బీమా ఏజెంట్ల కమీషన్‌పై పరిమితి తొలగింపు

బీమా కంపెనీలు తమ ఏజెంట్లకు చెల్లించే కమీషన్‌పై పరిమితిని భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) తొలగించింది. బీమా అగ్రిగేటర్లు, బ్రోకర్లకూ ఇది వర్తిస్తుంది.

Published : 29 Mar 2023 02:53 IST

అగ్రిగేటర్లు, బ్రోకర్లకూ వర్తింపు
అమల్లోకి రానున్న ‘మొత్తం వ్యయాల పరిమితి’ విధానం
నోటిఫికేషన్‌ జారీ చేసిన ఐఆర్‌డీఏఐ

ఈనాడు, హైదరాబాద్‌: బీమా కంపెనీలు తమ ఏజెంట్లకు చెల్లించే కమీషన్‌పై పరిమితిని భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) తొలగించింది. బీమా అగ్రిగేటర్లు, బ్రోకర్లకూ ఇది వర్తిస్తుంది. అదే సమయంలో బీమా కంపెనీల మొత్తం వ్యయాలపై పరిమితిని విధించింది. ఈ మేరకు తాజాగా ఒక నోటిఫికేషన్‌ను నియంత్రణ సంస్థ జారీ చేసింది. పాలసీదార్లు, ఏజెంట్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని బీమా కంపెనీల నూతన కమీషన్ల విధానాన్ని నిర్దేశించుకోవాలని అందులో పేర్కొంది. కమీషన్ల చెల్లింపు, బీమా కంపెనీల మొత్తం వ్యయాల పరిమితికి లోబడి ఉండాలని స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధనలు వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. ఈ నిబంధనలను ప్రతి మూడేళ్లకోసారి సమీక్షించనున్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకూ ఒక్కో బీమా పాలసీ విషయంలో ఏజెంట్లకు చెల్లించే కమీషన్లకు ఐఆర్‌డీఏఐ అనుమతి ఇస్తూ వస్తున్న విషయం విదితమే.

పాలసీదార్లకు మేలు జరుగుతుందా?:  కొత్త నిబంధనలకు సంబంధించి ఐఆర్‌డీఏఐ జారీ చేసిన ముసాయిదా ప్రకారం సాధారణ బీమా కంపెనీలు చెల్లించే కమీషన్‌పై 20 శాతం పరిమితి ఉంది. అంతకు ముందు ఈ పరిమితి 30- 35 శాతం కావటం గమనార్హం. బీమా కంపెనీల వ్యయాలు 70 శాతం కంటే తక్కువ ఉన్న పక్షంలో, ఆ కంపెనీలు తమ కమీషన్‌ రేట్లను సొంతంగా నిర్ణయించుకోవచ్చు. కానీ వ్యయాలు 70 శాతం కంటే ఎక్కువ ఉన్న బీమా కంపెనీలు మాత్రం పాలసీ  ప్రీమియం మొత్తాల్లో 2  నుంచి 20 శాతం వరకూ కమీషన్‌ చెల్లించటానికి వీలుంది. ప్రస్తుతం అధిక వ్యయాలు మోస్తున్న బీమా కంపెనీలు, ఈ మార్పుల వల్ల గ్యారెంటీడ్‌ బీమా పాలసీలపై కమీషన్లు తగ్గించాల్సి వస్తుంది. అదే సమయంలో ఎస్‌బీఐ లైఫ్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ వంటి పెద్ద కంపెనీల వ్యయాలు 70 శాతం కంటే తక్కువ ఉన్నందున, ఆ సంస్థలు ఏజెంట్లకు చెల్లించే కమీషన్లను సొంతంగా నిర్ణయించుకోవచ్చు. చిన్న బీమా కంపెనీలకు ఇటువంటి వెసులుబాటు ఉండదు. అదే సమయంలో కమీషన్లు తగ్గితే పాలసీదార్లకు బాగా మేలు జరుగుతుందని చెప్పలేమని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.

ప్రీమియం మొత్తాలు తగ్గుతాయా?

ఏది ఏదేమైనప్పటికీ ప్రస్తుత మార్పుల వల్ల బీమా కంపెనీలు తమ వ్యయాల విషయంలో విచక్షణను పాటించే అవకాశం ఏర్పడింది. అధిక లాభాలు ఆర్జించటం కోసం కొన్ని చోట్ల వ్యయాలు తగ్గించుకొని, మరికొన్ని చోట్ల వ్యయాలు పెంచుకునేందుకు వీలు కలుగుతుంది. ఇది పరిశ్రమకు ఎంతో మేలు చేసే నిర్ణయమని శ్రీరామ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ, సీఈఓ అనిల్‌ కుమార్‌ అగర్వాల్‌ అన్నారు. ఏజెంట్లకు కమీషన్‌ చెల్లింపుపై పరిమితి ఎత్తివేయటం వల్ల పరిశ్రమకు ఎంతో మేలు జరుగుతుందని విశ్లేషించారు. అంతేగాక వినూత్నమైన బీమా పాలసీలు ఆవిష్కరించే వీలు కలుగుతుందని, మార్కెటింగ్‌-పంపిణీ విషయాల్లో కొత్తదనాన్ని తీసుకురావచ్చని అన్నారు. ప్రధానంగా వినియోగదారుడిని దృష్టిలో పెట్టుకొని బీమా పాలసీలను రూపొందించే అవకాశం ఉంటుందన్నారు. ఎక్కువ మంది ప్రజలకు బీమా సదుపాయాలు దగ్గరయ్యేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని వివరించారు. ఐఆర్‌డీఏఐ సరైన నిర్ణయం తీసుకున్నట్లు బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఎండీ తపన్‌ సింఘేల్‌ వివరించారు. పాలసీ స్థాయిలో కమీషన్లు చెల్లించటం కాకుండా, కంపెనీ మొత్తానికి వ్యయాల పరిమితిని నిర్దేశించటం బీమా కంపెనీలకు మేలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. అంతేగాక బీమా కంపెనీల్లో వ్యయ క్రమశిక్షణను ఈ నిర్ణయం తీసుకువస్తుందని అన్నారు. తత్ఫలితంగా సమీప భవిష్యత్తులో బీమా పాలసీల ప్రీమియం మొత్తాలు తగ్గే అవకాశం ఉంటుందని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని