ఆఫీసు స్థలానికి గిరాకీ అంతంతే

ఆఫీసు స్థలానికి ఈ ఏడాది పెద్ద గిరాకీ ఉండకపోవచ్చని కొలియర్స్‌ ఇండియా-ఫిక్కీ నివేదిక అంచనా వేసింది.

Updated : 22 Mar 2023 01:45 IST

ఈ ఏడాదిపై ఫిక్కీ- కొలియర్స్‌ ఇండియా నివేదిక

ఈనాడు, హైదరాబాద్‌: ఆఫీసు స్థలానికి ఈ ఏడాది పెద్ద గిరాకీ ఉండకపోవచ్చని కొలియర్స్‌ ఇండియా-ఫిక్కీ నివేదిక అంచనా వేసింది. 2023లో 35-38 మి.చదరపు అడుగుల ఆఫీసు స్థలాన్ని మాత్రమే వ్యాపార సంస్థలు అద్దెకు తీసుకునే అవకాశం ఉందని పేర్కొంది. గతేడాది లీజుకు తీసుకున్న 50.3 మి.చదరపు అడుగులతో పోలిస్తే, ఇది 25-30% తక్కువని పేర్కొంది. ఒకవేళ ఆర్థిక మాంద్యం చోటుచేసుకుంటే అద్దెకు తీసుకునే ఆఫీసు స్థలం 30-33 మి.చదరపు అడుగులకు పరిమితం కావచ్చని విశ్లేషించింది. ఈ నివేదిక కోసం దిల్లీ-ఎన్‌సీఆర్‌, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై, పుణెల్లోని స్థిరాస్తి ధోరణులను విశ్లేషించారు. 

లేఆఫ్‌లతో ఐటీలో కోత: లేఆఫ్‌లు అధికంగా ఉన్నందున ఐటీ రంగం నుంచి ఈ ఏడాదిలో ఆఫీసు స్థలానికి ఆశించినంత గిరాకీ ఉండదని నివేదిక విశ్లేషించింది. అయితే ఇంజినీరింగ్‌, బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, బీమా  రంగాల కంపెనీలు తమ ప్రణాళికల ప్రకారమే ఆఫీసు స్థలాన్ని అద్దెకు తీసుకుంటాయని పేర్కొంది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ప్రపంచ వ్యాప్తంగా వ్యాపార, ఆర్థిక పరిస్థితులు సర్దుకుంటాయని, అప్పటి నుంచి ఆఫీసు స్థలాన్ని అద్దెకు తీసుకోవటం పెరుగుతుందని వివరించింది.

ఈ అంశాలూ కారణమే: ఫ్లెక్స్‌ స్పేసెస్‌, హైబ్రిడ్‌ వర్క్‌ మోడ్‌ వంటి విధానాల వల్ల కూడా కంపెనీలకు ఆఫీసు స్థలం అవసరాలు గతంలో మాదిరి అధికంగా ఉండటం లేదని నివేదిక పేర్కొంది. వ్యయాలు తగ్గించుకునే వీలున్నందున, ఈ నూతన పని విధానాలను ఐటీ కంపెనీలు అనుసరిస్తున్నాయని వివరించింది. గత ఏడాది సెప్టెంబరులో ‘హైబ్రిడ్‌ పని విధానా’న్ని అమలు చేస్తున్న కంపెనీల సంఖ్య 63% వరకు ఉంది. మున్ముందు ఈ పద్ధతి ఇంకా పెరుగుతుందని కొలియర్స్‌ ఇండియా సీనియర్‌ డైరెక్టర్‌ విమల్‌ నాడార్‌ పేర్కొన్నారు.


ప్రథమ శ్రేణి నగరాల్లోనే ఇళ్లకు అధిక గిరాకీ 

దేశంలోని ప్రథమ శ్రేణి నగరాల్లోనే ఇళ్లకు అధిక గిరాకీ ఉన్నట్లు ప్రాప్‌ఈక్విటీ నివేదికలో విశ్లేషించింది. గత ఏడాదిలో ద్వితీయ శ్రేణి నగరాలతో పోల్చితే ప్రథమ శ్రేణి నగరాల్లో ఇళ్ల అమ్మకాలు 250% అధికంగా నమోదైనట్లు పేర్కొంది. ప్రథమ శ్రేణి నగరాల్లో హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, దిల్లీ, నోయిడా, ఫరీదాబాద్‌, ఘజియాబాద్‌, గ్రేటర్‌ నోయిడా, గురుగ్రామ్‌, కోల్‌కతా, ముంబయి, థానే, పుణె ఉన్నాయి. ఈ నగరాల్లో గత ఏడాదిలో 4.53 లక్షల ఇళ్ల అమ్మకాలు నమోదయ్యాయి. అదే సమయంలో ద్వితీయ శ్రేణి నగరాల్లో అమ్మకాలు 1.83 లక్షలే. ద్వితీయ శ్రేణి నగరాల్లో అహ్మదాబాద్‌, వడోదర, అమృత్‌సర్‌, భోపాల్‌, భువనేశ్వర్‌, విశాఖపట్నం తదితర నగరాలున్నాయి. కొత్త ప్రాజెక్టులు ప్రథమశ్రేణి నగరాల్లో అధికంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగావకాశాలు, మెరుగైన సదుపాయాలు ఉండటం వల్లే ఈ నగరాల్లో ఇళ్ల కొనుగోలుకు ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నట్లు ప్రాప్‌ఈక్విటీ ఎండీ సమీర్‌ జాసుజా వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని