రాణించిన ఔషధ, ఫైనాన్స్‌ షేర్లు

ఔషధ, ఫైనాన్స్‌ షేర్లు రాణించడంతో వరుసగా రెండో రోజూ సూచీలు లాభపడ్డాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు ఇందుకు కలిసొచ్చాయి.

Published : 23 Mar 2023 01:41 IST

సమీక్ష

షధ, ఫైనాన్స్‌ షేర్లు రాణించడంతో వరుసగా రెండో రోజూ సూచీలు లాభపడ్డాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు ఇందుకు కలిసొచ్చాయి. అయితే విదేశీ మదుపర్ల అమ్మకాలతో లాభాలు పరిమితమయ్యాయి. అమెరికా ఫెడ్‌ వడ్డీ రేట్ల నిర్ణయానికి ముందు కొంత అప్రమత్తత కనిపించింది. గుడి పడ్వా పండగ సందర్భంగా బుధవారం ఫారెక్స్‌ మార్కెట్లు పనిచేయలేదు. ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియగా, ఐరోపా సూచీలు అదే ధోరణిలో ట్రేడయ్యాయి. బ్యారెల్‌ ముడిచమురు 0.31% తగ్గి 75.09 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

సెన్సెక్స్‌ ఉదయం 58,245.26 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. అదే జోరులో 58,418.78 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. అమ్మకాలతో కాస్త తగ్గి, చివరకు 139.91 పాయింట్ల లాభంతో 58,214.59 వద్ద ముగిసింది. నిఫ్టీ 44.40 పాయింట్లు పెరిగి 17,151.90 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 17,107.85- 17,207.25 పాయింట్ల మధ్య కదలాడింది.

* సెన్సెక్స్‌ 30 షేర్లలో 19 మెరిశాయి. బజాజ్‌ ఫైనాన్స్‌ 2.16%, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 2.15%, సన్‌ఫార్మా 1.65%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 0.93%, టాటా మోటార్స్‌ 0.89%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 0.89% చొప్పున లాభపడ్డాయి. ఎన్‌టీపీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌, నెస్లే, హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1.50% వరకు నష్టపోయాయి. రంగాల వారీ సూచీల్లో ఆరోగ్య సంరక్షణ, కమొడిటీస్‌, ఎఫ్‌ఎమ్‌సీజీ, యుటిలిటీస్‌, ఆర్థిక సేవలు, చమురు-గ్యాస్‌ రాణించాయి. టెలికాం, మన్నికైన వినిమయ వస్తువులు, లోహ, స్థిరాస్తి పడ్డాయి. బీఎస్‌ఈలో 1984 షేర్లు లాభాల్లో ముగియగా, 1523 స్క్రిప్‌లు నష్టపోయాయి. 124 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.

* ఐఓసీ రూ.61,077 కోట్ల పెట్టుబడులు: ఒడిశా పారదీప్‌లో పెట్రోరసాయనాల కాంప్లెక్స్‌ నిర్మాణానికి రూ.61,077 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఐఓసీ ప్రకటించింది. ఒక ప్రదేశంలో కంపెనీకి ఇదే అతిపెద్ద పెట్టుబడి కావడం గమనార్హం. ప్రాజెక్టు పూర్తికి గడువును కంపెనీ తెలియజేయలేదు. ముడిచమురును రసాయనాలుగా మార్చడం, ప్రస్తుతం 5-6 శాతంగా ఉండగా, కొత్త ప్రాజెక్టు సాయంతో దీనిని 10-12% వరకు పెంచాలని కంపెనీ భావిస్తోంది.

* ఉదయ్‌శివకుమార్‌ ఇన్‌ఫ్రా ఐపీఓ మూడోరోజు ముగిసే సరికి 5.15 రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 2 కోట్ల షేర్లను ఆఫర్‌ చేయగా, 10,29,54,972 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. ఎన్‌ఐఐల నుంచి 8.47 రెట్లు, రిటైల్‌ విభాగంలో 4.14 రెట్లు, క్యూఐబీల నుంచి 1.21 రెట్ల స్పందన కనిపించింది. ఈ ఇష్యూ నేటితో ముగియనుంది.

* జేకే టైర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌లో 5.6 శాతం వాటాను ప్రపంచ బ్యాంక్‌ గ్రూప్‌ విభాగమైన ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఐఎఫ్‌సీ) 30 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.240 కోట్ల)కు కొనుగోలు చేసింది.

* కంపెనీ యూనిట్‌లో ఐఎఫ్‌సీ రూ.600 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు మహీంద్రా అండ్‌ మహీంద్రా వెల్లడించింది.

* ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ ఎస్‌బీఎఫ్‌సీ ఫైనాన్స్‌ తమ ఐపీఓ పరిమాణాన్ని రూ.1600 కోట్ల నుంచి రూ.1200 కోట్లకు తగ్గించుకుంది. ఇష్యూలో ఆఫర్‌ సేల్‌ సేల్‌ పరిమాణాన్ని రూ.750 కోట్ల నుంచి రూ.450 కోట్లకు పరిమితం చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని