క్రెడిట్‌ సూయిజ్‌ సంక్షోభానికి తెర

క్రెడిట్‌ సూయిజ్‌ బ్యాంక్‌.. 166 ఏళ్ల ఘన చరిత ఉన్న స్విస్‌ అతిపెద్ద బ్యాంకు ఇది. ఈ బ్యాంక్‌ పతనం అంచులకు చేరడంతో ఐరోపా బ్యాంకులన్నీ బెంబేలెత్తిపోయాయి.

Updated : 21 Mar 2023 06:55 IST

3.25 బి. డాలర్లతో కొననున్న యూబీఎస్‌
ఈ నేపథ్యంలో భారీగా క్షీణించిన షేర్లు
ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్‌ షేర్లపై ప్రభావం

క్రెడిట్‌ సూయిజ్‌ బ్యాంక్‌.. 166 ఏళ్ల ఘన చరిత ఉన్న స్విస్‌ అతిపెద్ద బ్యాంకు ఇది. ఈ బ్యాంక్‌ పతనం అంచులకు చేరడంతో ఐరోపా బ్యాంకులన్నీ బెంబేలెత్తిపోయాయి. అప్పటికే అమెరికాలో ఎస్‌వీబీ, సిగ్నేచర్‌ బ్యాంకులు దివాలా తీసిన నేపథ్యంలో.. రంగంలోకి దిగిన స్విస్‌ ప్రభుత్వం  యూబీఎస్‌తో చర్చించి క్రెడిట్‌ సూయిజ్‌ బ్యాంక్‌ను కొనుగోలు చేసేలా పావులు కదిపింది. 3.25 బి. డాలర్లతో క్రెడిట్‌ సూయిజ్‌ను కొనుగోలు చేస్తున్నట్లు యూబీఎస్‌ ప్రకటించింది. ఈ పరిణామాలతో క్రెడిట్‌ సూయిజ్‌ బ్యాంక్‌ షేరు 63%, యూబీఎస్‌ షేరు 14% వరకు కుంగాయి.  (సోమవారం ట్రేడింగ్‌ చివరకు ఇవి వరుసగా 56% నష్టంతో, 1.26% లాభంతో ముగిశాయి.) ఈ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా బ్యాంకు షేర్లపైనా కనిపించింది.

ఎందుకు పతనమైందంటే..

1856లో స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌ కేంద్రంగా ఏర్పాటైన క్రెడిట్‌ సూయిజ్‌ బ్యాంక్‌ తొలుత రైల్‌ నెట్‌వర్క్‌కు నిధులు సమకూర్చడమే లక్ష్యంగా ప్రారంభమైంది. తర్వాత ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌గా ఎదిగింది. ప్రపంచంలోని అత్యుత్తమ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకుల్లో ఎనిమిదో స్థానానికి చేరింది. స్విట్జర్లాండ్‌లో యూబీఎస్‌ తర్వాత రెండో అతి పెద్ద బ్యాంక్‌గా నిలిచింది. ఈ బ్యాంక్‌కు ఎలా కష్టాలొచ్చాయంటే..

* పెద్ద ఎత్తున రుణాలు తీసుకున్న కంపెనీలు బోర్డులు తిప్పేయడం.. బ్యాంకు అధికారుల్లో కొందరి అవినీతి.. డిపాజిటర్లలో విశ్వాసం నింపాల్సిన యాజమాన్యం కొద్ది రోజుల వ్యవధిలోనే కుర్చీ దిగిపోవడం వంటివి ప్రధాన కారణాలుగా చెప్పాలి. కొన్నేళ్ల క్రితమే ఇందుకు బీజం పడింది.

* అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ ఆర్కిగోస్‌ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీకి భారీగా రుణాలివ్వగా.. ఆ సంస్థ 2021లో కుప్పకూలింది. దీంతో బ్యాంక్‌కు 5.5 బిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లింది. భారీగా అప్పులు తీసుకున్న గ్రీన్‌సిల్‌ క్యాపిటల్‌ అనే సప్లయ్‌ చైన్‌ నెట్‌వర్క్‌ సైతం దివాలా తీయడంతో నష్టం మరింత పెరిగింది. ఈ రెండు ఎదురు దెబ్బల కారణంగా క్రెడిట్‌ సూయిజ్‌ ఏకంగా 10 బి.డాలర్లు నష్టపోయింది.

* మొజాంబిక్‌లో అవినీతి ఆరోపణలు, మాజీ ఉద్యోగులపై గూఢచర్యం ఆరోపణలు ఉన్నాయి. అమెరికా, బ్రిటన్‌లలో కేసుల వల్ల భారీగా పరిహారాలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బ్యాంక్‌ను గాడిన పెట్టాల్సిన ఉన్నత యాజమాన్యం ఎప్పటికప్పుడు మారడమూ బ్యాంక్‌కు గట్టి దెబ్బగా మారింది.  

భయాలతో డిపాజిట్లు వెనక్కి..

క్రెడిట్‌ సూయిజ్‌లో చోటుచేసుకున్న వరుస పరిణామాలతో ఖాతాదార్లు తమ డిపాజిట్లను వెనక్కి తీసుకోవడం మొదలు పెట్టారు. ఫలితంగా ఒక్క 2022లోనే 7.8 బిలియన్‌ ఫ్రాంక్ల నష్టాన్ని చవిచూసింది. దీనికి తోడు క్రెడిట్‌ సూయిజ్‌లో పెద్ద వాటాదారైన సౌదీ నేషనల్‌ బ్యాంక్‌ తాము మరిన్ని నిధులను ఇవ్వలేమని తేల్చిచెప్పడం భయాలను మరింత పెంచింది. దీంతో ఒక్కరోజే క్రెడిట్‌ సూయిజ్‌ షేరు 63% పతనమై, మరోసారి బ్యాంకింగ్‌ సంక్షోభానికి ఆజ్యం పోశాయి. దీంతో స్విస్‌ ప్రభుత్వం రంగంలోకి దిగాల్సి వచ్చింది.

9000 మంది ఇంటికి!

కొనుగోలు అనంతరం వ్యయ నియంత్రణ కోసం 9,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపాలని యూబీఎస్‌ నిర్ణయించింది. రెండు బ్యాంకులకు కలిపి ప్రస్తుతం లక్షా 25 వేలమంది ఉద్యోగులు ఉన్నారు. క్రెడిట్‌ సూయిజ్‌ను లాభదాయకతలోకి తీసుకురావాలంటే ఉద్యోగుల కోత తప్పదని సంబంధిత వర్గాలు అంటున్నాయి.


సిగ్నేచర్‌ బ్యాంకు కూడా బయటపడినట్లే!

అమెరికాలో కుప్పకూలిన సిగ్నేచర్‌ బ్యాంక్‌ను కొనుగోలు చేయడానికి న్యూయార్క్‌ కమ్యూనిటీ బ్యాంక్‌ అంగీకరించింది. సోమవారం నుంచి సిగ్నేచర్‌ బ్యాంక్‌కు చెందిన 40 శాఖలు న్యూయార్క్‌ కమ్యూనిటీ బ్యాంక్‌ అనుబంధ సంస్థల్లో ఒకటైన ఫ్లాగ్‌స్టార్‌ బ్యాంక్‌ కిందకు వస్తాయి. సిగ్నేచర్‌ బ్యాంక్‌కు చెందిన 38.4 బిలియన్‌ డాలర్ల ఆస్తులను కొనుగోలు చేస్తారు. వారం కిందట ఈ బ్యాంకు వైఫల్యం చెందడానికి ముందున్న విలువలో ఇది మూడో వంతు కంటే కాస్త ఎక్కువ.

ఎస్‌వీబీ బిడ్డింగ్‌కు మరింత గడువు: అమెరికాలో ఈనెలలో తొలుత కుప్పకూలిన సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ను పూర్తిగా, పాక్షికంగా విక్రయించడానికి చేపట్టిన బిడ్డింగ్‌ ప్రక్రియకు ఫెడరల్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ కార్ప్‌(ఎఫ్‌డీఐసీ) మరింత గడువు ఇచ్చింది. అదే సమయంలో సిలికాన్‌ వ్యాలీ బ్రిడ్జ్‌ బ్యాంక్‌, అనుబంధ సంస్థ సిలికాన్‌ వ్యాలీ ప్రైవేట్‌ బ్యాంక్‌లకు విడివిడిగా, వరుసగా శుక్రవారం, బుధవారంలోగా బిడ్‌లు దాఖలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ మాతృ సంస్థ ఎస్‌వీబీ ఫైనాన్షియల్‌ గ్రూప్‌ ఇప్పటికే దివాలా పిటిషన్‌ దాఖలు చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు