Income tax: డెట్‌ ఫండ్‌ మదుపర్లకు పన్ను ప్రయోజనాలు దూరం

డెట్‌ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేసే వారికి పన్ను ప్రయోజనాలు దూరం కానున్నాయి. ఈ ఫండ్లు తమ నిర్వహణలో ఉన్న ఆస్తుల్లో (ఏయూఎం) 35 శాతం కన్నా తక్కువగా ఈక్విటీల్లో మదుపు చేస్తే ఇక నుంచి పన్ను పరిధిలోకి రానున్నాయి.

Updated : 25 Mar 2023 09:31 IST

ఆర్థిక బిల్లు-సవరణలు
2023-24 ఏడాదికి అమలు

దిల్లీ: డెట్‌ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేసే వారికి పన్ను ప్రయోజనాలు దూరం కానున్నాయి. ఈ ఫండ్లు తమ నిర్వహణలో ఉన్న ఆస్తుల్లో (ఏయూఎం) 35 శాతం కన్నా తక్కువగా ఈక్విటీల్లో మదుపు చేస్తే ఇక నుంచి పన్ను పరిధిలోకి రానున్నాయి. ఈ మేరకు ఆర్థిక బిల్లు 2023కు ప్రభుత్వం సవరణలు చేసింది. ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తాయి.

ప్రస్తుతం ఇలా..:  ప్రస్తుతం డెట్‌ ఫండ్లలో పెట్టుబడులు పెట్టి, మూడేళ్లలోపు వెనక్కి తీసుకుంటే.. స్వల్పకాలిక మూలధన లాభంగా పరిగణిస్తున్నారు. ఇలా వచ్చిన లాభాన్ని మొత్తం ఆదాయంలో కలిపి చూపించి, వర్తించే శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాల్సి వస్తుంది. డెట్‌ ఫండ్లలో మూడేళ్లకు మించి కొనసాగి, ఆ తర్వాత పెట్టుబడులను వెనక్కి తీసుకుంటే ద్రవ్యోల్బణ సూచీకి సర్దుబాటు చేసి 20 శాతం దీర్ఘకాలిక మూలధన పన్ను (ఎల్‌టీసీజీ)ను చెల్లిస్తే సరిపోతుంది. సూచీకి సర్దుబాటు చేయకపోతే 10 శాతం పన్ను చెల్లించాలి.

సవరణల వల్ల ఇలా..: ఇప్పుడు చేసిన సవరణల వల్ల డెట్‌ ఫండ్‌ మదుపరులకు ఈ దీర్ఘకాలిక పన్ను ప్రయోజనం దూరం కానుంది. నిర్వహణలో ఉన్న ఆస్తుల్లో 35 శాతంకన్నా భారతీయ ఈక్విటీల్లో తక్కువ మదుపు చేసే డెట్‌ ఫండ్లపై వచ్చిన లాభాలకు వర్తించే శ్లాబును బట్టి, పన్ను చెల్లించాల్సిందే. దీనివల్ల మార్కెట్‌ ఆధారిత డిబెంచర్లు- మ్యూచువల్‌ ఫండ్ల మధ్య పన్నులో సమానత్వం రానుంది. ఇక నుంచి ఈక్విటీల్లో 35 శాతం కన్నా తక్కువగా మదుపు చేసే డెట్‌ ఫండ్లల ద్వారా వచ్చిన లాభాలను ఆదాయంలో కలిపి చూపించి, వర్తించే పన్నును చెల్లించాలి.

బ్యాంకు డిపాజిట్ల వైపు మొగ్గు?:  సాధారణంగా అధిక పన్ను శ్లాబులో ఉన్నవారు బ్యాంకు డిపాజిట్లకు బదులు డెట్‌ ఫండ్లను ఎక్కువగా ఎంచుకుంటారు. మూడేళ్లకు మించి కొనసాగినప్పుడు దీర్ఘకాలిక మూలధన రాబడిపై పన్ను ప్రయోజనం వల్ల వచ్చిన ఆదాయానికి అంతగా పన్ను భారం ఉండేది కాదు. బ్యాంకు డిపాజిట్లపై వచ్చిన వడ్డీకి వర్తించే కాలంతో సంబంధం లేకుండా మొత్తం ఆదాయంలో కలిపి, వర్తించే పన్ను శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాలి. దీనివల్ల చాలామంది డెట్‌ పథకాల వైపు మొగ్గు చూపేవారు. ఇప్పుడు ఈక్విటీల్లో తక్కువగా పెట్టుబడి పెట్టిన ఫండ్లలో మదుపు చేస్తే, నష్టభయం పెరుగుతుంది. పన్ను పరంగానూ కలిసి రాదు. కాబట్టి, మళ్లీ బ్యాంకు డిపాజిట్లకు ఆదరణ పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

ఆప్షన్‌ విక్రయాలపై పన్ను పెంపు

ఆప్షన్‌ల అమ్మకాలకు సంబంధించి ‘సెక్యూరిటీస్‌ లావాదేవీల పన్ను(ఎస్‌టీటీ)’ను పెంచుతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఆర్థిక బిల్లు సవరణల్లో దీన్ని చేర్చింది. ఇప్పటివరకూ ఆప్షన్‌ అమ్మకాలపై 0.05 శాతం ఎస్‌టీటీ ఉండగా, ఇప్పుడు దాన్ని 0.0625 శాతానికి చేర్చింది. అంటే, రూ.లక్ష లావాదేవీకి ఇప్పటి వరకూ రూ.50 పన్ను వర్తించేది. ఏప్రిల్‌ 1 నుంచి ఇది  రూ.62.5గా మారుతుంది.

ఆదాయ పన్ను చెల్లింపుదార్లకు ఊరట

దిల్లీ: కొత్త పన్ను విధానాన్ని ఎంపిక చేసుకున్న పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం కొంత ఊరట కల్పిస్తూ ఆర్థిక బిల్లు 2023లో సవరణలు చేసింది. బడ్జెట్‌ ప్రతిపాదనల ప్రకారం పన్ను వర్తించే ఆదాయం రూ.7 లక్షల వరకూ ఉన్నప్పుడు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ ఆదాయం రూ. 100 అధికంగా ఉన్నా అంటే.. రూ.7,00,100 ఉన్నా ఆ వ్యక్తి రూ.25,010 వరకూ పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఈ ఇబ్బందిని తొలగిస్తూ కొత్త సవరణ తీసుకొచ్చింది. అయితే, ఈ అదనపు ఆదాయానికి మినహాయింపు ఎంత వరకూ అన్నదానిపై స్పష్టత లేదు. పన్ను నిపుణుల లెక్కల ప్రకారం రూ.7,27,777 వరకూ ఆదాయం ఉన్నా పన్ను భారం ఉండకపోవచ్చు.

* రీట్స్‌, ఇన్విట్స్‌లకు ఉపశమనం: శుక్రవారం ప్రతిపాదించిన ఆర్థిక బిల్లులో రీట్స్‌, ఇన్విట్‌లకు ఉపశమనం లభించింది. మూలధన ప్రతిఫలాలుగా వ్యాపారాలను పరిగణించనున్నట్లు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు