రూ.12,30,000 కోట్లకు దేశీయ ఇ-కామర్స్‌ విపణి

గతేడాది దేశీయ ఇ-కామర్స్‌ విపణి 83 బిలియన్‌ డాలర్లు (రూ.6,80,600 కోట్లు) ఉండగా.. 2026లో 150 బిలియన్‌ డాలర్లకు (రూ.12,30,000 కోట్లు) చేరే అవకాశం ఉందని ఓ నివేదిక అంచనా వేసింది.

Published : 26 Mar 2023 01:42 IST

2026 కల్లా చేరే అవకాశం
డిజిటల్‌ చెల్లింపులకు ఊతం: ఎఫ్‌ఐఎస్‌ నివేదిక

దిల్లీ: గతేడాది దేశీయ ఇ-కామర్స్‌ విపణి 83 బిలియన్‌ డాలర్లు (రూ.6,80,600 కోట్లు) ఉండగా.. 2026లో 150 బిలియన్‌ డాలర్లకు (రూ.12,30,000 కోట్లు) చేరే అవకాశం ఉందని ఓ నివేదిక అంచనా వేసింది. యూపీఐ ఆధారిత లావాదేవీలు గణనీయంగా పెరుగుతుండటం, నగదు రూపేణా లావాదేవీలు మరింత తగ్గనుండటమే ఇందుకు కారణంగా అభిప్రాయపడింది. 2023 జనవరి నాటికి యూపీఐ లావాదేవీల సంఖ్య ఏడాదిక్రితంతో పోలిస్తే రికార్డు స్థాయిలో 74.1 శాతం పెరిగాయి. 2019లో డిజిటల్‌ వ్యాలెట్‌లు 5 శాతంగా ఉండగా.. 2022లో 35 శాతానికి చేరాయని ఎఫ్‌ఐఎస్‌ రూపొందించిన ‘గ్లోబల్‌ పేమెంట్స్‌ రిపోర్ట్‌’ వెల్లడించింది. 2019లో పీఓఎస్‌ లావాదేవీల విలువలో నగదు వినియోగం 71 శాతంగా ఉండగా.. 2022లో 27 శాతానికి తగ్గింది. రియల్‌ టైం చెల్లింపుల మౌలిక వసతుల అభివృద్ధి ద్వారా చెల్లింపుల్లో ప్రపంచంలోనే భారత్‌ అగ్రగామిగా అవతరించిందని నివేదిక పేర్కొంది. ‘యూపీఐ రాకతో వినియోగదారులు నగదు రూపేణా చెల్లింపులు తగ్గించారు. అదే సమయంలో అందరికీ చెల్లింపు సేవలను అందుబాటులోకి తెచ్చేందుకూ దోహదం చేసింది. ప్రపంచవ్యాప్తంగా చెల్లింపుల్లో భారత్‌ను అగ్రగామిగా నిలబెట్టింద’ని ఎఫ్‌ఐఎస్‌ జనరల్‌ మేనేజర్‌ ఫిల్‌ పామ్‌ఫార్డ్‌ తెలిపారు. 2026 కల్లా మొత్తం లావాదేవీల విలువలో నగదు చెల్లింపులు 34 శాతం తగ్గే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని