56147- 57000 శ్రేణిలో మద్దతు!

అంతర్జాతీయ బ్యాంకింగ్‌ సంక్షోభం కారణంగా గతవారం మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అమెరికాలో 3 ప్రాంతీయ బ్యాంకులు, ఐరోపాలో క్రెడిట్‌ సూయిజ్‌ దివాలా అంచుకు చేరడం మదుపర్లను కలవరపెట్టింది.

Published : 20 Mar 2023 02:01 IST

సమీక్ష: అంతర్జాతీయ బ్యాంకింగ్‌ సంక్షోభం కారణంగా గతవారం మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అమెరికాలో 3 ప్రాంతీయ బ్యాంకులు, ఐరోపాలో క్రెడిట్‌ సూయిజ్‌ దివాలా అంచుకు చేరడం మదుపర్లను కలవరపెట్టింది. ఈ సంక్షోభం మాంద్యానికి దారితీయొచ్చన్న ఆందోళనలు పెరిగాయి. ఐరోపా కేంద్ర బ్యాంక్‌ (ఈసీబీ) వడ్డీ రేటును మరో 0.5% పెంచడం అప్రమత్తతకు కారణమైంది. దేశీయంగా చూస్తే.. టోకు ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 25 నెలల కనిష్ఠమైన 3.85 శాతానికి పరిమితమైంది. అగ్రదేశాలు మాంద్యంలోకి వెళ్తే గిరాకీ తగ్గొచ్చన్న అంచనాలతో బ్యారెల్‌ ముడిచమురు ధర 11.9% క్షీణించి 73 డాలర్ల వద్ద కదలాడుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 82.04 నుంచి 82.55కు బలహీనపడింది. అంతర్జాతీయంగా చూస్తే.. అమెరికా, ఐరోపా బ్యాంకుల సంక్షోభం మార్కెట్లను కలవరపెట్టింది. మార్కెట్లను కుదుటపరిచే చర్యలను అమెరికా ప్రభుత్వం, ఫెడ్‌, స్విస్‌ ప్రభుత్వం తీసుకుంటున్నాయి. మొత్తం మీద ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్‌ 1.9% శాతం నష్టంతో 57,990 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 1.8% తగ్గి 17,100 పాయింట్ల దగ్గర స్థిరపడింది. వాహన, ఐటీ, బ్యాంకింగ్‌ రంగాలు నిరాశపరచగా.. విద్యుత్‌, స్థిరాస్తి, మన్నికైన వినిమయ వస్తువుల షేర్లు మెరిశాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) నికరంగా రూ.7,954 కోట్ల షేర్లను విక్రయించగా, డీఐఐలు రూ.9,233 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. మార్చిలో ఇప్పటివరకు విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు (ఎఫ్‌పీఐలు) నికరంగా రూ.11,495 కోట్ల పెట్టుబడులు పెట్టారు.

లాభపడ్డ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి 4:3గా నమోదు కావడం..

ఎంపిక చేసిన షేర్లలో కొనుగోళ్లను సూచిస్తోంది.

ఈ వారంపై అంచనా: 200 రోజుల కదలికల సగటు అయిన 58700 పాయింట్లను కోల్పోయిన సెన్సెక్స్‌, వరుసగా రెండో వారం డీలాపడింది. ప్రస్తుతం సెన్సెక్స్‌కు 57000 పాయింట్ల వద్ద మద్దతు లభించే అవకాశం ఉంది. ఈ స్థాయిని కోల్పోతే మరింత బలహీనపడొచ్చు. మరోవైపు రికవరీ వస్తే 58,700 వద్ద ఒక నిరోధం, 60,000 వద్ద మరో నిరోధం ఎదురుకావొచ్చు.

ప్రభావిత అంశాలు: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి దేశీయ సూచీలు సంకేతాలను తీసుకోవచ్చు. అమెరికా, చైనా, ఇంగ్లాండ్‌ కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్ల నిర్ణయాలు కీలకం కానున్నాయి. సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌, ఫస్ట్‌ రిపబ్లిక్‌ బ్యాంక్‌, క్రెడిట్‌ సూయిజ్‌ తాజా పరిణామాలపై మదుపర్లు దృష్టి పెట్టొచ్చు. ఈ బ్యాంకులు కోలుకునేందుకు తీసుకునే చర్యలు ప్రభావం చూపొచ్చు. అధిక ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, వడ్డీ రేట్ల పెంపులు, అంతర్జాతీయ వృద్ధి భయాలతో మార్కెట్లలో ఒడుదొడుకులు కొనసాగే అవకాశం ఉంది. దేశీయంగా చూస్తే.. కీలక సంకేతాలు లేకపోవడంతో కార్పొరేట్‌ వార్తల ఆధారంగా షేరు/రంగం ఆధారిత కదలికలు చోటుచేసుకోవచ్చు. ఆర్‌బీఐ డిపాజిట్‌, రుణాల వృద్ధి గణాంకాలను విడుదల చేయనుంది. అంతర్జాతీయంగా చూస్తే.. ఈసీబీ తర్వాత అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ వడ్డీ రేట్లు పెంచొచ్చన్న అంచనాలు ఉన్నాయి. బ్యాంకింగ్‌ సంక్షోభంపై అమెరికా ఫెడ్‌ వ్యాఖ్యలపై కన్నేయొచ్చు. బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ సమ్మరీ ఆఫ్‌ ఒపీనియన్స్‌, యూరో ఏరియా జడ్‌ఈడబ్ల్యూ ఎకనామిక్‌ సెంటిమెంట్‌ సూచీ, అమెరికా గృహ విక్రయాలు, బ్రిటన్‌ ద్రవ్యోల్బణం, ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ ఫ్లాష్‌ పీఎంఐ గణాంకాలు విడుదల కానున్నాయి. ముడిచమురు ధరలు, రూపాయి కదలికలు, ఎఫ్‌ఐఐ కొనుగోళ్ల నుంచి సంకేతాలు తీసుకోవచ్చు. ఎఫ్‌ఐఐ విక్రయాలు కొనసాగితే రూపాయి ఒత్తిడికి గురికావొచ్చు.

తక్షణ మద్దతు స్థాయులు: 57,455, 57,000, 56,147;

తక్షణ నిరోధ స్థాయులు: 58,500, 59,000, 59,806

సెన్సెక్స్‌కు స్వల్పకాలంలో 56,147- 57,000 పాయింట్ల శ్రేణిలో బలమైన మద్దతు లభించొచ్చు.

సతీశ్‌ కంతేటి, జెన్‌ మనీ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని