అందుబాటు ధర గృహాలు కట్టడం లేదు.. 7 నగరాల్లో తగ్గిన లభ్యత

దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో అందుబాటు ధరల గృహ లభ్యత తగ్గిందని స్థిరాస్తి కన్సల్టెంట్‌ సంస్థ అనరాక్‌ తన నివేదికలో వెల్లడించింది.

Published : 26 Mar 2023 06:55 IST

స్థలం ధర, నిర్మాణ వ్యయాలు పెరగడం వల్లే

దిల్లీ: దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో అందుబాటు ధరల గృహ లభ్యత తగ్గిందని స్థిరాస్తి కన్సల్టెంట్‌ సంస్థ అనరాక్‌ తన నివేదికలో వెల్లడించింది. రూ.40 లక్షల్లోపు ధర ఉండే వాటిని అందుబాటు ధర గృహాలుగా వ్యవహరిస్తారు. 2018లో మొత్తం గృహాల లభ్యతలో అందుబాటు ధరలో లభించే గృహాల వాటా 40 శాతంగా ఉండగా.. గతేడాది 20 శాతానికి తగ్గిందని అనరాక్‌ తెలిపింది. స్థలాల ధరలు పెరగడం, లాభాల మార్జిన్‌ తక్కువగా ఉంటుండటం, తక్కువ వడ్డీ రేట్లకు రుణాల లభించపోవడం లాంటివి... ఇందుకు కారణాలుగా పేర్కొంది. సిమెంటు, ఉక్కు ధరలు పెరగడంతో తక్కువ ధరలో గృహాలను నిర్మించడం స్థిరాస్తి అభివృద్ధి సంస్థలకు మరింత కష్టంగా మారిందని తెలిపింది. నివేదిక ప్రకారం..

* 2022లో ఏడు ప్రధాన నగరాల్లో స్థిరాస్తి అభివృద్ధి సంస్థలు 3,57,650 గృహాలను విక్రయానికి తీసుకొని రాగా.. ఇందులో కేవలం 20 శాతమే అందుబాటు ధర గృహాలు. 2018లో మొత్తంగా 1,95,300 గృహాలను విక్రయానికి ఉంచగా.. ఇందులో అందుబాటు ధర గృహాల వాటా 40 శాతంగా ఉంది.

* 2019లోనూ మొత్తం గృహాల్లో అందుబాటు ధర గృహాల వాటా 40 శాతంగానే ఉంది. ఆ తర్వాత 2020లో ఈ తరహా గృహాల వాటా 30 శాతానికి తగ్గింది. 2021లో ఇది మరింత తగ్గి 26 శాతానికి పరిమితమైంది.

* ఏడు ప్రధాన నగరాల్లో.. 2019లో మొత్తంగా 2,36,560 ఇళ్లు, 2020లో 1,27,960 గృహాలు, 2021లో 2,36,700 ఇళ్లను స్థిరాస్తి సంస్థలు అందుబాటులోకి తెచ్చాయి.

* రూ.40 లక్షల నుంచి రూ.1.5 కోట్ల మధ్య ధర ఉన్న ఫ్లాట్లకు ప్రస్తుతం గిరాకీ ఎక్కువగా ఉందని అనరాక్‌ తెలిపింది. గత కొన్నేళ్లుగా భారత్‌లో విలాసవంత నివాసాల వైపు ఆసక్తి చూపుతున్న కొనుగోలుదార్ల సంఖ్య పెరుగుతోందని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని