ సమక్షంలో కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వినోద్‌ కుమార్‌ అగర్వాల్‌, సీఈఓ హితేశ్‌ కుమార్‌ అగర్వాల్‌ ఒప్పందాలను మార్చుకున్నారు. ఖరీదైన దిగుమతులకు ప్రత్యామ్నాయంగా దేశంలో స్పెషాలిటీ ఉక్కు తయారీకి ఈ ప్రాజెక్టు తోడ్పడనుంది. పీఎల్‌ఐ పథకం అవసరాలకు తగ్గట్టుగా ఎంపీఎల్‌ గ్రూపు 2,50,000 టన్నుల సామర్థ్యంతో లోహ, నాన్‌ మెటాలిక్‌ అలాయ్‌, కోటెడ్‌ ఉత్పత్తులను తయారు చేసేందుకు ఈ పెట్టుబడి ప్రణాళికలను సిద్ధం చేసింది. తెలంగాణలోని మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలంలో సంస్థకు ఉన్న స్థలంలోనే ఈ ఉత్పత్తి కేంద్రం రానుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ కొత్త ప్లాంటును ప్రారంభించనున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని