కార్‌.. డిమాండ్‌ కొన్ని మోడళ్లకే

కార్ల విక్రయాల్లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. తమకు కావాల్సిన కారు కోసం కొందరు వినియోగదార్లు నెలల తరబడి వేచి ఉండే పరిస్థితి కొన్ని మోడళ్లలో నెలకొంటే, మరికొన్ని మోడళ్ల కార్ల నిల్వలు డీలర్ల వద్ద పేరుకుపోతున్నాయి.

Updated : 21 Mar 2023 09:42 IST

ఆర్డరు ఇచ్చాక డెలివరీకి నెలలు కూడా
డీలర్ల వద్ద పేరుకుంటున్న చిన్నకార్లు
2019 తర్వాత ఇప్పుడే అధికం  

ఈనాడు, హైదరాబాద్‌: కార్ల విక్రయాల్లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. తమకు కావాల్సిన కారు కోసం కొందరు వినియోగదార్లు నెలల తరబడి వేచి ఉండే పరిస్థితి కొన్ని మోడళ్లలో నెలకొంటే, మరికొన్ని మోడళ్ల కార్ల నిల్వలు డీలర్ల వద్ద పేరుకుపోతున్నాయి. డెలివరీ ఇవ్వాల్సిన కార్ల సంఖ్య 8 లక్షల మేర ఉందని కంపెనీలు చెబుతుండగా, డీలర్ల వద్ద అమ్మకాలు సాగాల్సిన కార్లు 3 లక్షల మేర ఉన్నాయని కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఆర్థిక మందగమనం, వడ్డీ రేట్లు పెరుగుతుండటం, ఉద్యోగాల్లో కోత వల్ల తాజా బుకింగ్‌ల్లోనూ మునుపటి వేగం కనిపించడం లేదు. ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్న బీఎస్‌6 రెండోదశ ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా కంపెనీలు తమ మోడళ్లను ఆధునికీకరించాయి. చిన్న కార్లకు గిరాకీ తగ్గుతోందని, స్పోర్ట్స్‌ వినియోగ వాహనా (ఎస్‌యూవీ)లకు గిరాకీ ఎక్కువగా ఉంటోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అంటే ద్రవ్యోల్బణ ప్రభావం అంతగా ఉండని, అధికాదాయ వర్గాల వారే కార్లు కొనేందుకు ముందుకు వస్తున్నారు.

జనవరి నుంచి కార్ల బుకింగ్‌ల కోసం షోరూంలకు వచ్చే వారి సంఖ్య 8-10% తగ్గిందని నివేదికలు చెబుతున్నాయి. డీలర్ల దగ్గర దాదాపు 3,00,000 కార్లు (సుమారు రూ.20వేల కోట్ల విలువైన) నిల్వ ఉన్నాయని అంచనా. 2019 తర్వాత ఈ స్థాయిలో నిల్వలుండటం ఇప్పుడేనని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. 2022 డిసెంబరులో కనిష్ఠంగా 1,00,000 కార్లే నిల్వ ఉండటం గమనార్హం. కొవిడ్‌ పరిణామాల నుంచి సొంత వాహనం కొనుగోలుకు అత్యధికులు ఉత్సాహం చూపారు. అప్పట్లో వడ్డీరేట్లు తక్కువగా ఉండటమూ కలిసొచ్చింది. అయితే చిప్‌సెట్ల కొరత వల్ల ఆమేర తయారీ జరగలేదు. ఫలితంగా కొత్త కార్ల కోసం దాదాపు 8లక్షలకు పైగా బుకింగ్‌ ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బుకింగ్‌ల వృద్ధి రేటు పెరిగిన నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది నెమ్మదిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.

త్వరగా పొందేందుకు

కొన్ని ఎస్‌యూవీల కోసం 18 నెలలు, ఇంకొన్ని కార్లకు 4-6 వారాలు ఎదురుచూడాల్సి వస్తోంది. ‘గిరాకీ ఉన్న మోడళ్లను తొందరగా సొంతం చేసుకునేందుకు, ఒక్కో వినియోగదారుడు ఇద్దరు-ముగ్గురు డీలర్ల వద్ద, 2-3 మోడళ్లను బుక్‌ చేసుకుంటున్నారు. ఇవి  బుకింగ్‌ గణాంకాలు పెరిగేందుకు కొంత కారణం కావచ్చు. వీటిల్లో కొన్ని రద్దయ్యే అవకాశమూ ఉంద’ని ఒక డీలర్‌ తెలిపారు.

చిన్న కార్లకు చిక్కులు: భారత్‌ స్టేజ్‌ 6 (బీఎస్‌6) ఉద్గార ప్రమాణాలకు మారడం, భద్రతా పరమైన మరికొన్ని నిబంధనల కోసం తయారీలో మార్పులు చేయాల్సి రావడంతో, ప్రారంభస్థాయిగా పేర్కొనే చిన్న కార్ల ధరలను కంపెనీలు ఏడాదిలో మూడు సార్లు పెంచాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రుణ రేట్లు 2.50% పెరిగాయి. కొనుగోలుదార్ల సెంటిమెంట్‌ను ఈ పరిణామాలు ప్రభావితం చేస్తున్నాయి. ఆర్థిక మందగమనం, అధిక ద్రవ్యోల్బణ ప్రభావం మధ్యతరగతి వర్గీయులపై ప్రభావం చూపుతున్నందునే.. వీరు ఆసక్తి చూపే చిన్న కార్ల విక్రయాలు తగ్గుతున్నాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చిన్నకార్లు విలాసవంతమైనవి కావు కనుక, వీటిపై జీఎస్‌టీని 28% నుంచి 18 శాతానికి తగ్గించాలని పరిశ్రమ వర్గాలు అభ్యర్థిస్తున్నాయి. అప్పుడు గిరాకీ పెరిగి, డీలర్ల వద్ద ఉన్న కార్ల విక్రయాలు పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

ఎస్‌యూవీలకే గిరాకీ..

కొత్త మోడళ్లు, ఎస్‌యూవీలకు గిరాకీ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా టయోటా హైక్రాస్‌, మహీంద్రా థార్‌, టయోటా హైరైడర్‌, మహీంద్రా స్కార్పియో, మహీంద్రా ఎక్స్‌యూవీ 700, కియా కారెన్స్‌, మారుతీ బ్రెజ్జా, కియా సోనెట్‌, హ్యుందాయ్‌ క్రెటా, మారుతీ గ్రాండ్‌ విటారా తదితర మోడళ్ల కోసం 6-18 నెలల పాటు వేచి చూడాల్సి వస్తోంది. మరోవైపు కొన్ని మోడళ్ల విద్యుత్‌ కార్లను సొంతం చేసుకోవాలంటే ఏడాది వరకూ ఎదురుచూడాలని పేర్కొంటున్నారు.

* మొత్తంమీద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కార్ల అమ్మకాలు గతేడాది కంటే  26% పెరిగి 38 లక్షలకు చేరొచ్చన్నది పరిశ్రమ అంచనా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని