సంక్షిప్త వార్తలు (9)
ముంద్రా పెట్రోకెమ్ ప్రాజెక్టుకు సంబంధించిన రుణ ఒప్పందాలు కూడా ఆర్థిక సంస్థల వద్ద పెండింగ్‌లో ఉన్నందున, ప్రస్తుతం పనులు నిలిపి వేస్తున్నట్లు అదానీ గ్రూప్ సోమవారం ధ్రువీకరించింది.
రుణ ఒప్పందాలు కుదరనందునే ముంద్రా పెట్రోకెమ్ పనులు ఆపేశాం: అదానీ
దిల్లీ: ఆర్థిక సంస్థలతో రుణ ఒప్పందాలు ఇంకా కుదరనందునే, గుజరాత్‌లోని ముంద్రాలో రూ.34,900 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయాలనుకున్న పెట్రోకెమ్ ప్రాజెక్టు పనులను నిలిపి వేసినట్లు అదానీ గ్రూప్ సోమవారం స్పష్టత ఇచ్చింది. గ్రూప్‌లో ప్రధాన సంస్థ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (ఏఈఎల్) తమ పూర్తి స్థాయి అనుబంధ సంస్థగా ముంద్రా పెట్రోకెమ్ లిమిటెడ్‌ను 2021లో ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ద్వారా గుజరాత్‌లోని కచ్ జిల్లాలో బొగ్గు నుంచి పీవీసీ వరకు గ్రీన్‌ఫీల్డ్ ప్లాంటును నెలకొల్పాలనుకుంది. ఇటీవల అమెరికా పరిశోధన సంస్థ హిండెన్‌బర్గ్ ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ భారీగా పడిపోవడంతో పాటు మదుపర్లలో ఆందోళన మొదలైంది. దీంతో అప్పులు తీర్చడంతో పాటు కొత్త ప్రాజెక్టుల జోలికి వెళ్లకూడదని సంస్థ నిర్ణయించుకుంది. ముంద్రా పెట్రోకెమ్ ప్రాజెక్టుకు సంబంధించిన రుణ ఒప్పందాలు కూడా ఆర్థిక సంస్థల వద్ద పెండింగ్‌లో ఉన్నందున, ప్రస్తుతం పనులు నిలిపి వేస్తున్నట్లు అదానీ గ్రూప్ సోమవారం ధ్రువీకరించింది.
ఫిబ్రవరిలో దేశీయ విమాన ప్రయాణికులు 1.20 కోట్లు
ముంబయి: గత నెలలో దేశీయ విమానాల్లో 1.20 కోట్ల మంది ప్రయాణించారు. 2022 ఫిబ్రవరిలో ప్రయాణించిన 76.96 లక్షల మందితో పోలిస్తే, ఈ సంఖ్య 56.82% అధికం. అత్యధికంగా 67.42 లక్షల మంది ప్రయాణికులను చేరవేయడం ద్వారా 55.9% మార్కెట్ వాటాతో ఇండిగో మొదటి స్థానంలో ఉంది. టాటా గ్రూప్‌లోని ఎయిరిండియా, ఎయిరేషియా ఇండియా, విస్తారా విమానాల్లో మొత్తంగా 29.75 లక్షల మంది ప్రయాణించారు. ఈ మూడు సంస్థలకు కలిపి మార్కెట్ వాటా 24.6 శాతంగా ఉంది. స్పైస్‌జెట్ అత్యధికంగా 91 శాతం సీట్ల భర్తీ సాధిస్తోంది. సమయపాలనలో ఇండిగోదే అగ్రస్థానం.
హైదరాబాద్‌లో సిలియో కాన్సెప్ట్ స్టోర్
ఈనాడు, హైదరాబాద్: ఫ్రాన్స్‌కు చెందిన పురుషుల దుస్తుల బ్రాండ్ సిలియో, హైదరాబాద్‌లోని శరత్ సిటీ మాల్‌లో 3 వేల అడుగుల్లో తమ తొలి కాన్సెప్ట్ స్టోరును ప్రారంభించింది. కంపెనీకి దేశంలో అతి పెద్ద స్టోర్ అని సిలియో ఇండియా సీఈఓ సత్యన్ మోమయ అన్నారు.
ఆర్‌బీఎల్ బ్యాంక్‌కు ఆర్‌బీఐ రూ.2.27 కోట్ల జరిమానా
ముంబయి: వసూళ్ల ఏజెంట్లకు సంబంధించి నిబంధనల పాటింపులో విఫలమవ్వడంతో ఆర్‌బీఎల్ బ్యాంక్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రూ.2.27 కోట్ల జరిమానా విధించింది. ‘ఇంటర్నల్ అంబుడ్స్‌మన్ స్కీమ్- 2018’, ‘ఫెయిర్ ప్రాక్టీసెస్ కోడ్ ఫర్ లెండర్స్’, ‘క్రెడిట్ కార్డ్ ఆపరేషన్స్ ఆఫ్ బ్యాంక్స్’, ‘మేనేజింగ్ రిస్క్ అండ్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇన్ అవుట్‌సోర్సింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ బై బ్యాంక్స్’; ‘రికవరీ ఏజెంట్స్ ఎంగేజ్డ్ బై బ్యాంక్స్’కు సంబంధించి జారీ చేసిన నిబంధనలను పాటించనందుకు ఈ జరిమానా విధించినట్లు ఆర్‌బీఐ తెలిపింది. 2018-19 నుంచి 2021-22 మధ్యకాలంలో ఆర్‌బీఎల్‌లో నిబంధనల ఉల్లంఘనను గుర్తించినట్లు పేర్కొంది. అయితే వినియోగదార్లతో బ్యాంకు కుదుర్చుకున్న ఒప్పందాలు లేదా లావాదేవీల వివరాలను ఇక్కడ ప్రస్తావించే ఉద్దేశం తనకు లేదని ఆర్‌బీఐ పేర్కొంది.
బిస్లరీని అమ్మే యోచన లేదు
రమేశ్ చౌహాన్
దిల్లీ: తాగునీటిని సీసాల్లో విక్రయించే బ్రాండ్ బిస్లరీ ఇంటర్నేషనల్‌ను విక్రయించే యోచన లేదని ఆ సంస్థ ఛైర్మన్ రమేశ్ చౌహాన్ తెలిపారు. ఇందుకోసం ఎలాంటి సంప్రదింపులూ చేయట్లేదని పేర్కొన్నారు. బిస్లరీ కొనుగోలు చేసేందుకు జరిపిన చర్చలు ఆపేసినట్లు టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ ప్రకటించిన మూడు రోజుల్లోనే బిస్లరీ ఛైర్మన్ ఈ స్పష్టత ఇచ్చారు. సుమారు నాలుగు నెలల పాటు టాటా కన్జూమర్‌తో చౌహాన్ సంప్రదింపులు జరిపినప్పటికీ.. అవి ఫలప్రదం కాలేదు.
స్టార్‌బక్స్ సీఈఓగా లక్ష్మణ్ బాధ్యతల స్వీకరణ
న్యూయార్క్: అంతర్జాతీయ కాఫీ దిగ్గజం స్టార్‌బక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈఓ)గా భారత సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్ బాధ్యతలను స్వీకరించారు. గత సెప్టెంబరులోనే కంపెనీ తదుపరి సీఈఓ, బోర్డు సభ్యుడిగా నరసింహన్‌ను ప్రకటించింది. కంపెనీ వ్యవస్థాపకుడు, తాజా మాజీ సీఈఓ హోవర్డ్ స్కాల్జ్ స్థానాన్ని ఆయన భర్తీ చేశారు. ఈనెల 23న జరగబోయే వార్షిక వాటాదార్ల సమావేశానికి నరసింహన్ నేతృత్వం వహించనున్నారు. తాజా పరిణామంతో అంతర్జాతీయ దిగ్గజ సంస్థల సీఈఓలుగా ఉన్న భారతీయ సంతతి వ్యక్తుల జాబితాలో ఇంకొకరు చేరినట్లయింది.
అమెజాన్‌లో మరో 9,000 ఉద్యోగాల కోత
న్యూయార్క్: వచ్చే కొన్ని వారాల్లో మరో 9,000 మంది ఉద్యోగులను తొలగించే ప్రణాళికలో ఉన్నట్లు అమెజాన్ సీఈఓ యాండీ జాస్సీ సిబ్బందికి సోమవారం సమాచారమిచ్చారు. కంపెనీ చరిత్రలో భారీస్థాయిలో ఉద్యోగ కోతలు విధించడం ఇది రెండోసారి. జనవరిలో తొలగించిన 18,000 మంది ఉద్యోగులకు తాజా కోతలు అదనమని కంపెనీ తెలిపింది. కంపెనీ వార్షిక ప్రణాళిక ప్రక్రియ ఈ నెలలోనే పూర్తయిందని, అదనంగా ఉద్యోగ కోతలకు దిగాలని నిర్ణయించుకున్నట్లు యాండీ వెల్లడించారు.
ఆర్‌బీఐకు మరో ఆరు వారాల సమయం
విదేశీ లావాదేవీల కేసు వ్యవహారంలో వివరణ సమర్పణకు
దిల్లీ: నల్ల ధనం, బినామీ లావాదేవీలను నియంత్రించే నిమిత్తం విదేశీ మారకపు లావాదేవీలకు ఏకరీతి బ్యాంకింగ్ కోడ్ అమలుకు సంబంధించి దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై స్పందించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)కు మరో ఆరు వారాల సమయాన్ని దిల్లీ హైకోర్టు ఇచ్చింది. ఈ వ్యాజ్యంపై వివరణ సమర్పించేందుకు చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ సుబ్రమణియమ్ ప్రసాద్ నేతృత్వంలోని ధర్మాసనాన్ని ఆర్‌బీఐ తరపు న్యాయవాది అశ్వనీ కుమార్ కొంత సమయాన్ని అడిగారు. విదేశీ నిధుల బదిలీకి సంబంధించి వ్యవస్థలో కొన్ని లొసుగులు ఉన్నాయని కూడా పిటీషనర్ వాదించారు. ‘ఈ కేసులో ఆర్‌బీఐను ఇటీవలే చేర్చినందున... ఆరు వారాల సమయాన్ని ఆర్‌బీఐ తరపు న్యాయవాది అడిగారు. ఆయన వినతి మేరకు ఆరు వారాల సమయాన్ని మంజూరు చేశామ’ని కోర్టు తెలిపింది. తదుపరి విచారణను జులైలో చేపడతామని పేర్కొంది. విదేశీ మారకపు లావాదేవీల వ్యవహారంపై విస్తృత వాదనలు అవసరమని గతేడాది డిసెంబరు 5న కోర్టు అభిప్రాయపడుతూ.. ఈ పిటిషన్‌పై ఆర్‌బీఐ వివరణ సమర్పించాలని అడిగింది. భారత బ్యాంకుల్లో విదేశీ నిధుల జమకు ఆర్‌టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీస్‌లను వాడుతున్నారా అనే విషయాన్ని కూడా తెలియజేయాలని పిటిషన్‌లో కోరారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Odisha Train Accident: నా హృదయం ముక్కలైంది.. రైలు ప్రమాదంపై బైడెన్ దిగ్భ్రాంతి
-
General News
Katakam Sudarshan: గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత మృతి
-
Crime News
Kakinada: గుడిలోకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురి మృతి
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ts-top-news News
ECI: 1,500 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం
-
Politics News
Raghurama: బాబాయ్‌కి ప్రత్యేకహోదా సాధించిన జగన్: రఘురామ