ఏప్రిల్‌లో డిస్నీ 4000 ఉద్యోగాల కోత!

వినోద రంగ దిగ్గజం డిస్నీ వ్యయాల కోతకు సిద్ధమైంది. ఇందులో భాగంగా రాబోయే వారాల్లో లేఆఫ్‌ ఇచ్చేందుకు వీలున్న ఉద్యోగుల జాబితాలను తయారు చేయాల్సిందిగా మేనేజర్లను ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Published : 20 Mar 2023 01:59 IST

దిల్లీ: వినోద రంగ దిగ్గజం డిస్నీ వ్యయాల కోతకు సిద్ధమైంది. ఇందులో భాగంగా రాబోయే వారాల్లో లేఆఫ్‌ ఇచ్చేందుకు వీలున్న ఉద్యోగుల జాబితాలను తయారు చేయాల్సిందిగా మేనేజర్లను ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏప్రిల్‌లో కనీసం 4000 మంది ఉద్యోగుల లేఆఫ్‌ ఉండొచ్చని న్యూయార్క్‌ కేంద్రంగా పనిచేసే బిజినెస్‌ ఇన్‌సైడర్‌ అనే వెబ్‌సైట్‌ పేర్కొంది. ఏప్రిల్‌ 3న డిస్నీ వార్షిక సమావేశం జరగనుంది. అంతకుముందే వ్యయ నియంత్రణ చర్యలను ప్రకటించడం గమనార్హం.  సాధారణ వినోద కార్యక్రమాల్లో నిమగ్నమైన స్ట్రీమింగ్‌ సర్వీస్‌ హులూను ఏం చేయాలన్నదానిపైనా  పరిశీలిస్తోంది. హులూలో డిస్నీకి మూడింట రెండొంతుల వాటా ఉండగా, కామ్‌కాస్ట్‌ కార్పొరేషన్‌కు ఒక వంతు వాటా ఉంది. కంపెనీ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా 7000 మంది ఉద్యోగులను లేఆఫ్‌ చేయనున్నట్లు ఫిబ్రవరిలో కంపెనీ సీఈఓ బాబ్‌ ఐగర్‌ ప్రకటించారు. కంటెంట్‌ తగ్గింపు, వేతనాల కోత చేపట్టాలని నిర్ణయించారు. వచ్చే కొన్నేళ్లలో ఆటలతో సహా పలు విభాగాల్లో దాదాపు 3 బి.డాలర్ల పొదుపు చేయాలని డిస్నీ భావిస్తోంది.

అమెరికాలో విప్రో 120 మంది ఉద్యోగుల లేఆఫ్‌: వ్యాపార మార్పుల కారణంగా అమెరికాలోని ఫ్లోరిడాలో 120 మంది ఉద్యోగులను ఐటీ సంస్థ విప్రో లేఆఫ్‌ చేసింది. ఫ్లోరిడా ఆర్థిక అవకాశాల విభాగానికి నోటీసు రూపంలో లేఆఫ్‌ వివరాలను విప్రో అందించింది. ఫ్లోరిడాలోని టాంపాలో మాత్రమే ఉద్యోగాల కోత జరిగింది. ఇందులో 100 మంది ప్రాసెసింగ్‌ ఏజెంట్లు ఉండగా, మిగతా వారు టీమ్‌ సభ్యులు, మేనేజర్‌ ఉన్నారు. టాంపాలో ఖాతాదారులకు సేవలు అందిస్తున్న మిగతా ఉద్యోగులపై ఎటువంటి ప్రభావం ఉండబోదని విప్రో స్పష్టం చేసింది. శాశ్వత లేఆఫ్‌లు మేలో ప్రారంభం కావొచ్చని సమాచారం. అమెరికా, కెనడా, మెక్సికో, బ్రెజిల్‌ దేశాల్లో విప్రోకు దాదాపు 20,500 మంది ఉద్యోగులున్నారు.

అమెరికాలో లేఆఫ్‌లతో భారత్‌లో అవకాశాలు.. గ్లోబల్‌లాజిక్‌ సీఈఓ: అమెరికాలో టెక్‌ కంపెనీల లేఆఫ్‌లతో భారత్‌ ఐటీ రంగంలో అవకాశాలు పెరుగుతాయని గ్లోబల్‌లాజిక్‌ సీఈఓ నితీశ్‌ బంగా అంచనా వేశారు. అందువల్లే, ఆర్థిక వ్యవస్థ మందగమనంలోనూ దేశ ఐటీ రంగం గణనీయంగా వృద్ధి చెందొచ్చని తెలిపారు. భారత్‌లో నైపుణ్యాలను ఒడిసిపట్టుకోవడానికి చూస్తున్నామని, ఏటా ఉద్యోగులను 25-35 శాతం పెంచుకోవడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. అమెరికాలో భారీగా లేఆఫ్‌లు ఉన్నా, ఆప్రభావం మనపై ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. గ్లోబల్‌లాజిక్‌కు భారత్‌లో దాదాపు 15000 మంది ఉద్యోగులు ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని