యూపీఐ లావాదేవీలపై ఛార్జీల్లేవు: ఎన్‌పీసీఐ

బ్యాంక్‌ ఖాతా నుంచి బ్యాంక్‌ ఖాతాకు చేసే యూపీఐ చెల్లింపులు లేదా సాధారణ యూపీఐ చెల్లింపులపై ఎటువంటి ఛార్జీలు విధించలేదని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) స్పష్టం చేసింది.

Published : 30 Mar 2023 01:50 IST

దిల్లీ: బ్యాంక్‌ ఖాతా నుంచి బ్యాంక్‌ ఖాతాకు చేసే యూపీఐ చెల్లింపులు లేదా సాధారణ యూపీఐ చెల్లింపులపై ఎటువంటి ఛార్జీలు విధించలేదని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) స్పష్టం చేసింది. ప్రీపెయిడ్‌ పేమెంట్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ (పీపీఐ) మర్చంట్‌ లావాదేవీలపైన మాత్రమే ఇంటర్‌ఛేంజ్‌ ఛార్జీలు ఉంటాయని, వినియోగదారులపై ఎటువంటి ఛార్జీలు ఉండవని వెల్లడించింది. గూగుల్‌ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్‌ లావాదేవీలపై సర్‌ఛార్జ్‌ చెల్లించాలన్న వార్తల నేపథ్యంలో ఎన్‌పీసీఐ వివరణ ఇచ్చింది. పీపీఐ వినియోగించి రూ.2000 పైబడిన యూపీఐ లావాదేవీ విలువలో 1.1 శాతం ఇంటర్‌ఛేంజ్‌ ఛార్జీని వసూలు చేసుకునేందుకు ఎన్‌పీసీఐ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. సెప్టెంబర్‌ 30న లేదా అంతకంటే ముందు ఈ ఛార్జీపై సమీక్షిస్తామని పేర్కొంది. ఏదైనా బ్యాంక్‌ ఖాతా, రూపే క్రెడిట్‌ కార్డు, యూపీఐ కలిగిన యాప్‌లపై ప్రీపెయిడ్‌ వాలెట్లను ఎంచుకునే సౌలభ్యం వినియోగదారులకు ఉన్నట్లు ఎన్‌పీసీఐ తెలిపింది. నీ పేటీఎం కూడా ఇదే తరహా ప్రకటన చేసింది. బ్యాంకు ఖాతా ద్వారా లేదా పేటీఎం వాలెట్‌ ద్వారా డబ్బు పంపినా.. ఎలాంటి ఛార్జీ ఉండదని తేల్చిచెప్పింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని