మన ఐటీపై బ్యాంకింగ్‌ సంక్షోభ ప్రభావం!

అమెరికాలో సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌.. ఐరోపాలో క్రెడిట్‌ సూయిజ్‌.. దివాలా అంచులకు చేరడంతో అంతర్జాతీయంగా బ్యాంకింగ్‌ రంగంపై ఆందోళన మొదలైంది.

Updated : 22 Mar 2023 08:31 IST

ప్రాజెక్టు వ్యయాలపై ఒత్తిడి
2023-24 వృద్ధిపై పడొచ్చు: విశ్లేషకులు

అమెరికాలో సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌.. ఐరోపాలో క్రెడిట్‌ సూయిజ్‌.. దివాలా అంచులకు చేరడంతో అంతర్జాతీయంగా బ్యాంకింగ్‌ రంగంపై ఆందోళన మొదలైంది. భారత ఐటీ కంపెనీలకు బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్‌ఎస్‌ఐ) రంగాలు అత్యంత కీలకం. ఈ రంగాల్లోని సంస్థల్లో అత్యధికం మన ఐటీ కంపెనీలకు ఖాతాదార్లుగా ఉన్నాయి. 2022-23 మన ఐటీ సంస్థల ఆదాయాల్లో 41% వాటా బీఎఫ్‌ఎస్‌ఐదే అన్నది నాస్‌కామ్‌ అంచనా. అమెరికా, ఐరోపాల నుంచే మన ఐటీ కంపెనీలకు అత్యధిక ఆదాయం వస్తోంది. ఆయా విపణుల్లో ఆర్థిక అనిశ్చితి ప్రభావం వచ్చే ఆర్థిక సంవత్సరంలో మన ఐటీ కంపెనీల వృద్ధిపై పడుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

అమెరికా, ఐరోపాలలో సమస్యలు ఎదుర్కొంటున్న బ్యాంకుల్లో భారత ఐటీ కంపెనీలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌), ఇన్ఫోసిస్‌, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఎంఫసిస్‌, ఎల్‌టీఐమైండ్‌ట్రీ వంటి వాటికి డిపాజిట్లున్నాయి. టీసీఎస్‌కు అయితే యూఎస్‌కు చెందిన సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌(ఎస్‌వీబీ)తో పాటు ఐరోపాలో సంక్షోభంలో ఉన్న క్రెడిట్‌ సూయిజ్‌, దీనిని కొనుగోలు చేస్తున్న యూబీఎస్‌లోనూ డిపాజిట్లున్నాయి. 

కేటాయింపులు చేయాల్సిందే..: టీసీఎస్‌, ఇన్ఫీ, ఎల్‌టీఐ మైండ్‌ ట్రీలకు ఎస్‌వీబీలో ఉన్న డిపాజిట్ల వల్ల వాటి ఆదాయంపై 10-20 బేసిస్‌ పాయింట్ల (0.1-0.2%) ప్రభావం పడొచ్చు. అంత మేర ప్రస్తుత మార్చి త్రైమాసికంలో కేటాయింపులు చేయాల్సి రావొచ్చు. 

ఒప్పందాలపై ప్రభావం..: మధ్యకాలానికి అయితే, ఆయా బ్యాంకుల నుంచి నిధులు వచ్చేవరకు ఐటీ సంస్థలు కేటాయింపులు చేయాల్సి రావొచ్చు. దీర్ఘకాలానికి చూస్తే.. అమెరికాలో లేమాన్‌ బ్రదర్స్‌ సంక్షోభం అనంతరం జరిగినట్లుగా.. బ్యాంకులు వ్యయ, వ్యాపార ప్రాజెక్టులపై దృష్టి సారించొచ్చు. అది ఐటీ రంగానికి ఒకరకంగా ప్రయోజనమే. అంటే మధ్య నుంచి స్వల్పకాలం వరకే మన ఐటీ రంగంపై ప్రభావం ఉండొచ్చన్నమాట. ఈ సమయంలో ఒప్పందాలు తగ్గే అవకాశం ఉంది. మార్చి త్రైమాసికం తరవాతా కొద్ది త్రైమాసికాలు అన్ని ఐటీ కంపెనీలూ జాగ్రత్తగా ఉండాలి. ఆర్డర్లు, ప్రాజెక్టు ధరలపై ఒత్తిడి కనిపించొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.


వెల్త్‌ మేనేజర్ల తీరుపై అనుమానాలు

అంతర్జాతీయ బ్యాంకింగ్‌ సంక్షోభ తాజా పరిణామాలు ‘అధిక పెట్టుబడులు పెట్టే భారతీయ ధనవంతులను ఆందోళనకు గురిచేశాయని’.. సంపద నిర్వహణ సేవలందించే, అంతర్జాతీయ వెల్త్‌ మేనేజర్ల తీరుపై మరింత  అనుమానాలు పెంచాయని స్థానిక వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ ఒకటి అంటోంది. పెట్టుబడిదార్లు తమ వెల్త్‌మేనేజర్లు, వెల్త్‌ అడ్వైజర్ల కార్యకలాపాల్లో స్థిరత్వాన్ని కోరుకుంటారు. ఆ పరిస్థితులు కనిపించడం లేదు. ఈ ఏడాది సిటీ గ్రూప్‌ భారత్‌ నుంచి నిష్క్రమించింది. తన మొత్తం వెల్త్‌మేనేజ్‌మెంట్‌ వ్యాపారాన్ని యాక్సిస్‌ బ్యాంక్‌కు విక్రయించింది. గత దశాబ్దకాలంలో.. యూబీఎస్‌ ఏజీ, మోర్గాన్‌ స్టాన్లీ, మెక్వారీ గ్రూప్‌ వంటివి మన దేశంలో ప్రైవేటు వెల్త్‌ వ్యాపారం నుంచి బయటకు వెళ్లడం గమనార్హం.

10 రోజుల్లో 40% పెరిగిన బిట్‌కాయిన్‌

బ్యాంకింగ్‌ సంక్షోభం నడుమ, గత పదిరోజుల్లో బిట్‌కాయిన్‌ విలువ దూసుకెళ్లింది. సిలికాన్‌ వ్యాలీ బ్యాంకు (ఎస్‌వీబీ) సంక్షోభం మొదలైన ఈనెల 10న బిట్‌కాయిన్‌ విలువ 20200 డాలర్లు కాగా.. సోమవారానికి 40 శాతం పెరిగి, 28000 డాలర్ల ఎగువకు వెళ్లింది. 2022 జూన్‌ తర్వాత ఈ స్థాయిని అందుకోవడం ఇప్పుడే. మంగళవారం 28450 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని