బలహీనతలు కొనసాగొచ్చు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారమూ బలహీనంగానే కదలాడొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిఫ్టీ-50 గత వారం 17,200 స్థాయికి ఎగువకు వెళ్లడంలో విఫలం కావడాన్ని దర్పణంగా చూపుతున్నారు.

Published : 27 Mar 2023 01:56 IST

17,200 పైనే లాభాలకు అవకాశం
సిమెంటు, ఔషధ రంగాలు రాణించొచ్చు
బ్యాంకింగ్‌ షేర్లలో ఒత్తిడి కనిపించొచ్చు
విశ్లేషకుల అంచనాలు
గురువారం ‘శ్రీరామనవమి’ సెలవు

స్టాక్‌ మార్కెట్‌ ఈ వారం

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారమూ బలహీనంగానే కదలాడొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిఫ్టీ-50 గత వారం 17,200 స్థాయికి ఎగువకు వెళ్లడంలో విఫలం కావడాన్ని దర్పణంగా చూపుతున్నారు. ప్రభావం చూపే వార్తలు లేనందున  నిఫ్టీ 16,800-17,200 స్థాయిలో కదలాడొచ్చని సాంకేతిక నిపుణులు అంటున్నారు. ఒక వేళ 17,200 పైన ముగిస్తే 17,600 వరకు వెళ్లేందుకు అవకాశం ఉందని; దిగువకు వస్తే 16,500-16,800 మధ్య చలించొచ్చని చెబుతున్నారు. శ్రీరామ నవమి పండగ సందర్భంగా మార్కెట్లకు గురువారం సెలవు కావడంతో, ఈ వారం ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితం కానుంది. నెలవారీ ఎఫ్‌అండ్‌ఓ కాంట్రాక్టుల గడువు బుధవారం ముగియనుంది. ఈ ప్రభావమూ మార్కెట్‌పై కనిపించొచ్చు. వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే...

* అంతర్జాతీయ బ్యాంకింగ్‌ పరిణామాలు, స్థూల ఆర్థిక అంచనాల్లో మార్పుల ఆధారంగా ఐటీ షేర్లు చలించొచ్చు. యాక్సెంచర్‌ బలమైన ఫలితాలు భారత ఐటీ కంపెనీలకు సానుకూలతలు తీసుకురావొచ్చు. అయితే 19,000 ఉద్యోగాలను తొలగించనుండటం ప్రతికూం.

* అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు క్షీణిస్తున్నందున ఐఓసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ వంటి చమురు శుద్ధి కంపెనీలు రాణించే అవకాశం ఉంది. చమురు ఉత్పత్తి చేసే ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియా వంటి కంపెనీల షేర్లు ప్రతికూలంగా చలించొచ్చు.

* గత వారం స్థిరీకరించుకున్న ఔషధ కంపెనీల షేర్లు ఈ వారం లాభాలందుకోవచ్చు. రక్షణాత్మకమైన ఈ రంగ కంపెనీలపై దృష్టి సారించొచ్చు.

* బ్యాంకింగ్‌ షేర్లు ఒత్తిడికి లోనుకావొచ్చు. అమెరికాలో బ్యాంకింగ్‌ సంక్షోభానికి తోడు ఆప్షన్ల విక్రయంపై సెక్యూరిటీ లావాదేవీల పన్ను పెంపు ఇందుకు కారణం కావొచ్చు. బ్యాంక్‌ నిఫ్టీకి 38,500 వద్ద మద్దతు; 40,000 వద్ద నిరోధం కనిపించొచ్చు.

* యంత్ర పరికరాల షేర్లు స్వల్పకాలంలో మరింత స్థిరీకరణకు గురికావొచ్చు. సీమెన్స్‌, ఎల్‌అండ్‌టీ కంపెనీల్లో ‘బులిష్‌’ ధోరణి కనిపించొచ్చు. భెల్‌లో లాభాల స్వీకరణ కనిపిస్తోంది.

* సిమెంటు కంపెనీల షేర్లు రాణించొచ్చు. మౌలిక వసతుల అభివృద్ధి, స్థిరాస్తి విభాగాల్లో అధిక గిరాకీ ఇందుకు దోహదం చేయొచ్చు. ముడి పదార్థాల ధరలు తగ్గడంతో, సిమెంటు ధరలు పెరగకున్నా, కంపెనీల లాభాలు మెరుగుకావొచ్చు.

* పెరుగుతున్న వడ్డీ రేట్లు, కొన్ని కంపెనీల వాహనాల ధరల పెంపు ప్రకటనలు, మార్కెట్‌ పరిస్థితుల కారణంగా వాహన కంపెనీల షేర్లు ఒత్తిడిలో కొనసాగొచ్చు.

* ప్రస్తుత ఊగిసలాటల్లో లోహ షేర్లు ప్రతికూలంగా చలించొచ్చు. టాటా స్టీల్‌లో విక్రయాల ఒత్తిడి కనిపించొచ్చు. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేరు 200 రోజుల చలన సగటు కిందకు చేరడంతో, బలహీనంగా కనిపిస్తోంది.

* రక్షణాత్మక రంగం కావడంతో ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు ప్రస్తుత బేరిష్‌ మార్కెట్‌ నుంచి ప్రయోజనం పొందొచ్చు. వేసవి నేపథ్యంలో వరుణ్‌ బేవరేజెస్‌, రాడికో ఖైతాన్‌, యునైటెడ్‌ బ్రూవరీస్‌ వంటి కంపెనీల అమ్మకాలు పెరగొచ్చన్న అంచనాల మధ్య ఈ కంపెనీలపై ‘బులిష్‌’గా ఉన్నారు.

* సానుకూల వార్తలు లేనందున.. ఎంపిక చేసిన టెలికాం షేర్లలో చలనాలు కనిపించొచ్చు. భారతీ ఎయిర్‌టెల్‌ స్క్రిప్‌నకు రూ.730-750 మధ్య మద్దతు లభించొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు