అమెరికా సంస్థ బ్లాక్‌పై హిండెన్‌బర్గ్‌ సంచలన నివేదిక

అమెరికాకు చెందిన ఆర్థిక సేవలు, మొబైల్‌ బ్యాంకింగ్‌ సంస్థ ‘బ్లాక్‌’ (అంతకుముందు పేరు స్క్వేర్‌) నిర్వాహకులు భారీ అక్రమాలకు పాల్పడ్డారంటూ, అమెరికాకే చెందిన పరిశోధనా సంస్థ హిండెన్‌బర్గ్‌ గురువారం మరో  సంచలన నివేదికను బయటపెట్టింది.

Published : 24 Mar 2023 01:33 IST

ట్విటర్‌ సహ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సే సంస్థ ఇది
భారీగా అక్రమాలు జరిగాయంటూ వెల్లడి
20% పతనమైన షేరు

వాషింగ్టన్‌: అమెరికాకు చెందిన ఆర్థిక సేవలు, మొబైల్‌ బ్యాంకింగ్‌ సంస్థ ‘బ్లాక్‌’ (అంతకుముందు పేరు స్క్వేర్‌) నిర్వాహకులు భారీ అక్రమాలకు పాల్పడ్డారంటూ, అమెరికాకే చెందిన పరిశోధనా సంస్థ హిండెన్‌బర్గ్‌ గురువారం మరో  సంచలన నివేదికను బయటపెట్టింది. భారత్‌కు చెందిన అదానీ గ్రూప్‌పై జనవరి 24న ఈ సంస్థ విడుదల చేసిన నివేదిక వల్లే, ఆ గ్రూప్‌ సంస్థల మార్కెట్‌ విలువ 140 బిలియన్‌ డాలర్లకు పైగా హరించుకుపోయిన సంగతి విదితమే. హిండెన్‌బర్గ్‌ తాజాగా ఆరోపణలు చేసిన సంస్థ ట్విటర్‌ సహ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సే, జేమ్స్‌ మాకెల్వేయ్‌కు చెందినది. ఈ నివేదిక ఫలితంగా బ్లాక్‌ షేరు ధర 20% క్షీణించింది. రెండేళ్ల పరిశోధన అనంతరమే ఈ నివేదికను రూపొందించినట్లు హిండెన్‌బర్గ్‌ తెలిపింది.

బిలియన్‌ డాలర్ల షేర్ల విక్రయం..

ఈ సంస్థ వ్యవస్థాపకులతో పాటు ముఖ్య ఆర్థిక అధికారి అమృతా అహుజా, మేనేజర్‌ బ్రెయిన్‌ గ్రాస్సాడోనియా కూడా సంస్థ షేరుపై మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టినట్లు హిండెన్‌బర్గ్‌ నివేదికలో తెలిపింది. ఖాతాదార్ల సంఖ్యను ఎక్కువగా చూపుతూ, సంస్థ షేరు విలువను కృత్రిమంగా పెంచుకుంటూ పోవడం ద్వారా బ్లాక్‌ నిర్వాహకులు పెట్టుబడిదార్లను, ప్రభుత్వాన్ని మోసగించారన్నది హిండెన్‌బర్గ్‌ ఆరోపణ. కరోనా సమయంలో వ్యవస్థాపకులు సుమారు 100 కోట్ల డాలర్‌ విలువైన షేర్లను విక్రయించినట్లు తెలిపింది. బ్లాక్‌ వినియోగదారుల్లో ఎక్కువ మంది నేరస్థులు, అక్రమ వ్యాపారాలు నిర్వహించే వారు ఉన్నారని.. సంస్థలోని ఖాతాల్లో 40 నుంచి 75 శాతం నకిలీవని ఆ సంస్థ మాజీ ఉద్యోగులు తమతో వెల్లడించినట్లు హిండెన్‌బర్గ్‌ తెలిపింది.

ఇతర ఆరోపణలు

* బ్లాక్‌ తన వినియోగదారుల సంఖ్యను ఎక్కువగా చూపడంతో పాటు, ఖర్చుల వివరాలను తక్కువగా చూపి పెట్టుబడిదారులను మోసం చేసింది.  

* బ్లాక్‌ సంస్థ క్రమ పద్ధతిలో పెట్టుబడిదారుల నుంచి సాయం పొందింది. ఆవిష్కరణ పేరుతో వినియోగదారులను, ప్రభుత్వాన్ని సులభంగా మోసం చేయడమే బ్లాక్‌ వ్యాపారం వెనుకున్న అసలు ఉద్దేశం.

* నిబంధనలను అతిక్రమించడం, రుణాల పేరుతో దోపిడీ చేయడం, విప్లవాత్మక సాంకేతికత పేరుతో కంపెనీ గణాంకాలను కృత్రిమంగా పెంచి పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించడమే బ్లాక్‌ వ్యాపారం లక్ష్యం.

హిండెన్‌బర్గ్‌ నివేదికలతో ఆయా కంపెనీల షేర్లు ఢమాల్‌

అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ నివేదిక వెల్లడించాక.. ఆ గ్రూప్‌ కంపెనీల షేర్ల పతనం జరిగింది. తాజాగా బ్లాక్‌ షేరు ధర ప్రీమార్కెట్‌ ట్రేడింగ్‌లో 20 శాతం వరకు క్షీణించింది. 2020 సెప్టెంబరు లో విద్యుత్‌ వాహన తయారీ సంస్థ నికోలా కార్ప్‌పై నివేదిక వెలువరచినప్పుడూ, ఆ సంస్థ షేరు పతనమైంది. ఆ కంపెనీ వ్యవస్థాపకుడు ట్రెవర్‌ మిల్టన్‌పై క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. ఆయన మదుపర్లను మోసం చేసినట్లు అక్టోబరులో రుజువై.. దోషిగా తేలారు.

బ్లాక్‌ ఇంక్‌ వ్యాపారం ఏమిటంటే..

జాక్‌ డోర్సే స్థాపించిన బ్లాక్‌ సంస్థ వ్యాపారులు, వినియోగదార్లకు చెల్లింపులు, మొబైల్‌ బ్యాంకింగ్‌ సేవలను అందిస్తుంది. 2009లో స్క్వేర్‌ పేరిట ఏర్పాటైన ఈ సంస్థ ఒక విప్లవాత్మక ఆలోచనతో వచ్చింది. ఒక చిన్న కార్డు రీడరును ఉపయోగించి స్మార్ట్‌ఫోన్‌ హెడ్‌ఫోన్‌ జాక్‌లో ప్లగ్‌ చేయడం ద్వారా సులువుగా వెండార్లు క్రెడిట్‌ కార్డు చెల్లింపులను స్వీకరించేలా చేయగలిగింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని