పీఎస్‌యూల నష్టం రూ.1.5 లక్షల కోట్లు

గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సీపీఎస్‌ఈలు) మొత్తంగా రూ.1.5 లక్షల కోట్ల నష్టాన్ని చవిచూశాయని రాజ్యసభకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కరాడ్‌ వెల్లడించారు.

Published : 22 Mar 2023 01:41 IST

గత ఐదు ఆర్థిక సంవత్సరాలపై ఆర్థిక శాఖ వెల్లడి

దిల్లీ: గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సీపీఎస్‌ఈలు) మొత్తంగా రూ.1.5 లక్షల కోట్ల నష్టాన్ని చవిచూశాయని రాజ్యసభకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కరాడ్‌ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. 2021-22 చివరి నాటికి 248 సీపీఎస్‌ఈలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. 2017-18లో 72 సంస్థలు నష్టాలు నమోదుచేయగా, 2018-19లో ఈ సంఖ్య 69కి తగ్గింది. 2019-20లో మళ్లీ 84కి పెరిగింది. అప్పటి నుంచి నష్టాలు నమోదు చేస్తున్న సంస్థల సంఖ్య తగ్గుతూ వచ్చింది. 2020-21లో 76గాను, 2021-22లో 59గాను నమోదైంది. పీఎస్‌యూల మొత్తం నష్టాల విషయానికొస్తే.. గతేడాది గణనీయంగా తగ్గి రూ.14,586 కోట్లకు పరిమితమైంది. 2019-20లో ఇది రూ.44,239 కోట్లుగా ఉంది. 2017-18 నుంచి 2021-22లో మొత్తంగా సీపీఎస్‌యూల నష్టం రూ.1.54 లక్షల కోట్లుగా నమోదైంది. ‘సంస్థలను గాడిలో పెట్టేందుకు సంస్థ ఆధారిత చర్యలను సంబంధిత బోర్డులు, మంత్రిత్వ శాఖలు చేపట్టాయి. వ్యాపార పునర్‌వ్యవస్థీకరణ, సంయుక్త సంస్థల ఏర్పాటు, ఆధునికీకరణ, మార్కెటింగ్‌ వ్యూహాలు మెరుగుపర్చడం లాంటివి ఇందులో ఉన్నాయి. 2021 ఫిబ్రవరిలో కొత్త సీపీఎస్‌ఈ విధానాన్ని కూడా ప్రభుత్వం నోటిఫై చేసింది. సీపీఎస్‌ఈలను వ్యూహాత్మక, వ్యూహాత్మకేతర రంగాలుగా వర్గీకరించి, కొత్త విధానంలోని మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు చేపడుతున్నట్లు’ మంత్రి కరాడ్‌ రాజ్యసభకు తెలియజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని