సంక్షిప్త వార్తలు (7)

భారత్‌లో ఈ ఏడాది 19 కారు మోడళ్లను విడుదల చేయాలని జర్మన్‌ విలాస కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ప్రణాళిక సిద్ధం చేసింది.

Updated : 28 Mar 2023 02:32 IST

బీఎండబ్ల్యూ నుంచి ఈ ఏడాది 19 కార్లు.. 3 బైక్‌లు

దిల్లీ: భారత్‌లో ఈ ఏడాది 19 కారు మోడళ్లను విడుదల చేయాలని జర్మన్‌ విలాస కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో విద్యుత్‌ వాహనాలు కూడా ఉంటాయని, దేశీయంగా రెండంకెల విక్రయాల వృద్ధిపై దృష్టి సారించామని బీఎండబ్ల్యూ గ్రూప్‌ ఇండియా ప్రెసిడెంట్‌ విక్రమ్‌ పావా వెల్లడించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు దేశీయంగా మంచి విక్రయాలు నమోదు చేశామని, ఈ ఏడాది మొత్తం విక్రయాల్లో 15 శాతం విద్యుత్‌ వాహనాలు ఉండేలా చూసుకుంటామని పేర్కొన్నారు. బీఎండబ్ల్యూ మోటోరాడ్‌ వ్యాపారం కింద 3 బైక్‌ మోడళ్లను కూడా పరిచయం చేసే ప్రణాళికలో ఉన్నామని తెలిపారు.


మాల్‌వేర్‌ల వ్యాప్తికి చాట్‌జీపీటీ  దుర్వినియోగం: క్లౌడ్‌సెక్‌

దిల్లీ: హైజాక్‌ చేసిన ఫేస్‌బుక్‌ ఖాతాల ద్వారా మాల్‌వేర్‌లను వ్యాప్తి చేయడానికి సైబర్‌ నేరగాళ్లు చాట్‌జీపీటీ ఆదరణను వినియోగించుకుంటున్నారని సైబర్‌ ఇంటలిజెన్స్‌ సంస్థ క్లౌడ్‌సెక్‌ సోమవారం వెల్లడించింది. ఈ సంస్థ తన పరిశోధనలో భారతీయ కంటెంట్‌ సహా మొత్తం 5 లక్షల ఫాలోవర్స్‌తో ఫేస్‌బుక్‌ ప్రకటనల ద్వారా మాల్‌వేర్‌ను వ్యాప్తి చేయడానికి వినియోగిస్తున్న 13 ఫేస్‌బుక్‌ పేజీలు/ఖాతాలను కనుగొంది. ‘సైబర్‌ నేరగాళ్లు చాట్‌జీపీటీ ఆదరణను ఉపయోగించుకుంటున్నారు. ప్రకటనల ద్వారా మాల్‌వేర్‌ను వ్యాప్తి చేయడానికి చట్టబద్ధమైన ఫేస్‌బుక్‌ ఖాతాలను వినియోగించుకుంటుండడంతో వినియోగదార్ల భద్రత ప్రమాదంలో పడే అవకాశం కనిపిస్తోంది. 5 లక్షల పైచిలుకు ఫాలోవర్లు కలిగిన 13 ఫేస్‌బుక్‌ పేజీలను గుర్తించాం. వీటిలో కొన్ని 2023 ఫిబ్రవరి నుంచి హైజాక్‌ అయ్యాయి. ఇలాంటి హానికరమైన కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలని మేము వినియోగదార్లను కోరుతున్నామ’ని క్లౌడ్‌సెక్‌ సైబర్‌ ఇంటెలిజెన్స్‌ అనలిస్ట్‌ బబ్లూ కుమార్‌ వెల్లడించారు.


ఐఐఎల్‌ ఎంఆర్‌ టీకాకు  డీసీజీఐ అనుమతి

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఇండియన్‌ ఇమ్యునలాజికల్స్‌ లిమిటెడ్‌ (ఐఐఎల్‌) త్వరలో మీజిల్స్‌- రూబెల్లా (ఎంఆర్‌) టీకాను ఆవిష్కరించనుంది. ఈ టీకా ఉత్పత్తికి భారత ఔషధ నియంత్రణ మండలి(డీసీజీఐ) నుంచి అనుమతి లభించినట్లు ఐఐఎల్‌ వెల్లడించింది. వియత్నాం భాగస్వామ్యంతో ఎంఆర్‌ టీకాను ఐఐఎల్‌ అభివృద్ధి చేసింది. దీని కోసం వియత్నాంలోని సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ అండ్‌ ప్రొడక్షన్‌ ఆఫ్‌ వ్యాక్సిన్స్‌ అండ్‌ బయోలాజికల్స్‌ (పాలీవ్యాక్‌) అనే సంస్థతో కలిసి పనిచేసినట్లు ఐఐఎల్‌ పేర్కొంది. తట్టు (మీజిల్స్‌) వ్యాధి సోకితే న్యూమోనియా, మూర్ఛ రావడంతో పాటు మెదడు కూడా దెబ్బతింటుంది. వైరస్‌ వల్ల సోకే ఈ వ్యాధి మనుషుల్లో ఒకరి నుంచి మరొకరికి త్వరగా సోకుతుంది. మన దేశంలో ఏటా 50,000 మందికి పైగా పిల్లలు మీజిల్స్‌ వ్యాధితో చనిపోతున్నారు. దీనికి టీకానే సరైన మందు. ఈ వ్యాధిని నిరోధించటానికి ఎంఎంఆర్‌(మీజిల్స్‌, మంప్స్‌, రూబెల్లా) టీకాతో పాటు ఎంఆర్‌ టీకాను వినియోగిస్తున్నారు. ఎంఆర్‌ టీకాను ఉత్పత్తి చేయడం కోసం మీజిల్స్‌ టీకా పదార్థాలను వియత్నాంలోని పాలీవ్యాక్‌ నుంచి ఐఐఎల్‌ సేకరిస్తుంది. రూబెల్లా టీకా పదార్థాలను సొంతంగా ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండింటినీ కలిపి ఎంఆర్‌ టీకాను ఆవిష్కరించనున్నట్లు ఐఐఎల్‌ వెల్లడించింది. ఎంఆర్‌ టీకాపై అన్ని దశల క్లినికల్‌ పరీక్షలను విజయవంతంగా పూర్తిచేసినట్లు ఐఐఎల్‌ ఎండీ డాక్టర్‌ కె.ఆనంద్‌ కుమార్‌ తెలిపారు. మన దేశంలో సార్వత్రిక టీకాల కార్యక్రమానికి ఎంఆర్‌ టీకాను అందిస్తామని వివరించారు.


రూ.198కే జియో బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌

దిల్లీ: ఫిక్స్‌డ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ విభాగంలో ధరల పోటీకి జియో తెరలేపింది. ప్రారంభ స్థాయిలో కనిష్ఠంగా నెలకు రూ.198 ప్లాన్‌ను ప్రకటించింది. బ్రాడ్‌బ్యాండ్‌ బ్యాకప్‌ ప్లాన్‌ పేరిట తీసుకొచ్చిన ఈ పథకంలో సెకనుకు 10 ఎంబీ ఇంటర్నెట్‌ వేగాన్ని అందిస్తోంది. ఇంతకుముందు జియో ఫైబర్‌ కనెక్షన్‌ పొందేందుకు నెలకు కనీసం రూ.399 చెల్లించాల్సి ఉండేది. ఈ పథకాన్ని అప్‌గ్రేడ్‌ చేసుకునే సౌలభ్యాన్ని కూడా జియో కల్పిస్తోంది. ఇందుకు 1 నుంచి 7 రోజులకు 30-100 ఎంబీపీఎస్‌ వేగాన్ని పొందేందుకు అదనంగా రూ.21-152 చెల్లించాల్సి ఉంటుంది. 5 నెలల వినియోగం, ఇన్‌స్టాలేషన్‌ ఛార్జీల కింద సేవలు పొందేందుకు కొత్త వినియోగదారులు రూ.1490 చెల్లించాలి.


‘ఆహా’ విస్తరణ బాట
వచ్చే మూడేళ్లలో రూ.1,000 కోట్ల పెట్టుబడి

ఈనాడు, హైదరాబాద్‌: ప్రాంతీయ భాషల ఓటీటీ (ఓవర్‌ ద టాప్‌) ప్లాట్‌ఫామ్‌ అయిన ‘ఆహా’.. ఇతర ప్రాంతీయ భాషల్లోకి, కొత్త వినోద విభాగాల్లోకి విస్తరించే సన్నాహాల్లో నిమగ్నమైంది. ఈ విస్తరణ కోసం వచ్చే మూడేళ్లలో రూ.1,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనుంది. దీనికి అనుగుణంగా నాయకత్వ స్థానాల్లో కొన్ని మార్పులు, చేర్పులు చేసినట్లు ‘ఆహా’ ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం సీఈఓగా ఉన్న అజిత్‌ ఠాకూర్‌ను బోర్డు డైరెక్టర్‌గా నియమించారు. ఆయన ఖాళీ చేసిన స్థానంలో కొత్త సీఈఓగా రవికాంత్‌ సబ్నవిస్‌ను ఎంపిక చేశారు. ఈ నాయకత్వ మార్పులతో మలిదశ వృద్ధిని వేగంగా అందుకోగలమనే ఆశాభావాన్ని ఆహా ప్రమోటర్‌ రాము రావు జూపల్లి వెలిబుచ్చారు. వినోదం, సేవల రంగాల్లో రవికాంత్‌ సబ్నవిస్‌కు మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్నట్లు వివరించారు. 


 లాయిడ్‌ గ్రాండే హెవీడ్యూటీ ఏసీకి మహేష్‌ బాబు, తమన్నా ప్రచారం

ఈనాడు, హైదరాబాద్‌: హావెల్స్‌ ఇండియాకు చెందిన లాయిడ్‌ గ్రాండే హెవీడ్యూటీ ఏసీకి ప్రచారం కోసం రూపొందించిన ప్రచార చిత్రంలో మహేష్‌బాబు, తమన్నా నటించారు. దక్షిణాది రాష్ట్రాల్లో తమ బ్రాండ్లకు ఆదరణ పెరగటానికి, ముఖ్యంగా లాయిడ్‌ ఏసీల అమ్మకాలు పెంచుకునేందుకు ఈ  ప్రచారం దోహదపడుతుందని భావిస్తున్నట్లు లాయిడ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉపాధ్యక్షుడు అలోక్‌ టిక్కూ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లాయిడ్‌ గ్రాండే హెవీడ్యూటీ ఏసీ ప్రచార కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహించనున్నుట్లు హావెల్స్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ ఉపాధ్యక్షుడు రోహిత్‌ కపూర్‌ వివరించారు. హావెల్స్‌ ఇండియా, హావెల్స్‌, లాయిడ్‌, క్రాబ్‌ట్రీ, స్టాండర్డ్‌, రియో... తదితర బ్రాండ్లతో పలు రకాలైన వినియోగ వస్తువులను అందిస్తోంది.


సంక్షిప్తంగా

* 2017-18 ఆర్థిక సంవత్సరంలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) కోరకపోయినా, రూ.8,800 కోట్ల నిధులను రీకేపిటలైజేషన్‌ కోసం ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్‌ఎస్‌) అందించిందని పార్లమెంట్‌కు కాగ్‌ తాజాగా అందించిన నివేదికలో వెల్లడించింది.

* దేశీయ, అంతర్జాతీయ విపణుల్లో విద్యుత్‌ ట్రాన్స్‌మిషన్‌, డిస్ట్రిబ్యూషన్‌ వ్యాపారంలో పెద్ద ఆర్డర్లు దక్కించుకున్నట్లు ఎల్‌ అండ్‌ టీ సోమవారం వెల్లడించింది.

* దేశంలో తొలి క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ ఆధారిత టెలికాం నెట్‌వర్క్‌ లింక్‌.. ప్రస్తుతం దేశ రాజధాని దిల్లీలోని సంచార్‌ భవన్‌-నేషనల్‌ ఇన్‌ఫర్మాటిక్స్‌ కేంద్రం మధ్య అందుబాటులోకి వచ్చిందని తొలి అంతర్జాతీయ క్వాంటమ్‌ ఎన్‌క్లేవ్‌లో పాల్గొన్న టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు.

* తమ డయాబెటిస్‌ ఔషధం సోలిక్వా మార్కెటింగ్‌కు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీఓ) నుంచి అనుమతి లభించిందని సనోఫి ఇండియా తెలిపింది.

* వచ్చే రెండేళ్లలో 50,000 విద్యుత్‌ ద్విచక్ర వాహనాలను అందించేందుకు జొమాటోతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సన్‌ మొబిలిటీ వెల్లడించింది.

* అదానీ గ్రూప్‌ కంపెనీల అవకతవకలపై హిండెన్‌బర్గ్‌ విడుదల చేసిన నివేదికను సుప్రీం కోర్టు సీజ్‌ చేసిందని, అలాగే దీన్ని పరిశీలించేందుకు ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిందని కార్పొరేట్‌ వ్యవహారాల సహాయ మంత్రి రావు ఇంద్రజిత్‌ సింగ్‌ లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

* ఎఫ్‌ఎంసీజీ బ్రాండ్స్‌ మామాఎర్త్‌, ద డెర్మా కంపెనీలను నిర్వహిస్తున్న హొనసా కన్జూమర్‌ లిమిటెడ్‌ ఐపీఓ మరింత ఆలస్యం కానుంది. తమ ప్రాథమిక ముసాయిదా పత్రాలపై సెబీతో చర్చిస్తున్నామని, అక్కడ నుంచి అనుమతి వచ్చిన 12 నెలల్లోపు ఐపీఓకు రానున్నట్లు మామాఎర్త్‌ సీఈఓ, సహ వ్యవహస్థాపకులు వరుణ్‌ వెల్లడించారు.

* ఈ ఆర్థిక సంవత్సరంలో దీర్ఘకాలం ఎండలు ఉండటంతో, సౌర విద్యుత్‌ ఉత్పత్తి సంస్థల పని తీరు 75 శాతానికి మెరుగైందని రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ నివేదిక వెల్లడించింది. క్రితం ఆర్థిక సంవత్సరం వీటి పని తీరు 59 శాతమే నమోదైనట్లు పేర్కొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు