56147-57000 దిగువన బలహీనం!

అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో వరుసగా మూడో వారం మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అమెరికా, స్విస్‌ బ్యాంకుల సంక్షోభం, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపుతో మదుపర్లు అప్రమత్తత పాటించారు.

Updated : 27 Mar 2023 02:40 IST

సమీక్ష: అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో వరుసగా మూడో వారం మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అమెరికా, స్విస్‌ బ్యాంకుల సంక్షోభం, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపుతో మదుపర్లు అప్రమత్తత పాటించారు. ఎఫ్‌ అండ్‌ ఓ కాంట్రాక్టులపై ప్రభుత్వం పన్ను పెంచడం దేశీయ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దేశీయంగా చూస్తే కార్పొరేట్‌ వార్తల నుంచి మార్కెట్లు సంకేతాలు తీసుకున్నాయి. డెట్‌ మ్యూచువల్‌ ఫండ్‌లు 35 శాతం కన్నా తక్కువగా ఈక్విటీల్లో మదుపు చేస్తే ఏప్రిల్‌ 1 నుంచి పన్ను పరిధిలోకి వస్తాయని ప్రభుత్వం వెల్లడించడం ప్రతికూల ప్రభావం చూపింది. బ్యారెల్‌ ముడిచమురు ధర 2.4% పుంజుకుని 75 డాలర్లకు చేరింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 82.55 నుంచి 82.48కు పెరిగింది. అంతర్జాతీయంగా చూస్తే.. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ 0.25% చొప్పున, స్విస్‌ నేషనల్‌ బ్యాంక్‌ 0.50% మేర వడ్డీ రేట్లు పెంచాయి. మొత్తం మీద ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్‌ 0.8% నష్టంతో 57,527 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 0.9% తగ్గి 16,945 పాయింట్ల దగ్గర స్థిరపడింది. స్థిరాస్తి, లోహ, ఐటీ రంగాలు నష్టపోగా.. విద్యుత్‌, ఎఫ్‌ఎమ్‌సీజీ, ఆరోగ్య సంరక్షణ షేర్లు మెరిశాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) నికరంగా రూ.6,654 కోట్ల షేర్లను విక్రయించగా, డీఐఐలు రూ.9,431 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. మార్చిలో ఇప్పటివరకు విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు (ఎఫ్‌పీఐలు) నికరంగా రూ.7,233 కోట్ల పెట్టుబడులు పెట్టారు.

లాభపడ్డ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి 2:5గా నమోదు కావడం..
పెద్ద షేర్లలో బలహీనతలను సూచిస్తోంది.

ఈ వారంపై అంచనా: ప్రస్తుతం సెన్సెక్స్‌ మధ్య కాల మద్దతు స్థాయి 56147- 57000 పాయింట్లకు చేరువగా ట్రేడవుతోంది. ఈ శ్రేణిని కోల్పోతే స్వల్పకాలంలో మరింత బలహీనపడే అవకాశం ఉంది. పైకివెళ్తే 200 రోజుల కదలికల సగటు అయిన 58800 పాయింట్ల దగ్గర నిరోధం ఎదురుకావొచ్చు. కీలక సూచీలతో పోలిస్తే పెద్ద షేర్లు బలహీనంగా కనిపిస్తున్నాయి.
ప్రభావిత అంశాలు: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చే సంకేతాలను దేశీయ సూచీలు అందిపుచ్చుకోవచ్చు. శ్రీరామనవమి పండుగ సందర్భంగా గురువారం సెలవు కావడంతో, ఈ వారం మార్కెట్లు నాలుగు రోజులు మాత్రమే పనిచేయనున్నాయి. బుధవారం మార్చి డెరివేటివ్‌ కాంట్రాక్టుల ముగింపు ఉండటంతో సూచీలు ఒడుదొడుకులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఏప్రిల్‌ 3-6 తేదీల్లో ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశం నేపథ్యంలో వడ్డీ రేట్ల ఆధారిత షేర్లు వెలుగులోకి రావొచ్చు. రెపోరేటు మరో 0.25% మేర పెంచుతారనే అంచనాలున్నాయి. ఫిబ్రవరి మౌలిక రంగ వృద్ధి, విదేశీ మారకపు నిల్వల గణాంకాలపై దృష్టిపెట్టొచ్చు. కార్పొరేట్‌ వార్తల ఆధారంగా షేరు/రంగం ఆధారిత కదలికలు చోటుచేసుకోవచ్చు. ఈ వారం పలు ప్రభుత్వ రంగ కంపెనీలు డివిడెండ్‌ చెల్లించనున్నాయి. దేశంలో కొవిడ్‌ కేసుల పెరుగుదలను గమనించాలి. ఆర్థిక సంవత్సరం ముగింపు కారణంగా మదుపర్లు, మ్యూచువల్‌ ఫండ్‌లు, దేశీయ సంస్థాగత సంస్థలు లాభాలు లేదా నష్టాలు స్వీకరించే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయంగా చూస్తే.. చైనా పారిశ్రామిక లాభాలు, అమెరికా వాణిజ్య లోటు, బ్రిటన్‌ కన్జూమర్‌ క్రెడిట్‌, ఈసీబీ జనరల్‌ కౌన్సిల్‌ సమావేశం, అమెరికా జీడీపీ వృద్ధి గణాంకాలు కీలకం కానున్నాయి. ముడిచమురు ధరలు, రూపాయి కదలికలు, ఎఫ్‌ఐఐ కొనుగోళ్ల నుంచి సంకేతాలు తీసుకోవచ్చు. చమురు ధరల క్షీణత, డీఐఐల కొనుగోళ్లతో దిగువ స్థాయుల్లో సెంటిమెంట్‌కు మద్దతు లభించొచ్చు.

తక్షణ మద్దతు స్థాయులు: 57,000, 56,147, 55,816
తక్షణ నిరోధ స్థాయులు: 58,067, 58,500, 59510
56,147- 57,000 పాయింట్ల దిగువన సెన్సెక్స్‌ మరింత బలహీనపడొచ్చు.

సతీశ్‌ కంతేటి, జెన్‌ మనీ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు