ఆక్వాలో చేజారుతున్న అగ్రస్థానం

రొయ్యలు, చేపల (ఆక్వా) ఎగుమతుల్లో మనదేశం ఎన్నో ఏళ్లుగా అగ్రస్థానంలో ఉంది. ముఖ్యంగా అమెరికాకు అత్యధికంగా సముద్ర ఉత్పత్తులు ఎగుమతి చేస్తోంది మనదేశమే.

Published : 23 Mar 2023 01:41 IST

అమెరికాకు తగ్గిన ఎగుమతులు
ఈక్వెడార్‌, వియత్నాం నుంచి అనూహ్య పోటీ
కష్టాల్లో ఏపీ రొయ్యల రైతులు, వ్యాపారులు  
ఈనాడు - హైదరాబాద్‌

రొయ్యలు, చేపల (ఆక్వా) ఎగుమతుల్లో మనదేశం ఎన్నో ఏళ్లుగా అగ్రస్థానంలో ఉంది. ముఖ్యంగా అమెరికాకు అత్యధికంగా సముద్ర ఉత్పత్తులు ఎగుమతి చేస్తోంది మనదేశమే. అనూహ్యంగా ఇప్పుడు ఈ స్థానాన్ని ఈక్వెడార్‌ ఆక్రమిస్తోంది. తక్కువ ధరకే మత్య్స ఉత్పత్తులను ఎగుమతి చేస్తూ మనదేశాన్ని పక్కకు నెట్టేస్తోంది. దీంతో పాటు వియత్నాం నుంచీ పోటీ పెరిగింది. ఈ పరిస్థితి మనదేశంలో రొయ్యలు, చేపలను చెరువుల్లో సాగుచేస్తున్న రైతులకు శరాఘాతంగా మారింది. దేశీయంగా చూస్తే, ఈ విభాగంలో అగ్రగామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో రొయ్యలు, చేపల సాగు రైతులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి కనిపిస్తోంది.

ఏటా రూ.58,000 కోట్ల ఎగుమతులు

ఏటా దాదాపు 7 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.58,000 కోట్ల) విలువైన సముద్ర ఉత్పత్తులను మనదేశం ఎగుమతి చేస్తోంది. ఇందులో రొయ్యలు, శీతలీకరించిన సముద్ర ఉత్పత్తుల వాటా సగానికంటే అధికం. మనదేశం నుంచి జరుగుతున్న సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో నాలుగో వంతు అమెరికాకే చేరతాయి. తరవాత స్థానాల్లో ఆగ్నేయ ఆసియా, ఐరోపా దేశాలున్నాయి. ఇంతవరకూ ఉన్న పరిస్థితి ఇది. తాజాగా లాటిన్‌ అమెరికా దేశమైన ఈక్వెడార్‌ నుంచి మనదేశానికి గట్టి పోటీ ఎదురవుతోంది. యూఎస్‌కు మనదేశం నుంచి సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు తగ్గిపోతుండగా, ఈక్వెడార్‌ నుంచి భారీగా ఎగుమతి అవుతున్నాయి. రొయ్యలు, చేపల చెరువుల సాగుకు ఆ దేశ ప్రభుత్వం నుంచి పెద్దఎత్తున ప్రోత్సాహం లభించడం దీనికి ప్రధాన కారణం. కానీ మనదేశంలో చూస్తే రొయ్యలు, చేపల రైతులు ఎన్నో రకాల సమస్యలతో సతమతం అవుతున్నారు. ప్రభుత్వం నుంచి లభిస్తున్న మద్దతూ అంతంత మాత్రమే.  

తక్కువ ధరకు ఇస్తూ..

ఎంతో కాలంగా ఈక్వెడార్‌ నుంచి చైనాకు రొయ్యలు, చేపలు భారీగా ఎగుమతి అవుతున్నాయి. ‘కొవిడ్‌’ తరవాత పరిస్థితి మారింది. లాక్‌డౌన్‌ నిబంధనలు, అంతర్జాతీయ రవాణాపై ఆంక్షల కారణంగా ఈక్వెడార్‌ నుంచి చైనాకు ఎగుమతులు తగ్గాయి. దీంతో ఈక్వెడార్‌ వ్యాపారులు అమెరికాకు తమ ఉత్పత్తులను మళ్లించారు. మనదేశంతో పోల్చితే ఎంతో తక్కువ ధరకే రొయ్యలు, చేపలను అమెరికాకు పంపుతున్నారు. పైగా అమెరికాకు ఎంతో దగ్గరగా ఉండటం వారికి  కలిసొచ్చింది. ఈ ఏడాదిలో ఉత్పత్తి పెంచి, రొయ్యలు, చేపలను యూఎస్‌కు అధికంగా ఎగుమతి చేస్తేనే మనస్థానం నిలుస్తుందని, లేనిపక్షంలో శాశ్వతంగా ఈక్వెడార్‌కు వెనుకే ఉండిపోవాల్సి వస్తుందని పరిశ్రమ వర్గాలు వివరిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో 2.12 లక్షల హెక్టార్లలో

మనదేశం నుంచి అమెరికా, చైనా, ఐరోపా దేశాలకు ఎగుమతి చేస్తున్న చేపలు, రొయ్యల్లో ఆంధ్రప్రదేశ్‌ వాటా ఎంతో అధికం. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 2.12 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలోని చెరువుల్లో చేపలు, రొయ్యలు సాగవుతున్నాయి. లక్షన్నర మంది రైతులు దీనిపై ఆధారపడి ఉన్నారు. చేపలు, రొయ్యలను నిల్వ చేయడానికి అవసరమైన కోల్డ్‌ స్టోరేజీ యూనిట్లు కూడా 100కు పైగా ఉన్నాయి. కానీ రెండేళ్లుగా రొయ్యలు, చేపల సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. ఎగుమతులు మూడో వంతుకు పడిపోయాయి. ఆకర్షణీయ ధర లభించకపోవడం.. అదే సమయంలో మేత ఖర్చులు, చెరువుల నిర్వహణ వ్యయాలు భారంగా మారడంతో, గిట్టుబాటు కాక ఎంతో మంది రైతులు చెరువుల సాగు విరమించుకుంటున్నారు. సాధారణంగా ఏడాది చివర్లో.. నవంబరు, డిసెంబరులలో ఆక్వా ఎగుమతులు గరిష్ఠ స్థాయిలో ఉంటాయి. కానీ 2022 చివర్లో ఈ జోరు కనిపించలేదు. అంతర్జాతీయ విపణిలో మనదేశం వెనుకబడిపోవడానికి, రాష్ట్రంలో ఆక్వా పరిశ్రమ మందగమనం కూడా ఒక కారణమని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని