సంక్షిప్త వార్తలు (5)

యునిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ)తో చేసే మర్చంట్‌ లావాదేవీలపై ఏప్రిల్‌ 1 నుంచి అదనపు ఛార్జీలను విధించాలని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) సిఫారసు చేసింది.

Updated : 29 Mar 2023 04:08 IST

యూపీఐతో మర్చంట్‌ లావాదేవీలపై అదనపు ఛార్జీలు!

దిల్లీ: యునిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ)తో చేసే మర్చంట్‌ లావాదేవీలపై ఏప్రిల్‌ 1 నుంచి అదనపు ఛార్జీలను విధించాలని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) సిఫారసు చేసింది. ఈ ఏడాది సెప్టెంబరు 30న లేదా అంతకంటే ముందే వీటిపై సమీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. ఎన్‌పీసీఐ సర్క్యులర్‌ ప్రకారం..రూ.2,000కు పైబడిన లావాదేవీ విలువలో  1.1 శాతం మేర ఇంటర్‌ఛేంజ్‌ ఛార్జీని వసూలు చేయాలని సూచించింది. అదనపు ఛార్జీలు అమల్లోకి వస్తే, వాలెట్‌ లోడింగ్‌కు సేవా ఛార్జీని బ్యాంక్‌కు చెల్లించాల్సి ఉంటుంది. పీ2పీ, పీ2పీఎం లావాదేవీలకు బ్యాంక్‌ ఖాతా, పీపీఐ వాలెట్‌కు ఎటువంటి ఛార్జీలు ఉండవు.


నాసిరకం ఔషధాల తయారీపై కొరడా

18 ఔషధ సంస్థల లైసెన్సులు రద్దు

దిల్లీ: నాసిరకం ఔషధాలు తయారు చేస్తున్న 18 ఔషధ సంస్థలపై వేటు వేసినట్లు అధికారిక వర్గాలు మంగళవారం వెల్లడించాయి. కేంద్ర, రాష్ట్ర నియంత్రణ సంస్థలు 76 ఫార్మా కంపెనీలను తనిఖీ చేసి అందులో నాసిరకం ఔషధాలను తయారీ చేస్తున్న సంస్థలపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. గత 15 రోజులుగా 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ తనిఖీలు నిర్వహించారు. 18 సంస్థల లైసెన్సులు రద్దు చేయడంతో పాటు మరో 26 సంస్థలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.


సౌర విద్యుత్‌ పీఎల్‌ఐ పథకానికి రిలయన్స్‌ ఎంపిక

దిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇండోసోల్‌, ఫస్ట్‌ సోలార్‌ వంటి 11 కంపెనీల సౌర ఫొటోవోల్టాయిక్‌ తయారీ ప్రాజెక్టులు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం రెండో దశ కింద ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు పొందనున్నాయి. ఈ ప్రాజెక్టులు మొత్తం 39,600 మెగావాట్ల సామర్థ్యంతో రానున్నాయి. 2024 అక్టోబరు నాటికి 7,400 మెగావాట్లు, 2025 ఏప్రిల్‌ నాటికి 16,800 మెగావాట్లు, 2026 ఏప్రిల్‌ నాటికి మిగిలిన 15,400 మెగావాట్ల సామర్థ్యాన్ని ఈ కంపెనీలు అందుకుంటాయని కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రెండో దశ పీఎల్‌ఐ కింద రూ.93,041 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ ప్రాజెక్టుల ద్వారా 1,01,487 ఉద్యోగాలు లభిస్తాయి. ఇందులో 35,010 మందికి నేరుగా, 66,477 మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది.


వేదాంతా అయిదో మధ్యంతర డివిడెండు రూ.20.50

రికార్డు తేదీ ఏప్రిల్‌ 7

దిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరానికి (2022-23) రూ.7,621 కోట్ల మధ్యంతర డివిడెండు చెల్లింపునకు బోర్డు ఆమోదం తెలిపిందని వేదాంతా మంగళవారం వెల్లడించింది. ఏప్రిల్‌ 7వ తేదీని డివిడెండు చెల్లింపునకు రికార్డు తేదీగా నిర్ణయించింది. రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.20.50 చొప్పున అయిదో మధ్యంతర డివిడెండు చెల్లింపునకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపిందని వేదాంతా ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చింది. తాత్కాలిక ముఖ్య ఆర్థిక అధికారి (సీఎఫ్‌ఓ)గా ఉన్న అజయ్‌ గోయెల్‌ రాజీనామాను బోర్డు ఆమోదించింది. ఏప్రిల్‌ 9 కార్యాలయ పని వేళలు ముగిసిన తర్వాత నుంచి ఇది అమల్లోకి రానుంది. తర్వాత సీఎఫ్‌ఓ ఎవరనేది ఆలోపు వెల్లడిస్తామని వేదాంతా పేర్కొంది.


* ఇండోనేషియాలో సరికొత్త నికెల్‌ పిగ్‌ ఐరన్‌(ఎన్‌పీఐ) స్మెల్టర్‌ ప్లాంటను ఏర్పాటు చేయడం కోసం జిందాల్‌ స్టెయిన్‌లెస్‌ రూ.1300 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.

* మిర్రర్‌ గ్లాస్‌ లోపాల కారణంగా 3,30,000కు పైగా వాహనాలను వెనక్కి పిలిపిస్తున్నట్లు హోండా ప్రకటించింది.

* టెస్లా సీట్‌ బెల్ట్‌లు వదులుగా ఉండటంపై అమెరికా హైవే భద్రతా నియంత్రణ సంస్థలు దర్యాప్తు ప్రారంభించాయి.

* 2023 అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిలో సగం వాటా భారత్‌, చైనాలదేనని బావో ఫోరం ఫర్‌ ఆసియా (బీఎఫ్‌ఏ) నివేదిక పేర్కొంది. 4.5 శాతం జీడీపీ వృద్ధితో ఆసియా కీలకంగా మారనుందని, అంతర్జాతీయ మందగమనం నేపథ్యంలో అత్యుత్తమంగా రాణించొచ్చని అంచనా వేసింది.

* ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ మర్చండైజ్‌, సేవల ఎగుమతులు 760 బిలియన్‌ డాలర్లను అధిగమించే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూశ్‌  గోయల్‌ పేర్కొన్నారు. 2021-22లో ఎగుమతులు 500 బి.డాలర్ల నుంచి 676 బి.డాలర్లకు వృద్ధి చెందాయి.

* దేశవ్యాప్తంగా 7,432 ఫాస్ట్‌ ఛార్జింగ్‌ స్టేషన్‌లను ఏర్పాటు చేసేందుకు మూడు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్‌ కంపెనీలకు ఫేమ్‌ ఇండియా పథకం రెండో దశ కింద కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ రూ.800 కోట్లు మంజూరు చేసింది.

* ప్రమోటర్‌ షేర్ల తనఖా గణాంకాలను త్రైమాసికం చివరకు స్టాక్‌ ఎక్స్ఛేంజీలు అప్‌డేట్‌ చేస్తాయని అదానీ గ్రూప్‌ సీఎఫ్‌ఓ జుగేషిందర్‌ రాబీ సింగ్‌ తెలిపారు. షేర్ల మీద తీసుకున్న 2.15 బిలియన్‌ డాలర్ల రుణాలను తిరిగి చెల్లించినట్లు గ్రూప్‌ ప్రకటించినా గణాంకాలు సరిపోలడం లేదన్న ఆరోపణలపై ఆయన స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు