ఫస్ట్‌ సిటిజన్స్‌ చేతికి సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌

సంక్షోభంలో చిక్కుకున్న సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌(ఎస్‌వీబీ)ను నార్త్‌ కరోలినా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఫస్ట్‌ సిటిజన్స్‌ కొనుగోలు చేసింది.

Updated : 28 Mar 2023 07:09 IST

న్యూయార్క్‌: సంక్షోభంలో చిక్కుకున్న సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌(ఎస్‌వీబీ)ను నార్త్‌ కరోలినా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఫస్ట్‌ సిటిజన్స్‌ కొనుగోలు చేసింది. అమెరికాలో దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన ఎస్‌వీబీ.. ఈ నెల ప్రారంభంలో కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ పరిణామం ఆ దేశ బ్యాంకింగ్‌ వ్యవస్థను కుదిపేయడమే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా మదుపర్లను కలవరపాటుకు గురిచేసింది. దీంతో మదుపర్లలో విశ్వాసాన్ని, డిపాజిటుదార్లలో భరోసాను నింపేందుకు ఫెడరల్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ కార్ప్‌(ఎఫ్‌డీఐసీ) సహా ఇతర నియంత్రణ సంస్థలు రంగంలోకి దిగి పలు చర్యలు చేపట్టాయి. ప్రతిపాదిత కొనుగోలు అనంతరం... ఎస్‌వీబీ వినియోగదార్లు ఫస్ట్‌ సిటిజన్స్‌ వినియోగదార్లుగా అవుతారు. సోమవారం నుంచి ఎస్‌వీబీకి చెందిన 17 శాఖలు.. ఫస్ట్‌ సిటిజన్స్‌ శాఖలుగా కార్యకలాపాలు నిర్వహిస్తాయని ఎఫ్‌డీఐసీ తెలిపింది. ఎస్‌వీబీకి చెందిన డిపాజిట్లు, రుణాలన్నీ ఫస్ట్‌ సిటిజన్స్‌ బ్యాంక్‌ అండ్‌ ట్రస్ట్‌ కంపెనీకి బదిలీ అవుతాయని పేర్కొంది. అలాగే ఫస్ట్‌ సిటిజన్స్‌లో 500 మి.డాలర్ల విలువైన షేర్లు ఎఫ్‌డీఐసీకి వస్తాయి. నష్టాలను ఎఫ్‌డీఐసీ, ఫస్ట్‌ సిటిజన్స్‌ పంచుకుంటాయి. ఫస్ట్‌ సిటిజన్స్‌ బ్యాంక్‌ 1898లో ఏర్పాటైంది. అమెరికాలో 21 రాష్ట్రాల్లో 500 శాఖలు ఉన్నాయి. ఈ బ్యాంకు నిర్వహణలో మొత్తంగా 100 బిలియన్‌ డాలర్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. గత త్రైమాసికంలో 243 మిలియన్‌ డాలర్ల నికర లాభాన్ని ప్రకటించింది. అమెరికాల్లో దిగ్గజ 20 బ్యాంకుల్లో ఫస్ట్‌ సిటిజన్స్‌ బ్యాంకు ఒకటి.

భారత అంకురాలపై ప్రభావం లేదు: వైష్ణవ్‌

సిలికాన్‌ వ్యాలీ బ్యాంకు పతనం అనంతరం.. భారత అంకురాలకు సహకారం అందించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టిందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ఈ ‘చిన్న సంక్షోభం’ వల్ల వాటిపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడలేదని పేర్కొన్నారు. భారత బ్యాంకింగ్‌ రంగాన్ని విశ్వసనీయ భాగస్వామిగా అంకుర వ్యవస్థ భావించాలని వివరించారు. కృత్రిమ మేధ, క్యాంటమ్‌ కంప్యూటింగ్‌ విభాగంలో భారత వేగంగా పురోగమిస్తోందని ఇండియా గ్లోబల్‌ ఫోరమ్‌ కార్యక్రమంలో మాట్లాడుతూ వైష్ణవ్‌ తెలిపారు. ఈ రెండు సాంకేతికతల్లో భారత్‌ కోసం, ప్రపంచం కోసం సొల్యూషన్లను అభివృద్ధి చేసేందుకు భారత నైపుణ్యాన్ని ఉపయోగించుకుంటామని పేర్కొన్నారు. చాట్‌జీపీటీ తరహాలో భారత్‌ ఏదైనా అభివృద్ధి చేయనుందా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘కొన్ని వారాలు ఆగండి. త్వరలోనే కీలక ప్రకటన వెలువడుతుంద’ని మంత్రి తెలిపారు. భారత్‌ లాంటి విశ్వసనీయ భాగస్వామి ఉండటం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.


సౌదీ నేషనల్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌ రాజీనామా

దుబాయ్‌: సౌదీ నేషనల్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌ అమ్మర్‌ అల్‌ కుదైరీ.. వ్యక్తిగత కారణాల రీత్యా తన పదవికి రాజీనామా చేశారు. అయితే క్రెడిట్‌ సూయిజీపై చేసిన ఆయన వ్యాఖ్యల నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. క్రెడిట్‌ సూయిజీలో అతిపెద్ద వాటాదారుగా సౌదీ నేషనల్‌ బ్యాంకు ఉంది. అయితే క్రెడిట్‌ సూయిజీకి పెట్టుబడుల సహకారాన్ని ఆపేస్తామంటూ మార్చి 15న అల్‌ కుదైరీ ప్రకటించడంతో.. క్రెడిట్‌ సూయిజీ షేర్లు 30 శాతానికి పైగా పతనమయ్యాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు