గత ఐదేళ్లలో రూ.1.03 లక్షల కోట్ల రైటాఫ్‌ రుణాలు వసూలు

2022 మార్చితో ముగిసిన గత ఐదేళ్ల కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.1.03 లక్షల కోట్ల మేర రైటాప్‌ (సాంకేతికంగా రద్దు) రుణాలను వసూలు చేశాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

Updated : 29 Mar 2023 15:16 IST

రాజ్యసభలో మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడి

దిల్లీ: 2022 మార్చితో ముగిసిన గత ఐదేళ్ల కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.1.03 లక్షల కోట్లు మేర రైటాప్‌ (సాంకేతికంగా రద్దు) రుణాలను వసూలు చేశాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. మొత్తం రైటాఫ్‌ చేసిన రూ.7.34 లక్షల కోట్ల రుణాల్లో ఈ విలువ 14 శాతమని రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు. ఈ వసూలు అనంతరం నికరంగా రైటాఫ్‌ రుణాల విలువ రూ.6.31 లక్షల కోట్ల పరిమితమైందని పేర్కొన్నారు. నికర నిరర్థక ఆస్తులకు నాలుగేళ్లు పూర్తయ్యాక.. వాటికి పూర్తిగా కేటాయింపులు జరిపి ఆర్‌బీఐ మార్గదర్శకాలు, బ్యాంకుల బోర్డుల ఆమోదం మేర రైటాఫ్‌ పేరుతో ఆ రుణాలను బ్యాలెన్స్‌ షీట్‌ల నుంచి బ్యాంకులు తొలగిస్తాయని మరో ప్రశ్నకు సమాధానంగా మంత్రి తెలిపారు. బ్యాలెన్స్‌ షీట్లను ఎప్పటికప్పుడు పటిష్ఠం చేసుకునే ప్రక్రియలో భాగంగా రైటాఫ్‌ రుణాల ప్రభావాన్ని బ్యాంకులు మదింపు చేస్తుంటాయని పేర్కొన్నారు. అయితే రైటాఫ్‌ చేసినంత మాత్రాన.. రుణ గ్రహీతలకు ఆ రుణ బకాయిలు చెల్లించకుండా మినహాయింపు ఇచ్చినట్లు కాదని తెలిపారు. రైటాఫ్‌ చేసిన రుణ బకాయిలను రుణ గ్రహీతల నుంచి వసూలు చేసేందుకు వివిధ పద్ధతుల్లో బ్యాంకులు ప్రయత్నిస్తూనే ఉంటాయని తెలిపారు. ఇందుకోసం సివిల్‌ కోర్టులో కేసులు వేయడం, రుణాల వసూళ్ల ట్రైబ్యునళ్లను ఆశ్రయించడం, సెక్యూరిటైజేషన్‌ అండ్‌ రీకన్‌స్ట్రక్షన్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ అసెట్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫ్‌ సెక్యూరిటీ ఇంట్రస్ట్‌ యాక్ట్‌- 2002 కింద చర్యలు చేపట్టడం లాంటివి బ్యాంకులు చేస్తుంటాయని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని