సంక్షిప్త వార్తలు (9)

రుణ కష్టాల్లో చిక్కుకున్న ఫ్యూచర్‌ రిటైల్‌ లిమిటెడ్‌ (ఎఫ్‌ఆర్‌ఎల్‌) దివాలా పరిష్కార ప్రక్రియ ఆలస్యమవుతోంది. గత 4 నెలలుగా పరిష్కార ప్రణాళికను కనుగొనడంలో వెనకబడ్డ ఎఫ్‌ఆర్‌ఎల్‌ రుణదాతలు తాజాగా ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను ఆహ్వానిస్తున్నారు.

Published : 24 Mar 2023 01:32 IST

ఫ్యూచర్‌ రిటైల్‌కు కొత్త బిడ్లు!

దిల్లీ: రుణ కష్టాల్లో చిక్కుకున్న ఫ్యూచర్‌ రిటైల్‌ లిమిటెడ్‌ (ఎఫ్‌ఆర్‌ఎల్‌) దివాలా పరిష్కార ప్రక్రియ ఆలస్యమవుతోంది. గత 4 నెలలుగా పరిష్కార ప్రణాళికను కనుగొనడంలో వెనకబడ్డ ఎఫ్‌ఆర్‌ఎల్‌ రుణదాతలు తాజాగా ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను ఆహ్వానిస్తున్నారు. 2022 జులై 20న ఎఫ్‌ఆర్‌ఎల్‌పై కార్పొరేట్‌ దివాలా పరిష్కార ప్రక్రియ (సీఐఆర్‌పీ) మొదలైనా, 2023 ఫిబ్రవరి 20 వరకు రెండు సార్లు గడువును పొడిగించినా బిడ్లు దాఖలు కాలేదు. దీంతో ఆస్తులను 5 క్లస్టర్లుగా విడదీసి కొనుగోలుదార్లను ఆకర్షించాలని రుణదాతలు భావించారు. తాజాగా ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను దాఖలు చేయాలని ఆహ్వానించారు.


సాగర్‌ సిమెంట్స్‌కు ఆంధ్రా సిమెంట్స్‌ షేర్ల కేటాయింపు

దిల్లీ: నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ) ఆమోదించిన దివాలా పరిష్కార ప్రణాళిక కింద.. రూ.10 ముఖ విలువ ఒక్కో షేరును రూ.26.80 ప్రీమియంపై, మొత్తం 8,75,63,533 షేర్లను సాగర్‌ సిమెంట్స్‌కు ఆంధ్రా సిమెంట్స్‌ కేటాయించింది. దీంతో ఆంధ్రాసిమెంట్స్‌లో తమ వాటా 95 శాతానికి చేరిందని ఎక్స్ఛేంజీలకు సాగర్‌ సిమెంట్స్‌ తెలిపింది. ముగ్గురు డైరెక్టర్లను కూడా ఆంధ్రా సిమెంట్స్‌ బోర్డులో నియమించినట్లు వెల్లడించింది.


హెచ్‌ఏఎల్‌ ఓఎఫ్‌ఎస్‌లో నేడు చిన్న మదుపర్లకు అవకాశం

దిల్లీ: హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ (హెచ్‌ఏఎల్‌) ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌)కు గురువారం సంస్థాగత మదుపర్ల నుంచి 4.5 రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా హెచ్‌ఏఎల్‌లో 1.75 శాతం వాటాకు సమానమైన 58.51 లక్షల షేర్లను విక్రయానికి ఉంచగా, భారీ స్పందన లభించింది. దీంతో గ్రీన్‌ షూ ఆప్షన్‌ వినియోగించాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. రిటైల్‌ మదుపర్లు శుక్రవారం బిడ్‌లు దాఖలు చేసుకోవచ్చని దీపం కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే ట్వీట్‌ చేశారు. హెచ్‌ఏఎల్‌లో 1.75 శాతం వాటాకు సమానమైన 58.51 లక్షల షేర్లు వీరికీ అందుబాటులో ఉంటాయి.


అరబిందో ఫార్మా యూనిట్లు అరో ఫార్మాకు బదిలీ

హైదరాబాద్‌: అరబిందో ఫార్మాకు చెందిన ‘మందులు ఉత్పత్తి చేసే 6 యూనిట్లు, ఒక ఆర్‌అండ్‌డీ కేంద్రం, అనుబంధ సంస్థ అయిన  అరో ఫార్మా ఇండియా లిమిటెడ్‌కు ఏప్రిల్‌ 1 నుంచి బదిలీ అవుతున్నాయి. ‘స్లంప్‌ సేల్‌’ పద్ధతిలో ఈ యూనిట్లు బదిలీ చేయడానికి అరబిందో ఫార్మా వాటాదార్లు    ఇ-ఓటింగ్‌ ద్వారా అనుమతి తెలిపారు. ఈ యూనిట్లలో ఏపీఐ (యాక్టివ్‌ ఫార్మా ఇన్‌గ్రేడియంట్స్‌) ఔషధాలు ఉత్పత్తి చేస్తున్నారు.


ఓఎన్‌డీసీలోనూ వాహన బుకింగ్‌ యాప్‌లు!

దిల్లీ: ఇకామర్స్‌ అంతర్జాతీయ దిగ్గజాలకు పోటీగా మన ప్రభుత్వం రూపొందించిన ‘ఓపెన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ డిజిటల్‌ కామర్స్‌ (ఓఎన్‌డీసీ).. మొబిలిటీ రంగంలోకీ’ విస్తరించింది. స్థానిక వ్యాపార సంస్థలు ఆన్‌లైన్‌లో విక్రయాలు జరుపుకునేందుకు సహకరించే ఈ ప్లాట్‌ఫాం, బెంగళూరులో ఆటో బుకింగ్‌ సేవలు అందించే నమ్మయాత్రి అనే సంస్థతో జట్టుకట్టింది. రాబోయే కొన్ని నెలల్లో ఈ రంగంలోని మరిన్ని సంస్థలతో జట్టు కట్టేందుకు ఓఎన్‌డీసీ చర్చలు జరుపుతోందని సంస్థ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నితిన్‌ నాయర్‌ తెలిపారు. ఓఎన్‌డీసీ ప్లాట్‌ఫామ్స్‌లో ఇ-కామర్స్‌ సంస్థలకు సంబంధించి అన్ని రకాల ఉత్పత్తులు, సేవలు కనిపిస్తాయి. మొబిలిటీ రంగంలోని దేశీయ సంస్థలకూ ఈ సహకారం అందించాలన్నది ఓఎన్‌డీసీ లక్ష్యం. ఇందులో భాగంగా వివిధ రకాల ప్రయాణ మార్గాలు- మెట్రోలు, బస్సులు, ఆటోరిక్షాలకు సంబంధించిన అన్ని రకాల యాప్‌లను అనుసంధానం చేయనుంది. తద్వారా ఒకటే ప్లాట్‌ఫామ్‌పై పలు రకాల ప్రయాణ మార్గాల్లో నచ్చినదానిని ఎంపిక చేసుకునే అవకాశం వినియోగదారులకు ఇవ్వనుంది. ఇందులో భాగంగానే ఆటో రిక్షాకు బుకింగ్‌ చేసుకునేందుకు అనువైన మొబైల్‌ యాప్‌ నమ్మయాత్రితో ఓఎన్‌డీసీ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం ఈ విభాగంలో ఓలా, ఉబర్‌లదే అధిక వాటా.


ఫండ్‌లలో మదుపునకు వాడే ఇ-వాలెట్లకు కేవైసీ తప్పనిసరి

దిల్లీ: మ్యూచువల్‌ ఫండ్‌ల్లో పెట్టుబడుల కోసం ఉపయోగించే ఇ-వాలెట్లు.. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నిర్దేశించిన కేవైసీ (వినియోగదారు సమాచారం) నిబంధనలను తప్పకుండా పాటించాలని సెబీ తెలిసింది. ఈ నిబంధనలు 2023 మే 1 నుంచి అమల్లోకి వస్తాయంటూ ఓ సర్క్యులర్‌ను జారీ చేసింది. రూ.50,000 పెట్టుబడుల పరిమితితో మ్యూచువల్‌ ఫండ్‌ల్లో ఇ-వాలెట్ల ద్వారా పెట్టుబడులు పెట్టేందుకు 2017 మే 8న సెబీ అనుమతులు ఇచ్చింది. ముఖ్యంగా యువతను దృష్టిలో ఉంచుకుని ఈ అవకాశం కల్పించింది. మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమలో డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడం కూడా దీని వెనక మరో ఉద్దేశం.


రాబోయే 8-12 నెలల్లో మెర్సిడెస్‌ బెంజ్‌ 4 విద్యుత్‌ కార్లు

దిల్లీ: రాబోయే 8-12 నెలల్లో భారత విపణిలోకి నాలుగు కొత్త విద్యుత్‌ కార్లను విడుదల చేయనున్నట్లు మెర్సిడెస్‌ బెంజ్‌ వెల్లడించింది. 2027 నాటికి తమ భారత విక్రయాల్లో 25 శాతం వాటా విద్యుత్‌ కార్లదే ఉంటుందని మెర్సిడెస్‌ బెంజ్‌ ఏజీ హెడ్‌ ఆఫ్‌ రీజియన్‌ ఓవర్‌సీస్‌ మతియాస్‌ లూర్స్‌ అంచనా వేశారు. ప్రస్తుతం కంపెనీ భారత విపణిలో 4 విద్యుత్‌ కార్లు- ఈక్యూఎస్‌, ఈక్యూబీ, ఈక్యూసీ, ఈక్యూఎస్‌ ఏఎంజీలను విక్రయిస్తోంది. 2021లో 11,242గా ఉన్న కంపెనీ విక్రయాలు.. 2022లో రికార్డు స్థాయిలో 41 శాతం వృద్ధితో 15,822కు చేరాయి. అంతకు ముందు కంపెనీ 2018లో 15,583 కార్లు విక్రయించింది.


బీటీఎస్‌లో ఖతార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పెట్టుబడి ప్రతిపాదనకు సీసీఐ ఆమోదం

దిల్లీ: సింగపూర్‌కు చెందిన బీటీఎస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ 1 పీటీఈలో (బీటీఎస్‌ 1) ఖతార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ (క్యూఐఏ) పెట్టుబడి ప్రతిపాదనను కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది. ఖతార్‌లో క్యూఐఏ.. సార్వభౌమ వెల్త్‌ ఫండ్‌గా ఉంది. బీటీఎస్‌1.. జేమ్స్‌ ముడ్రోచ్‌కు చెందిన లుపా సిస్టమ్స్‌, స్టార్‌ అండ్‌ డిస్నీ ఇండియా మాజీ ఛైర్మన్‌ ఉదయ్‌ శంకర్‌ల సంయుక్త పెట్టుబడి సంస్థ. వయాకామ్‌ 18లో పెట్టుబడుల కోసం పలు సంస్థల నుంచి బీటీఎస్‌1 పెట్టుబడులు సమీకరిస్తోందని.. ఇందులో భాగంగానే బీటీఎస్‌1లో క్యూఐఏ పెట్టుబడులు పెట్టేందుకు ప్రతిపాదించిందని సీసీఐ తెలిపింది. బోధి ట్రీ సిస్టమ్స్‌ ఏర్పాటు కోసం క్యూఐఏ నుంచి 1.5 బిలియన్‌ డాలర్లు సమీకరించనున్నట్లు గతేడాది ఫిబ్రవరిలో ముర్దోక్‌, శంకర్‌ ప్రకటించారు. ఆ తర్వాత ఏప్రిల్‌లో వయాకామ్‌ 18లో రూ.13,500 కోట్లు పెట్టుబడిగా పెట్టునున్నట్లు బీటీఎస్‌ తెలిపింది. 2022 సెప్టెంబరులో జియో సినిమా ఓటీటీ, వయాకామ్‌ 18 మీడియాల ప్రతిపాదిత విలీనానికి కూడా సీసీఐ ఆమోదం తెలిపింది.


ఉబర్‌లో 90 రోజుల ముందే రైడ్‌ రిజర్వ్‌ బుకింగ్‌

దిల్లీ: వేసవి సెలవుల నేపథ్యంలో విమానాశ్రయాలకు ప్రయాణాన్ని సులభతరం చేయడానికి ఉద్దేశించిన కొత్త సదుపాయాలను ఉబర్‌ గురువారం ప్రకటించింది. 90 రోజుల ముందే రైడ్‌ను ‘రిజర్వ్‌’ చేసుకునే అవకాశం ఇందులో ఒకటి. దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో ఇప్పటికే ప్రత్యేక పికప్‌, పార్కింగ్‌ స్లాట్లు ఏర్పాటు చేసినట్లు ఉబర్‌ వెల్లడించింది. తమ యాప్‌ దశల వారీ వేఫైండింగ్‌ గైడ్‌ (దారి చూపే మార్గసూచీ)ను కలిగి ఉందని తెలిపింది. గేటు నుంచి ఉబర్‌ పికప్‌ జోన్లకు వెళ్లే ప్రయాణికులకు ఇది సహాయం చేస్తుందని పేర్కొంది. గైడ్‌లో విమానాశ్రయ వాస్తవ చిత్రాలు ఉండటంతో పాటు ప్రయాణికులు ఉబర్‌ జోన్లకు సజావుగా వెళ్లేందుకు దోహదం చేసే ఫీచర్లు ఉన్నాయని వెల్లడించింది. గేటు నుంచి పికప్‌ జోన్‌ వరకు నడిచి వెళ్లడానికి ఎంత సమయం పడుతుందనేది కొన్ని ఎంపిక చేసిన విమానాశ్రయాల్లో ప్రయాణికులు చూసుకోవచ్చని వివరించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని