సంక్షిప్త వార్తలు(7)

హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌)లో 3.5% వరకు వాటాను ప్రభుత్వం విక్రయించనుంది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) పద్ధతిలో జరిగే ఈ విక్రయానికి, ఒక్కో షేరుకు కనీస ధరగా రూ.2,450ను నిర్ణయించారు.

Published : 23 Mar 2023 01:41 IST

హెచ్‌ఏఎల్‌లో 3.5% వరకు వాటా విక్రయం
ఓఎఫ్‌ఎస్‌ పద్ధతిలో నేడు, రేపు
ఖజానాకు రూ.2,800 కోట్లు

దిల్లీ: హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌)లో 3.5% వరకు వాటాను ప్రభుత్వం విక్రయించనుంది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) పద్ధతిలో జరిగే ఈ విక్రయానికి, ఒక్కో షేరుకు కనీస ధరగా రూ.2,450ను నిర్ణయించారు. షేర్లకు పూర్తి స్థాయిలో స్పందన లభిస్తే ప్రభుత్వానికి సుమారు రూ.2,800 కోట్లు వరకు సమకూరొచ్చు. రెండు రోజుల పాటు జరిగే ఈ ఓఎఫ్‌ఎస్‌లో తొలి రోజైన గురువారం (నేడు) సంస్థాగత మదుపర్లు, శుక్రవారం చిన్న మదుపర్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇష్యూలో భాగంగా తొలుత 1.75 శాతం వాటాకు సమానమైన 58.51 లక్షల షేర్లను విక్రయించనున్నారు. మదుపర్ల నుంచి విశేష ఆదరణ లభిస్తే.. ఇంతే పరిమాణంలో అదనంగా షేర్లను విక్రయిస్తారు. తద్వారా మొత్తంగా 3.5 శాతం వాటాను ప్రభుత్వం విక్రయించనుందన్నమాట. బుధవారం నాటి ముగింపు ధర రూ.2,625.20తో పోలిస్తే ఇష్యూ ధర (రూ.2,450) 6.7 శాతం తక్కువ.


టాటా మోటార్స్‌కు వెయ్యి విద్యుత్‌ కార్ల ఆర్డర్‌: ఓహెచ్‌ఎం

ఈనాడు, హైదరాబాద్‌: విద్యుత్‌ కార్లతో క్యాబ్‌ సేవలను అందించే హైదరాబాద్‌ సంస్థ ఓహెచ్‌ఎం ఇ-లాజిస్టిక్స్‌, వెయ్యి విద్యుత్‌ కార్ల కొనుగోలు కోసం టాటా మోటార్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఎక్స్‌ప్రెస్‌-టీ-ఈవీ వాహనాలను దశల వారీగా అందిస్తామని టాటా మోటర్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌ ఈవీ సేల్స్‌ సీనియర్‌ జనరల్‌ మేనేజర్‌ రమేశ్‌ దొరైరాజన్‌ అన్నారు. తక్కువ నిర్వహణ ఖర్చు, వేగంగా ఛార్జింగ్‌ అయ్యే బ్యాటరీలు ఉండటంతో రవాణా సేవలను అందించే వారికి ఈ కారు ఆకర్షణీయంగా ఉంటోందన్నారు. విమానాశ్రయంతో పాటు హైదరాబాద్‌ నుంచి ఇతర నగరాలకు వెళ్లే వినియోగదారులకూ ఈ క్యాబ్‌లు అందుబాటులో ఉంటాయని ఓహెచ్‌ఎం వ్యవస్థాపకుడు నిర్మల్‌ రెడ్డి తెలిపారు.


కిమ్స్‌ హాస్పిటల్స్‌ షేర్లు విక్రయించిన పోలార్‌ కేపిటల్‌ ఫండ్స్‌  

దిల్లీ: పోలార్‌ కేపిటల్‌ ఫండ్స్‌, అనే సంస్థ బుధవారం స్టాక్‌మార్కెట్లో రూ.144 కోట్ల విలువైన కిమ్స్‌ హాస్పిటల్స్‌ (కృష్ణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌) షేర్లను విక్రయించింది. షేరు రూ.1300 చొప్పున 11,05,934 షేర్లను బల్క్‌ డీల్స్‌ విభాగంలో ఈ సంస్థ విక్రయించినట్లు తెలుస్తోంది. పోలార్‌ కేపిటల్‌ ఫండ్స్‌కు కిమ్స్‌ హాస్పిటల్స్‌లో 1.87 శాతం వాటా ఉంది. ప్రస్తుతం కొన్ని షేర్లు విక్రయించినందున, కిమ్స్‌ హాస్పిటల్స్‌లో ఈ సంస్థ వాటా 0.5 శాతానికి తగ్గింది.


విమానాశ్రయాల ఆదాయం రూ.32000 కోట్లకు : కాపా

దిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత విమానాశ్రయాల నిర్వాహకుల ఆదాయం 26% వృద్ధితో 3.9 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.32,000 కోట్ల)కు చేరుతుందని విమానయాన కన్సల్టెన్సీ సంస్థ కాపా ఇండియా పేర్కొంది. 2023-24లో విమాన ప్రయాణికుల రద్దీ (దేశీయ, అంతర్జాతీయ) 39.5 కోట్లకు చేరొచ్చని అంచనా వేసింది. ఇందులో దేశీయ విమాన ప్రయాణికులే 32 కోట్ల మంది ఉంటారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ ప్రయాణికుల సంఖ్య 27.5 కోట్లుగా నమోదు కావచ్చని అంచనా. ఇదే సమయంలో అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య 5.8 కోట్ల నుంచి 7.5 కోట్లకు పెరగొచ్చు. 2029-30 కల్లా దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 70 కోట్లకు, అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య 16 కోట్లకు చేరే వీలుందని కాపా ఇండియా ఏవియేషన్‌ సమిట్‌లో అంచనా వేశారు.


0.25% రేట్ల పెంపు: ఫెడ్‌

మెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేటును మరో 25 బేసిస్‌ పాయింట్లు (0.25%) పెంచింది. తద్వారా రుణ రేటు 4.75-5 శాతానికి పెరిగింది. అమెరికా బ్యాంకింగ్‌ వ్యవస్థ బలంగా ఉంది. ఇటీవలి పరిణామాలు గృహ, కార్పొరేట్లకు కఠిన రుణ పరిస్థితులు తీసుకురావొచ్చని అంచనా. అత్యధిక ఉద్యోగాలు, 2% ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని సాధించడం కోసం రుణ రేటును పెంచుతున్నట్లు’ ఎఫ్‌ఓఎమ్‌సీ బుధవారం రాత్రి ప్రకటించింది. అమెరికాలో సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌, సిగ్నేచర్‌ బ్యాంక్‌ల వైఫల్యంతో పాటు ఐరోపాలో క్రెడిట్‌ సూయిజ్‌ సంక్షోభం కారణంగా ఏర్పడ్డ గడ్డు పరిస్థితుల్లో వడ్డీరేటును పెంచాలా/యథాతథ స్థితిని కొనసాగించాలా అన్నదానిపై ఫెడ్‌ తీవ్రంగా చర్చించినట్లు తెలుస్తోంది. మరిన్ని రేట్ల పెంపును తాత్కాలికంగా నిలపగలమని సంకేతాలిచ్చింది.


హీరో మోటోకార్ప్‌ ధరలు 2% వరకు పెంపు

దిల్లీ: తన వాహన మోడళ్ల ధరలను 2 శాతం వరకు పెంచనున్నట్లు హీరో మోటోకార్ప్‌ ప్రకటించింది. ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తున్న బీఎస్‌-6 రెండో దశ ఉద్గార నిబంధనలకు అనుగుణంగా, వాహన తయారీలో చేసిన మార్పుల వల్ల, వ్యయాలు పెరిగినందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.  మోడల్‌, విపణి ఆధారంగా ధరల పెంపులో మార్పు ఉంటుందని పేర్కొంది. పెంచిన ధరలు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయని వివరించింది.  


సింగపూర్‌ కోర్టు ఆదేశాలపై కిరి ఇండస్ట్రీస్‌ పూర్తి విశ్వాసం

సింగపూర్‌: సింగపూర్‌ ఇంటర్నేషనల్‌ కమర్షియల్‌ కోర్టు(ఎస్‌ఐసీసీ) నిర్ణయంపై భారత్‌కు చెందిన రంగులు, రసాయనాల కంపెనీ కిరి ఇండస్ట్రీస్‌ పూర్తి విశ్వాసాన్ని వెలువరచింది. ఎనిమిదేళ్ల వివాదంపై కోర్టు తీసుకున్న తుది నిర్ణయాన్ని చైనాతో సంబంధాలున్న తమ భాగస్వామి గౌరవిస్తుందని ఆశిస్తోంది. డైస్టార్‌లో మైనారిటీ వాటాదారు అయిన కిరి 2015 నుంచీ సెండా అనే కంపెనీతో న్యాయపోరాటం చేస్తోంది. చైనాకు చెందిన అతిపెద్ద రంగుల(డై) సంస్థ లాంగ్‌షెంగ్‌కు అనుబంధ సంస్థే ఈ సెండా. డైస్టార్‌లో మెజారిటీ వాటాదారు కూడా. కాగా, వివిధ చర్యల ద్వారా మైనారిటీ వాటాదారు ప్రయోజనాలను సెండా తొక్కిపట్టిందంటూ సింగపూర్‌ హైకోర్టుకు కిరి తెలియపరచింది. ఈ కేసుకున్న అంతర్జాతీయ అంశాల కారణంగా 2017లో ఎస్‌ఐసీసీకి బదిలీ అయింది. కిరి లేవదీసిన వాణిజ్య అన్యాయాలు చాలా వరకు జరిగినట్లు తన తీర్పులో గుర్తించింది. 2023 మార్చి 2న కిరికున్న వాటా విలువను సైతం 481.6 మిలియన్‌ డాలర్ల నుంచి 603.8 మి. డాలర్లకు పెంచుతూ తుది తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ఈ తీర్పు ప్రకారమే డైస్టార్‌లో కిరికున్న 37.57 శాతం వాటాను, ఆ మేర విలువతో డైస్టార్‌ కొనుగోలు చేయగలదని కిరి ఆశాభావం వ్యక్తం చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని