ఆసియా అపర కుబేరుడు అంబానీ

అంతర్జాతీయ అగ్రగామి 10 మంది కుబేరుల్లో మన దేశం నుంచి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ ఒక్కరే ఉన్నారు.

Updated : 23 Mar 2023 08:14 IST

అంతర్జాతీయ సంపన్నుల్లో 9వ స్థానం
వారానికి రూ.3,000 కోట్లు కోల్పోయిన గౌతమ్‌ అదానీ

దిల్లీ: అంతర్జాతీయ అగ్రగామి 10 మంది కుబేరుల్లో మన దేశం నుంచి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ ఒక్కరే ఉన్నారు. భారత్‌తో పాటు ఆసియా అపర కుబేరుడుగా కూడా ఉన్న అంబానీ 82 బిలియన్‌ డాలర్ల నికర సంపదతో, ‘ది 2023 ఎం3ఎం హురున్‌ అంతర్జాతీయ కుబేరుల జాబితా’లో 9వ స్థానం పొందారు. అంబానీ సంపద విలువ ఏడాది క్రితం కంటే 20% (21 బిలియన్‌ డాలర్లు) తగ్గినా, అదానీ సంపద విలువ అంతకంటే ఎక్కువగా క్షీణించడంతో, దేశీయ కుబేరుల్లో మళ్లీ అగ్రస్థానాన్ని పొందారు. ముకేశ్‌ అంబానీ 20 ఏళ్ల నేతృత్వంలో ఆర్‌ఐఎల్‌ ఆదాయాలు 17 రెట్లు, నికరలాభం 20 రెట్లు పెరిగాయి.

హిండెన్‌బర్గ్‌ ఆరోపణలతో అదానీ గ్రూప్‌ కంపెనీల మార్కెట్‌ విలువ 140 బిలియన్‌ డాలర్లకు పైగా ఆవిరవ్వకముందు, గౌతమ్‌ అదానీ అంతర్జాతీయ సంపన్నుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. తదుపరి గ్రూప్‌ కంపెనీలతో పాటు ఆయన వ్యక్తిగత సంపదా కరిగిపోయింది. తాజాగా 53 బి.డాలర్ల సంపదతో అదానీ కుటుంబం ఈ జాబితాలో 23వ స్థానంలో నిలిచింది. అదానీ సుమారు 28 బి.డాలర్ల (35 శాతం) సంపదను ఏడాది వ్యవధిలో కోల్పోయారు. 2022-23లో వారానికి రూ.3,000 కోట్ల చొప్పున అదానీ నష్టపోయారని నివేదిక తెలిపింది.

* గత పదేళ్లలో చూసుకుంటే అంబానీ సంపద 356%, అదానీ సంపద విలువ 1225% పెరిగాయి.

అత్యధికంగా కోల్పోయింది బెజోస్‌: ఏడాది కాలంలో నికర సంపదను ఎక్కువమొత్తంలో కోల్పోయిన వారిలో అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ మొదటి స్థానంలో ఉన్నట్లు హురున్‌ నివేదిక పేర్కొంది. ఆయన సుమారు 70 బి.డాలర్ల సంపదను కోల్పోయారు. అంబానీ, అదానీ కలిపి పోగొట్టుకున్న సంపద కంటే ఇది ఎక్కువ కావడం గమనార్హం. అత్యధికంగా సంపదను కోల్పోయిన వారి జాబితాలో అదానీ, అంబానీ 6, 7 స్థానాల్లో ఉన్నారు. ఆసియా అపర కుబేరుల్లో రెండో స్థానాన్ని కూడా గౌతమ్‌ అదానీ కోల్పోయారు. చైనాకు చెందిన ఝోంగ్‌ శాన్‌శాన్‌ ఈ స్థానం దక్కించుకున్నారు.

* భారత్‌లో గత ఏడాది కుబేరుల సంఖ్య 15 శాతానికి పైగా పెరిగి 187కు చేరింది. ఇందులో ముంబయిలో 66 మంది నివసిస్తున్నారు. అంతర్జాతీయంగా ఉన్న భారత సంతతి కుబేరులనూ లెక్కలోకి తీసుకుంటే మొత్తం సంఖ్య 217గా ఉంది. అత్యధిక సంఖ్యలో కుబేరులు ఉన్న దేశంగా చైనా నిలిచింది. భారత్‌ కంటే 5 రెట్లు అధికంగా కుబేరులు చైనాలో ఉన్నారు. భారత అపర కుబేరుల్లో తొలి 10 స్థానాల్లో ఉన్నవారు, వారి సంపద, ప్రపంచ సంపన్నుల జాబితాలో వారి ర్యాంక్‌ పట్టికలో..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని