బిస్కెట్‌కే రూ.లక్ష అక్రమార్జన!

దేశంలోకి దొంగచాటుగా బంగారం తీసుకురావడం (స్మగ్లింగ్‌) అంతకంతకూ పెరుగుతోంది. దేశీయంగా పసిడి లభ్యత తక్కువగా ఉన్నందున, విదేశాల నుంచి దిగుమతులే మనకు అత్యధికం.

Updated : 20 Mar 2023 10:47 IST

పసిడి దొంగచాటు రవాణాకు ఇదే కారణం
2021లో 2,383 కిలోలు.. 2022లో 3,502 కిలోల పట్టివేత

దిల్లీ: దేశంలోకి దొంగచాటుగా బంగారం తీసుకురావడం (స్మగ్లింగ్‌) అంతకంతకూ పెరుగుతోంది. దేశీయంగా పసిడి లభ్యత తక్కువగా ఉన్నందున, విదేశాల నుంచి దిగుమతులే మనకు అత్యధికం. మేలిమి బంగారం (24 క్యారెట్లు-999 స్వచ్ఛత) గ్రాము ధర దాదాపు రూ.6,000కు చేరింది. పుత్తడిపై పన్నురేటు 18.45% కావడంతో, గ్రాముపై రూ.1100 రూపాయలు భారం పడుతోంది. అంటే 100 గ్రాముల మేలిమి బంగారం బిస్కెట్‌ దొంగచాటుగా తెచ్చినా, రూ.లక్షకు పైగా మిగులుతుందనే భావనతో స్మగ్లర్లు తీవ్రప్రయత్నాలు చేస్తున్నారు. దీనిని అడ్డుకునేందుకు ప్రభుత్వం నిఘా, తనిఖీలు పెంచుతోంది.

గతేడాది 47% అధికం: దేశంలోకి విమానాశ్రయాలు, ఓడరేవులు, భూమార్గం ద్వారా దొంగచాటుగా బంగారం తెస్తుంటారు. తనిఖీల్లో 2020లో 2,154.58 కిలోలు, 2021లో 2,383.38 కిలోల పసిడిని అక్రమార్కుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. 2022లో ఈ మొత్తం 47% అధికమై 3,502 కిలోలకు పెరగడం గమనార్హం. ఈ ఏడాది తొలి 2 నెలల్లోనే 916.37 కిలోల పసిడిని డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) స్వాధీనం చేసుకుంది.

ఈ మార్గాల్లో: విదేశాల నుంచి సాధారణ ప్రయాణికుల తరహాలో బంగారం బిస్కెట్లను, కరిగించి పేస్ట్‌ రూపంలో తెస్తుంటారు. కొందరు స్మగ్లర్లు ప్రయాణికులకు నగదు ఇచ్చి, ఇక్కడి తమ వారికి బంగారం చేరేలా చూస్తుంటారు. సరకు రవాణా మార్గాల్లోనూ పంపుతుంటారు. ఇలా పట్టుబడిన కేసులు 2021లో 2,445 అయితే, 2022లో 3,982కు చేరాయి. కేరళలో 4 అంతర్జాతీయ విమానాశ్రయాలుండగా, 2021లో 586.95 కిలోలు, 2022లో 755.81 కిలోల అక్రమ బంగారం పట్టుబడింది. 2022లో మహారాష్ట్రలో 535.65 కిలోలు, తమిళనాడులో 519 కిలోల బంగారం ఇలా దొరికిపోయింది.

ఇంతగా పట్టుబడుతున్నా ఎందుకంటే..: భారత్‌లో బంగారంపై బేసిక్‌ కస్టమ్స్‌ సుంకం 12.5% ఉంది. అంటే విదేశాల్లో ధర కంటే, మన దగ్గర ఇంతమేర అధికం. దీనికి వ్యవసాయ మౌలిక వసతుల సుంకం 2.5%, జీఎస్‌టీ 3% కలిపితే 18% అవుతుంది. మరికొన్ని సుంకాలు 0.45% ఉన్నందున, మొత్తం 18.45% పన్ను భారం బంగారంపై పడుతుంది. అంటే ప్రతి రూ.100 విలువకు రూ.18.45 పన్ను రూపేణానే అవుతోంది. విదేశాల నుంచి దొంగచాటుగా తేగలిగితే ఇదంతా మిగులుతుంది కనుకే అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. విదేశాల నుంచి మన దేశానికి వచ్చే కొందరు అమాయక ప్రయాణికులకు కూడా నగదు ఆశ చూపి, వారికి ఆభరణాలు ధరింప చేసి స్మగ్లర్లు ఇక్కడకు పంపుతున్నారు. అయితే వాటికి సరైన ఆధారాలు చూపలేనప్పుడు, విమానాశ్రయాల్లో అధికారులకు దొరికిపోతున్నారు. ఇలా కేసుల్లో ఇరుక్కునే వారి సంఖ్యా పెరుగుతోంది.

పన్ను తగ్గితే దొంగ రవాణా అరికట్టొచ్చా?

దిగుమతి సుంకం తగ్గిస్తే, స్మగ్లింగ్‌ తగ్గించవచ్చని పసిడి ఆభరణ పరిశ్రమ భావిస్తోంది. అయితే పసిడి బిల్లు రూపేణ, కరెంటు ఖాతా లోటు పెరుగుతున్నందున, దిగుమతులు తగ్గించేందుకే పన్ను విధిస్తున్నామని ప్రభుత్వం అంటోంది. విదేశాలకు, మన దగ్గర ధరల్లో అధిక తేడా మాత్రం అక్రమార్కుల పంట పండిస్తోందనే చెప్పాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని