ప్రభుత్వ లాభాల్లో రూ.750 కోట్లు మినహాయించుకున్న వేదాంతా!

తన గ్యాస్‌, చమురు క్షేత్రాల్లో వచ్చిన లాభాల నుంచి ప్రభుత్వ వాటా కింద ఇవ్వాల్సిన 9.1 కోట్ల డాలర్లను (సుమారు రూ.750 కోట్లు) అనిల్‌ అగర్వాల్‌ నేతృత్వంలోని వేదాంతా నిలిపేసినట్లు తెలుస్తోంది.

Published : 25 Mar 2023 03:07 IST

అదనపు పన్ను చెల్లింపుల కింద జమ

దిల్లీ: తన గ్యాస్‌, చమురు క్షేత్రాల్లో వచ్చిన లాభాల నుంచి ప్రభుత్వ వాటా కింద ఇవ్వాల్సిన 9.1 కోట్ల డాలర్లను (సుమారు రూ.750 కోట్లు) అనిల్‌ అగర్వాల్‌ నేతృత్వంలోని వేదాంతా నిలిపేసినట్లు తెలుస్తోంది. అదనపు పన్ను చెల్లింపుల కోసం దీనిని మినహాయించుకుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. విండ్‌ ఫాల్‌ ట్యాక్స్‌ (అదాటు లాభాల పన్ను) విధింపును వ్యతిరేకించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కన్పిస్తోందని ఆ వర్గాలు తెలిపాయి. 2022 జులై 1న తొలిసారి అదాటు లాభాల పన్నును భారత్‌ విధించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే దేశీయంగా ఉత్పత్తి చేసిన ముడి చమురుపైనా ప్రత్యేక అదనపు ఎక్సైజ్‌ సుంకాన్ని (ఎస్‌ఏఈడీ) విధిస్తోంది. తొలుత ఇది టన్నుకు రూ.23,250గా ఉండగా.. ప్రతి 15 రోజులకోసారి మార్పు చేస్తూ ప్రస్తుతం రూ.3,500కు తగ్గించింది. కాగా.. ఇప్పటికే చమురు, గ్యాస్‌ ధరలపై రాయల్టీ కింద 10-20 శాతం పన్నును, 20 శాతం చమురు సెస్సును కూడా సంస్థలు చెల్లిస్తున్నాయి. మరోవైపు చమురు, గ్యాస్‌ విక్రయాల ద్వారా వచ్చిన లాభాల నుంచి ముందుగా నిర్ణయించిన వాటా ప్రకారం ప్రభుత్వానికి చెల్లించాల్సి కూడా ఉంది. మళ్లీ ఇప్పుడు అదనంగా ఎస్‌ఈఏడీ విధించడాన్ని ప్రభుత్వంతో తాము కుదుర్చుకున్న ఒప్పందానికి ఉల్లంఘనగా ముడి చమురును ఉత్పత్తి చేసే సంస్థలు భావిస్తున్నాయి. అందుకే రాజస్థాన్‌ చమురు క్షేత్రంపై చెల్లించిన ఎస్‌ఏఈడీ కోసం 85.35 మిలియన్‌ డాలర్లను, కాంబే బేసిన్‌పై చెల్లించిన 5.50 మిలియన్‌ డాలర్లను మినహాయించుకోనున్నట్లు పెట్రోలియమ్‌, సహజవాయువు మంత్రిత్వ శాఖకు వేదంతా జనవరి 31న, ఫిబ్రవరి 20న సమాచారం ఇచ్చింది. ఒప్పందంలో పొందుపర్చినట్లుగా ఆర్థిక ప్రతిఫలాలు కోల్పోకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వేదంతా తెలిపిందని ఆ వర్గాలు తెలిపాయి. అయితే ఇలా ఏకపక్షంగా మినహాయించుకోవడం సరైనది కాదని.. మినహాయించిన మొత్తాన్ని ఏడు రోజుల్లోగా వడ్డీతో కలిపి చెల్లించాలని ప్రభుత్వం వేదాంతాను ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను వేదాంతా పాటించలేదు. ఇదే వ్యవహారంపై వేదాంతాకు చెందిన కెయిర్న్‌ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ను వివరణ కోసం సంప్రదించగా ఎలాంటి సమాధానం రాలేదు. చమురు మంత్రిత్వ శాఖ నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు