విమానయానానికి మంచి రోజులు
దేశీయ విమానయానానికి మంచి రోజులు వస్తున్నాయి. మూడేళ్ల కిందట కొవిడ్ సంక్షోభం కారణంగా కుదేలైన పరిశ్రమ, మళ్లీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.
2025కు కొత్త విమానాశ్రయాలు, పాతవి ఆధునికీకరణ
రూ.98,000 కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వం సిద్ధం
మళ్లీ పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ
దేశీయ విమానయానానికి మంచి రోజులు వస్తున్నాయి. మూడేళ్ల కిందట కొవిడ్ సంక్షోభం కారణంగా కుదేలైన పరిశ్రమ, మళ్లీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. విమాన ప్రయాణానికి గిరాకీ పెరుగుతుండటంతో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. 2025 నాటికి విమానాశ్రయాల ఆధునికీకరణ, కొత్తవి ఏర్పాటు చేసేందుకు దాదాపు రూ.98,000 కోట్ల పెట్టుబడులు పెట్టాలని భావిస్తోంది. విమాన ప్రయాణానికి గిరాకీ క్రమంగా పుంజుకుంటోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ గతేడాదితో పోలిస్తే 54 శాతం వృద్ధి చెందిందని ఇక్రా గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా 2020 ఫిబ్రవరితో పోలిస్తే ఇవి 4 శాతం మాత్రమే తక్కువ. భారతీయులు విమాన ప్రయాణానికి మొగ్గు చూపుతున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మధ్యతరగతి నుంచి గిరాకీ అధికం కావడం, అధిక ఆదాయాలు, మరిన్ని ప్రాంతాలకు విమాన సదుపాయాలు రావడం ఇందుకు కలిసొస్తున్నాయి. 74 నుంచి 148కు: 2014లో 74గా ఉన్న దేశీయ విమానాశ్రయాల సంఖ్య.. ప్రస్తుతం 148కు చేరింది. 2013లో 6 కోట్లుగా ఉన్న దేశీయ ప్రయాణికుల సంఖ్య.. 2019లో 14.1 కోట్లుగా గరిష్ఠాన్ని నమోదుచేసింది. భారత విమానయాన పరిశ్రమ భవిష్యత్ రేటింగ్‌ను ‘ప్రతికూలం’ నుంచి ‘స్థిరం’గా ఇక్రా సవరించింది. 2022-23లో ప్రయాణికుల రద్దీ గణనీయంగా పుంజుకుందని, 2023-24లోనూ ఇదే జోరు కొనసాగవచ్చని అంచనా వేసింది. భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ), ఇతర ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్లు దాదాపు రూ.98,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు విమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ రాజ్యసభకు తెలిపారు. కొత్త విమానాశ్రయాల నిర్మాణం, కొత్త టెర్మినళ్లు, ప్రస్తుత టెర్మినళ్ల విస్తరణ, నవీకరణకు వీటిని వినియోగించనున్నారు. ఇందులో ఏఏఐ రూ.25,000 కోట్లకు పైగా వెచ్చించనుండగా, మిగతా మొత్తాన్ని ప్రైవేట్ ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్లు భరించనున్నారు.
మౌలిక సదుపాయాలపైనే దృష్టి
మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన ద్వారా 2047కు అభివృద్ధి చెందిన దేశంగా భారత్ నిలవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం మౌలిక రంగ ప్రాజెక్టులపై భారీ పెట్టుబడులను బడ్జెట్‌లో ప్రకటించారు. వచ్చే అయిదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లోని భోగాపురం, మహారాష్ట్రలో నవీ ముంబయి, కర్ణాటకలో విజయపుర, హసన్, శివమొగ్గ, ఉత్తర్ ప్రదేశ్‌లో నోయిడా (జేవార్), గుజరాత్‌లో ధోలేరా, హిరాసర్ విమానాశ్రయాలను పూర్తిచేయాలని కేంద్రం భావిస్తోంది. ప్రాంతీయ అనుసంధానత పథకం (ఆర్‌సీఎస్)-ఉడాన్ కింద 2024కు 100 విమానాశ్రయాలను అభివృద్ధి చేయడానికి సిద్ధమైంది.
కంపెనీల్లో పెరిగిన విశ్వాసం
వచ్చే రెండేళ్లలో భారత కంపెనీలు కనీసం 1300 విమానాలకు ఆర్డర్లు పెట్టొచ్చని ఏవియేషన్ కన్సల్టెన్సీ కాపా ఇండియా అంచనా వేస్తోంది. ఏటీఎఫ్ ధరల్లో హెచ్చుతగ్గులు, రూపాయి క్షీణత వంటి భయాలు కొనసాగుతున్నప్పటికీ దేశీయ విమానయాన రంగం ఆశాజనకంగానే కనిపిస్తోంది. ఆకాశ ఎయిర్ వంటి కొత్త సంస్థల ప్రారంభం, ఎయిరిండియా- ఎయిరేషియా- విస్తారా స్థిరీకరణ, త్వరలో జెట్ ఎయిర్‌వేస్ కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశం ఉండటమే ఇందుకు కారణం. ఎయిర్‌బస్, బోయింగ్‌ల నుంచి 495 విమానాల కొనుగోలుకు ఎయిరిండియా ఫిబ్రవరిలో ఒప్పందం కుదుర్చుకుని రికార్డు సృష్టించింది. భారీ సంఖ్యలో నేరోబాడీ విమానాల ఆర్డరు పెట్టేందుకు ఆకాశ ఎయిర్ సిద్ధమవుతోంది. ఇండిగో దాదాపు 500 విమానాలు, గోఫస్ట్ 72 విమానాలు, ఆకాశ ఎయిర్ 56 విమానాలు, విస్తారా 17 విమానాలను అందుకోనున్నాయి. స్పైస్‌జెట్‌కు కూడా విమానాల ఆర్డరు ఉంది. ఎయిరిండియాతో కలిపి దేశీయ సంస్థలకు కనీసం 1115 విమానాల ఆర్డర్లు ఉన్నాయి. 2022 నుంచి 2041 మధ్య భారత విమానయాన ప్రయాణికుల సంఖ్య ఏటా 7 శాతం పెరగొచ్చన్న అంచనాలు ఉన్నాయి. చైనాలో ఇది 4.9 శాతం మాత్రమే కావడం గమనార్హం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (09/06/2023)
-
Movies News
Siddharth: ఆమెను చూడగానే ఒక్కసారిగా ఏడ్చేసిన హీరో సిద్ధార్థ్
-
Movies News
Anasuya: ఇకపై ఆపేద్దామనుకుంటున్నా.. విజయ్‌తో వార్‌పై తొలిసారి స్పందించిన అనసూయ
-
Sports News
Trent Boult: ట్రెంట్ బౌల్ట్ ఈజ్ బ్యాక్.. వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం!
-
Movies News
Vimanam: ప్రివ్యూలకు రావాలంటే నాకు భయం.. ఇలాంటి చిత్రాలు అరుదు: శివ బాలాజీ