జూన్‌ 30 పాన్‌-ఆధార్‌ అనుసంధానానికి.. సెప్టెంబరు 30 ఫండ్స్‌, డీమ్యాట్‌ నామినీకి గడువు పెంపు

ఆధార్‌తో పాన్‌ అనుసంధానానికి గడువును మరో మూడు నెలల పాటు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటివరకూ పాన్‌-ఆధార్‌ అనుసంధానం చేసుకోని వారు జూన్‌ 30లోపు ఈ ప్రక్రియను పూర్తి చేసుకునేందుకు అవకాశం లభించింది.

Updated : 29 Mar 2023 04:09 IST

 

ఈనాడు, హైదరాబాద్‌: ఆధార్‌తో పాన్‌ అనుసంధానానికి గడువును మరో మూడు నెలల పాటు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటివరకూ పాన్‌-ఆధార్‌ అనుసంధానం చేసుకోని వారు జూన్‌ 30లోపు ఈ ప్రక్రియను పూర్తి చేసుకునేందుకు అవకాశం లభించింది. పన్ను చెల్లింపుదారులకు మరింత సమయం ఇచ్చే ఉద్దేశంతో గడువును పెంచినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) ఒక ప్రకటనలో తెలిపింది. ఆదాయపు పన్ను చట్టం-1961 చట్టం ప్రకారం జులై 1, 2017కన్నా ముందు పాన్‌ తీసుకున్న ప్రతి ఒక్కరూ దాన్ని ఆధార్‌తో అనుసంధానం చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ గడువు మార్చి 31 వరకూ ఉండగా, తాజాగా దీన్ని పొడిగిస్తూ సీబీడీటీ నిర్ణయం తీసుకుంది. దీనికోసం రూ.1,000 రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్‌తో జత చేయని పాన్‌ జులై 1 నుంచి చెల్లకుండా పోతుంది. ఒకసారి పాన్‌ నిరుపయోగంగా మారితే.. టీడీఎస్‌, డీసీఎస్‌లు అధిక శాతం వసూలు చేస్తారు. బ్యాంకు ఖాతాలు, డీమ్యాట్‌ ఖాతాలు ప్రారంభించేందుకూ ఇబ్బంది వస్తుంది. పెట్టుబడులు పెట్టేందుకూ నిబంధనలు అడ్డు వస్తాయి. ఇప్పటికే 51 కోట్లకు పైగా పాన్‌లు ఆధార్‌తో అనుసంధానమైనట్లు సీబీడీటీ వెల్లడించింది.

వీటికి సైతం..: మ్యూచువల్‌ ఫండ్ల పెట్టుబడులకు నామినీని పేర్కొనేందుకు సెప్టెంబరు 30 వరకూ గడువును పెంచుతున్నట్లు మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ ప్రకటించింది. దీంతో పాటు ట్రేడింగ్‌, డీమ్యాట్‌ ఖాతాలకూ నామినీని పేర్కొనేందుకూ ఇదే గడువు వర్తిస్తుందని తెలిపింది. ఇప్పటి వరకూ ఇచ్చిన గడువు ప్రకారం మార్చి 31 నాటికి నామినీ పేరు తెలియజేయకపోతే పెట్టుబడి ఖాతాలను స్తంభింపచేస్తామని సెబీ పేర్కొంది. పెట్టుబడిదారులు, ఇతర వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ గడువును పొడిగించినట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. స్టాక్‌ బ్రోకర్లు, డిపాజిటరీ పార్టిసిపెంట్లు, మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు, ఆర్‌టీఏలు తమ ఖాతాదారులు నామినీ పేరును పేర్కొనేలా ప్రోత్సహించాలని ఈ సందర్భంగా సూచించింది. ఇ-మెయిల్‌, ఎస్‌ఎంఎస్‌ తదితరాల ద్వారా సందేశాలను పంపించాల్సిందిగా కోరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని