చిన్న వ్యాపారాల ఎన్‌పీఏలు తగ్గాయ్‌

రుణ వృద్ధి పెరిగినా, చిన్న వ్యాపారాల విభాగం నుంచి ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు త్రైమాసికంలో స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) తగ్గాయని ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌ నివేదిక వెల్లడించింది.

Published : 24 Mar 2023 01:33 IST

ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌ నివేదిక

ముంబయి: రుణ వృద్ధి పెరిగినా, చిన్న వ్యాపారాల విభాగం నుంచి ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు త్రైమాసికంలో స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) తగ్గాయని ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌ నివేదిక వెల్లడించింది. సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి సంస్థల (ఎంఎస్‌ఎంఈ) ఎన్‌పీఏలు 2021 సెప్టెంబరు ఆఖరుకు 13.9 శాతం ఉండగా, 2022 సెప్టెంబరు నాటికి 12.5 శాతానికి తగ్గాయని పేర్కొంది. సమీక్షా త్రైమాసికంలో రుణ పునరుద్ధరణలు (రెన్యూవల్‌) మినహా మొత్తం రుణ పంపిణీ 24 శాతం వృద్ధి చెందినట్లు తెలిపింది. రూ.కోటి వరకు రుణ అవకాశాలున్న (ఎక్స్‌పోజర్‌) సూక్ష్మ పరిశ్రమల విభాగంలో 54 శాతానికి పైగా వృద్ధి నమోదైందని వివరించింది. సూక్ష్మ విభాగంలో 34 శాతం, చిన్న పరిశ్రమల విభాగంలో 4 శాతం మేర సరాసరి రుణ పరిమాణం పెరిగిందని వెల్లడించింది. మధ్య స్థాయి పరిశ్రమల విభాగంలో ఇది 1 శాతం తగ్గడం గమనార్హం. కొవిడ్‌ నేపథ్యంలో వీటికి అత్యవసర రుణ హామీ పథకం కింద రుణాలు అందించడమే దీనికి కారణం.

* మొత్తం ఎంఎస్‌ఎంఈలకు రుణాలు 2022 సెప్టెంబరు నాటికి 10.6 శాతం మేర పెరిగి రూ.22.9 లక్షల కోట్లకు చేరాయి. ఇందులో రూ.2.5 లక్షల కోట్ల రుణాలను అనుమానిత నష్ట విభాగంలో చేర్చారు. 720 రోజులకు పైగా వీటిని తిరిగి చెల్లించకపోవడమే దీనికి కారణం.

* ఎంఎస్‌ఎంఈ రుణాలు పొందిన అగ్రశ్రేణి 10 రాష్ట్రాల్లో గుజరాత్‌లో అత్యధికంగా 15 శాతం వృద్ధి నమోదైంది. తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, దిల్లీ, తమిళనాడు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో 6-8 శాతం మధ్య వృద్ధి కనిపించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని