సంక్షిప్త వార్తలు(5)
ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పింఛన్ పథకాన్ని (ఎన్‌పీఎస్) మరింత మెరుగుపరిచే అంశంపై కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది.
ఎన్‌పీఎస్‌పై కేంద్రం కమిటీ
మరింత మెరుగుపరిచేందుకు సూచనలు
దిల్లీ: ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పింఛన్ పథకాన్ని (ఎన్‌పీఎస్) మరింత మెరుగుపరిచే అంశంపై కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. దీనికి కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నేతృత్వం వహిస్తారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో తెలిపారు. ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ఈ కమిటీ కృషి చేస్తుందని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు పాత పింఛన్ వ్యవస్థను అమలు చేసేందుకు మొగ్గుచూపుతున్న నేపథ్యంలో కేంద్రం ఎన్‌పీఎస్‌పై కమిటీని ఏర్పాటు చేయడం గమనార్హం. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాలు తాము పాత పింఛను వ్యవస్థనే అమలు చేయనున్నట్లు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశాయి. మరికొన్ని భాజపాయేతర పాలిత రాష్ట్రాలు కూడా ఇదే దిశలో వెళ్లేందుకు యోచన చేస్తున్నాయి. సాయుధ బలగాలు మినహా 2004 జనవరి 1 తర్వాత చేరిన ప్రభుత్వ ఉద్యోగులందరికీ కేంద్రం ఎన్‌పీఎస్‌ను అమలు చేస్తోంది. మెజారిటీ రాష్ట్ర ప్రభుత్వాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలు సైతం తమ ఉద్యోగులకు ఎన్‌పీఎస్‌ను వర్తింపజేశాయి.
లావాదేవీ ఛార్జీల్లో 6% పెంపు నిర్ణయం వెనక్కి: ఎన్‌ఎస్‌ఈ
దిల్లీ: ఏప్రిల్ 1 నుంచి క్యాష్ ఈక్విటీ మార్కెట్, ఈక్విటీ డెరివేటివ్స్ విభాగాల్లో లావాదేవీ ఛార్జీలను 6 శాతం పెంచాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) ప్రకటించింది. ఎన్‌ఎస్‌ఈ మదుపరి భద్రతా ఫండ్ ట్రస్ట్ (ఎన్‌ఎస్‌ఈ ఐపీఎఫ్‌టీ) నిధి ఏర్పాటు కోసం అధిక ఛార్జీలను 2021 జనవరి 1న తీసుకొచ్చారు. బ్రోకర్ తప్పిదాల కారణంగా వాటిల్లే మార్కెట్ పరిస్థితుల కోసం వీటిని వినియోగిస్తారు. శుక్రవారం జరిగిన బోర్డు డైరెక్టర్ల సమావేశంలో ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు ఎన్‌ఎస్‌ఈ వెల్లడించింది.
జాక్‌డోర్సేకు హిండెన్‌బర్గ్ ఆరోపణల సెగ
సంపదలో రూ.4,327 కోట్లు ఆవిరి
వాషింగ్టన్: హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణల ప్రభావంతో అమెరికాకు చెందిన ఆర్థిక సేవలు, మొబైల్ బ్యాంకింగ్ సంస్థ ‘బ్లాక్’ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. దీంతో ఆ సంస్థ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే సంపద భారీగా ఆవిరయింది. బ్లాక్ షేర్లు గురువారం ఓ దశలో 22 శాతం పతనం కాగా.. చివరకు 15 శాతానికి నష్టం పరిమితమైంది. ఈ ప్రభావంతో డోర్సే సంపద 526 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.4,327 కోట్లు) మేర కరిగిపోయింది. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ఆయన సంపద 11 శాతం తగ్గి 4.4 బిలియన్ డాలర్లకు చేరింది. డోర్సే సంపదలో అత్యధిక వాటా.. బ్లాక్‌లో ఆయనకున్న షేర్ల నుంచే ఉంటుంది. డోర్సే 4.4 బిలియన్ డాలర్ల సంపదలో బ్లాక్ షేర్ల వాటాయే 3 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా.
ఇమామీ రూ.186 కోట్ల బైబ్యాక్
ఒక్కో షేరు రూ.450 వద్ద
ఆమోదించిన బోర్డు
బహిరంగ విపణిలో రూ.186 కోట్ల విలువైన షేర్లను తిరిగి కొనుగోలు(బైబ్యాక్) చేయడానికి ఇమామీ బోర్డు డైరెక్టర్లు ఆమోదం తెలిపారు. ఒక్కోటీ రూ.1 ముఖ విలువ కలిగిన 41.3 లక్షల ఈక్విటీ షేర్లను రూ.450 ధర వద్ద కొనుగోలు చేయడానికి బోర్డు అనుమతినిచ్చింది. బైబ్యాక్ ధర అంతక్రితం షేరు ముగింపు(రూ.364.10)తో పోలిస్తే 23 శాతం అధికం కావడం గమనార్హం. ప్రకటన వెలువడిన అనంతరం షేరు లాభాల్లోకి వెళ్లినా చివరకు మాత్రం 1.55% నష్టంతో రూ.362.55 వద్ద స్థిరపడింది.
జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఏడీపీ ఒప్పందానికి సీసీఐ అనుమతి
ఈనాడు, హైదరాబాద్: జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు, ఫ్రాన్స్‌కు చెందిన ఏరోపోర్ట్స్ డి పారిస్ ఎస్‌ఏ(ఏడీపీ)కు మధ్య కుదిరిన పెట్టుబడి ఒప్పందానికి సీసీఐ (కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా) ఆమోదం తెలిపింది. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఎఫ్‌సీసీసీ (విదేశీ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్లు) కొనుగోలు చేయటం ద్వారా పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. దీనికి సీసీఐ అనుమతి అవసరం. తాజాగా సీసీఐ ఈ ప్రతిపాదనకు అనుమతి మంజూరు చేసింది. ఇదే కాకుండా జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్, జీఎంఆర్ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ను జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో విలీనం చేయటానికి కూడా సీసీఐ అనుమతి ఇచ్చింది.
సంక్షిప్తంగా
* డాయిష్ బ్యాంక్ రుణబకాయిలపై బీమా ఖర్చులు ఒక్కసారిగా పెరగడం మదుపర్లను కలవరపెట్టింది. అంతర్జాతీయ బ్యాంకుల సంక్షోభంలో డాయిష్ బ్యాంక్ చేరొచ్చన్న భయాలతో శుక్రవారం షేరు 9 శాతం వరకు నష్టపోయింది.
* ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం(నేడు) సమావేశం కానున్నారు. బ్యాంకుల పనితీరుపై ఆమె సమీక్ష చేపట్టనున్నారు. అమెరికా, ఐరోపా బ్యాంకుల పతనంపైనా చర్చించే అవకాశం ఉంది.
* బహిరంగ మార్కెట్ లావాదేవీ ద్వారా 13,82,462 భారతీ ఎయిర్‌టెల్ షేర్లను బీఎన్‌పీ పరిబాస్ ఆర్బిట్రేజ్ రూ.105 కోట్లకు విక్రయించింది. ఒక్కో షేరును సగటున రూ.762.55 చొప్పున అమ్మింది.
* 100 శాతం దేశీయ పరిజ్ఞానంతో చెల్లింపుల ప్లాట్‌ఫామ్‌ను అప్‌గ్రేడ్ చేసినట్లు పేటీఎంను నిర్వహించే వన్97 కమ్యూనికేషన్స్ వెల్లడించింది.
* మోసాల ప్రకటనకు సంబంధించిన నిబంధనలను పాటించనందుకు కరూర్ వైశ్యా బ్యాంక్‌పై ఆర్‌బీఐ రూ.30 లక్షల జరిమానా విధించింది.
* లిథియం నిల్వలను వేలం వేసే పనిలో ఉన్నట్లు జమ్మూ కశ్మీర్ కార్యదర్శి అమిత్ శర్మ తెలిపారు. ఇందుకు ఎటువంటి గడువును విధించుకోలేదని వెల్లడించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Bengaluru: మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం.. ఎలాంటి షరతులుండవ్!: మంత్రి
-
Movies News
social look: విహారంలో నిహారిక.. షికారుకెళ్లిన శ్రద్ధా.. ఓర చూపుల నేహా
-
Politics News
Lokesh: రూ.లక్ష కోట్లున్న వ్యక్తి పేదవాడు ఎలా అవుతారు?: లోకేశ్
-
India News
Lancet Report: తీవ్ర గుండెపోటు కేసుల్లో.. మరణాలకు ప్రధాన కారణం అదే!
-
Sports News
MS Dhoni : మైదానాల్లో ధోనీ మోత మోగింది.. ఆ శబ్దం విమానం కంటే ఎక్కువేనట..
-
Politics News
BJP: ప్రతి నియోజకవర్గంలో 1000 మంది ప్రముఖులతో.. భాజపా ‘లోక్‌సభ’ ప్లాన్