సంక్షిప్త వార్తలు(2)

దేశంలో ఉత్పత్తి చేసే సహజవాయువు ధరలపై పరిమితి విధించే ప్రతిపాదనను కేంద్రం పరిశీలించే అవకాశం ఉంది. సహజవాయువును అధికంగా వినియోగించే సీఎన్‌జీ, ఎరువుల కంపెనీల ముడి వ్యయాలను అదుపులో ఉంచేందుకే....

Published : 27 Mar 2023 01:55 IST

సహజ వాయువుపై ధరల పరిమితి!

దిల్లీ: దేశంలో ఉత్పత్తి చేసే సహజవాయువు ధరలపై పరిమితి విధించే ప్రతిపాదనను కేంద్రం పరిశీలించే అవకాశం ఉంది. సహజవాయువును అధికంగా వినియోగించే సీఎన్‌జీ, ఎరువుల కంపెనీల ముడి వ్యయాలను అదుపులో ఉంచేందుకే, ఈ యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియా వంటి చమురు కంపెనీలు, దేశంలోని సాధారణ క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేస్తున్న గ్యాస్‌కు ఒక ధరను, లోతైన - సంక్లిష్ట క్షేత్రాల నుంచి వెలికితీసే గ్యాస్‌కు మరింత అధిక ధరను చెల్లిస్తోంది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు రికార్డు గరిష్ఠాలకు చేరాయి. ఫలితంగా దేశంలోని దిగ్గజ క్షేత్రాల గ్యాస్‌ ధర మిలియన్‌ బ్రిటిష్‌ ధర్మల్‌ యూనిట్‌కు 8.57 డాలర్లు, కఠినమైన క్షేత్రాల నుంచి తీసే గ్యాస్‌ ధర 12.46 డాలర్లుగా ఉంది. ఏప్రిల్‌ 1న ఈ ధరలను మరోమారు సవరించనున్నారు. తాజాగా దిగ్గజ క్షేత్రాల గ్యాస్‌ ధర 10.7 డాలర్లకు చేరొచ్చని సమాచారం.


31లోపే మ్యూచువల్‌ ఫండ్‌ నామినీని ఎంపిక చేయాలి

దిల్లీ: మ్యూచువల్‌ ఫండ్‌ (ఎంఎఫ్‌) మదుపర్లు ఈ నెల 31లోపు నామినీని తప్పనిసరిగా ఎంపిక చేసుకోవాలి.. లేదంటే నామినీ అవసరం లేదనైనా డిక్లరేషన్‌ సమర్పించాలి. లేదంటే వారి ఖాతాలు స్తంభిస్తాయి. ఫలితంగా ఇప్పటి వరకు చేసిన పెట్టుబడి, దానిపై వచ్చే ప్రతిఫలాన్ని పొందడం కుదరదు. గత ఏడాది జూన్‌ 15నే మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దీనిపై ఉత్తర్వులు జారీ చేసింది. నామినీ ఎంపిక లేదా అవసరం లేదనైనా డిక్లరేషన్‌ సమర్పించాలని సూచించింది. దీనికి 2022 ఆగస్టు 1వ తేదీని గడువుగా విధించింది. ఆ తర్వాత రెండు దఫాలుగా ఈ గడువును పొడిగిస్తూ, 2023 మార్చి 31ని నిర్థారించింది.

* గతంలో ఎంఎఫ్‌ ఖాతాలను తెరిచేటప్పుడు చాలా మంది నామినీలను ఎంపిక చేయలేదు. ఫలితంగా వారికి అనుకోని ఆపద సంభవిస్తే, ఆ సొమ్మును క్లెయిమ్‌ చేసుకోవడానికి వారి చట్టబద్ధమైన వారసులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొంతమంది అయితే అసలు తాము ఎంఎఫ్‌ ఖాతాలు తెరిచినట్లు కూడా ఇంట్లో సమాచారం ఇవ్వడం లేదు. తదుపరి పెట్టుబడి పెట్టినవారు మరణిస్తే,  ఆ నిధులు వృథాగా ఆయా ఫండ్ల వద్ద పేరుకు పోతున్నాయి. ఇవీ పెద్ద మొత్తంలో ఉంటున్నాయి. దీనికి పరిష్కారంగానే నామినీలను తప్పనిసరి చేస్తూ సెబీ ఉత్తర్వులు జారీ చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు