ఐటీ షేర్లలో స్థిరీకరణకు అవకాశం

దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం ఒక శ్రేణికి లోబడి చలిస్తాయని కొంత మంది.. ఇప్పటికే స్థిరీకరణ కనిపించినందున లాభాలతో మొదలవుతాయని మరికొంత మంది విశ్లేషకులు అంటున్నారు.

Published : 20 Mar 2023 02:05 IST

16,800 దిగువకొస్తే నిఫ్టీలో దిద్దుబాటే
17,300 స్థాయి ఎగువన లాభాలు
లోహ, బ్యాంకు షేర్లలో సానుకూలతలు
విశ్లేషకుల అంచనాలు
స్టాక్‌ మార్కెట్‌ ఈ వారం

దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం ఒక శ్రేణికి లోబడి చలిస్తాయని కొంత మంది.. ఇప్పటికే స్థిరీకరణ కనిపించినందున లాభాలతో మొదలవుతాయని మరికొంత మంది విశ్లేషకులు అంటున్నారు. నిఫ్టీ-50కి 16,800 పాయింట్ల వద్ద మద్దతు లభించొచ్చని, 17,200 వద్ద నిరోధం ఎదురుకావొచ్చని చెబుతున్నారు. నిఫ్టీ 50 ఒక వేళ 16,800 వద్ద మద్దతును దొరకబుచ్చుకోలేకపోతే 16,450-16,400 వరకు దిగజారొచ్చని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. 17,300-17,350 స్థాయిని అధిగమిస్తేనే 17,500 లేదా అంతకంటే ఎగువకు వెళ్లగలదని అంటున్నారు. ఐటీ షేర్లలో కొంత స్థిరీకరణ కనిపించొచ్చనీ అంచనా వేస్తున్నారు.  ఈ వారం వెలువడే అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ విధాన నిర్ణయంపై మదుపర్లు దృష్టి సారించాలి. వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

* మార్కెట్‌పై సానుకూలతలున్నందున ఎఫ్‌ఎమ్‌సీజీ వంటి రక్షణాత్మక రంగాలకు మదుపర్లు దూరం జరగొచ్చు. అయితే వేసవి ఎండలు ముదురుతున్నందున, వరుణ్‌ బేవరేజెస్‌, రాడియో ఖైతాన్‌, గోద్రేజ్‌ కన్జూమర్‌ షేర్లు రాణించే అవకాశం ఉంది.

* కొంత లాభాల అనంతరం ఔషధ కంపెనీల షేర్లు ప్రతికూల ధోరణిలో స్థిరీకరణకు గురి కావొచ్చు. నిఫ్టీ ఫార్మా సూచీ 11,800-11,900 స్థాయికి చేరేవరకు ఒత్తిడిలోనే కొనసాగొచ్చు. దివీస్‌ లేబొరేటరీస్‌, ఇప్కా లేబొరేటరీస్‌, ఫైజర్‌ షేర్లలో బలహీనతలు ఉండొచ్చు.

* లోహ కంపెనీల షేర్లు సానుకూల ధోరణిలో చలించొచ్చు. చైనాలో గిరాకీ పుంజుకుంటుండడం ఇందుకు దోహదం చేయొచ్చు. టాటా స్టీల్‌, జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌, సెయిల్‌లలో ‘బులిష్‌’ ధోరణి కనిపించొచ్చు.

* యంత్ర పరికరాల షేర్లు స్వల్పకాలం నుంచి మధ్యకాలానికి సానుకూలంగా ఉండొచ్చు. ఎల్‌ అండ్‌ టీ, సీమెన్స్‌ తమ 50 రోజుల చలన సగటు కంటే పైనే కదలాడుతున్నాయి.  

* సిమెంటు కంపెనీల షేర్లు ఊగిసలాటలను ఎదుర్కోవచ్చు. గృహ విభాగం నుంచి గిరాకీ పెరుగుతున్నా.. ధరల పెంపును నిలబెట్టుకోవడానికి కంపెనీలు ఇబ్బందులు పడుతుండడం ఇందుకు నేపథ్యం. ఈ నేపథ్యంలో దీర్ఘకాల పెట్టుబడులపై జాగ్రత్త పడాలి.

* ఎస్‌వీబీ దివాలా నేపథ్యంలో, గురువారం సమీక్షలో అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌, వడ్డీరేట్లను 0.25% పెంచొచ్చు.. లేదా పెంచకపోవచ్చు. ఈ పరిమాణాన్ని బట్టి ఐటీ షేర్ల దిశ ఆధారపడి ఉంటుంది. టీసీఎస్‌ సీఈఓ హఠాత్‌ రాజీనామా నేపథ్యంలో ఆ కంపెనీ షేర్లను గమనించొచ్చు.

* టెలికాం షేర్లు ఒక శ్రేణికి లోబడి చలించొచ్చు. జియో మాతృ సంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లకు రూ.2,200 వద్ద బలమైన మద్దతు కనిపిస్తోంది.  

* ఐఓసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ వంటి చమురు రిఫైనింగ్‌ కంపెనీల షేర్లు రాణించొచ్చు. చమురు ధరలు తగ్గుతుండడంతో పాటు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ రేట్ల పెంపులో దూకుడుగా వెళ్లే అవకాశం లేకపోవడం ఇందుకు దోహదం చేయొచ్చు.  

* బ్యాంకు షేర్లు రాణించొచ్చు. నిఫ్టీ బ్యాంక్‌ సూచీ 38,600 స్థాయి నుంచి రికవరీ చెందడం సానుకూలాంశం. ఈ వారం 39,000-40,500 శ్రేణిలో చలించొచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఎస్‌బీఐ షేర్లపై దృష్టి సారించొచ్చు.

* వాహన కంపెనీల షేర్లలో స్థిరీకరణ ఏర్పడొచ్చు. చమురు ధరలు మరింత పడ్డా; రేట్ల పెంపుపై ఫెడ్‌ సానుకూలంగా స్పందించినా.. నిఫ్టీ వాహన సూచీకి సానుకూలతలు తీసుకురావొచ్చు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు