సూచీలకు కొనుగోళ్ల కళ

సానుకూల అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ మదుపర్ల కొనుగోళ్ల అండతో సూచీలు రాణించాయి. మార్చి డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు ముగింపు నేపథ్యంలో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి.

Published : 30 Mar 2023 01:53 IST

సమీక్ష

సానుకూల అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ మదుపర్ల కొనుగోళ్ల అండతో సూచీలు రాణించాయి. మార్చి డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు ముగింపు నేపథ్యంలో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 15 పైసలు తగ్గి 82.31 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 78.95 డాలర్లకు చేరింది. ఆసియా మార్కెట్లలో షాంఘై మినహా మిగతావి లాభపడ్డాయి. ఐరోపా సూచీలు మెరుగ్గా ట్రేడయ్యాయి.

సెన్సెక్స్‌ ఉదయం 57,572.08 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. అనంతరం ఒడుదొడుకుల మధ్య కదలాడిన సూచీ.. ఆఖరి గంటన్నర ట్రేడింగ్‌లో దూసుకెళ్లింది. ఇంట్రాడేలో 58,124.20 వద్ద గరిష్ఠాన్ని తాకి, చివరకు 346.37 పాయింట్ల లాభంతో 57,960.09 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 129 పాయింట్లు పెరిగి 17,080.70 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 16,940.60- 17,126.15 పాయింట్ల మధ్య కదలాడింది.

* సెన్సెక్స్‌ 30 షేర్లలో 26 పరుగులు తీశాయి. హెచ్‌సీఎల్‌ టెక్‌ 2.55%, అల్ట్రాటెక్‌ 2.21%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 2.02%, హెచ్‌యూఎల్‌ 1.87%, టాటా మోటార్స్‌ 1.85%, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 1.81%, బజాజ్‌ ఫైనాన్స్‌ 1.70%, ఎస్‌బీఐ 1.62%, ఎం అండ్‌ ఎం 1.48%, కోటక్‌ బ్యాంక్‌ 1.32% చొప్పున లాభపడ్డాయి. భారతీ ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ 0.63% వరకు నష్టపోయాయి.

* 2.15 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.18000 కోట్లు) విలువైన తనఖా షేర్ల రుణాలను తీర్చేసినట్లు అదానీ ప్రమోటర్‌ గ్రూప్‌ వెల్లడించింది. ప్రస్తుతం నిర్వహణ స్థాయి రుణాలు మాత్రమే ఉన్నట్లు స్పష్టం చేసింది. తనఖా రుణాల చెల్లింపు పూర్తిచేయలేదన్న వార్తలను కొట్టిపారేసింది. ఇక అదానీ గ్రూప్‌లో 7 షేర్లు బుధవారం రాణించాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 8.75%, అదానీ పోర్ట్స్‌ 7.25%, అదానీ విల్మర్‌ 5%, ఎన్‌డీటీవీ 4.99%, అదానీ పవర్‌ 4.98%, అంబుజా సిమెంట్స్‌ 1.52%, ఏసీసీ 0.78% మెరిశాయి. అదానీ గ్రీన్‌ 4.45%, అదానీ టోటల్‌ గ్యాస్‌ 4.28%, అదానీ ట్రాన్స్‌మిషన్‌ 1.33% నష్టపోయాయి.

* సూరత్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌ మొదటి దశ కోసం గుజరాత్‌ మెట్రోరైల్‌ కార్పొరేషన్‌ నుంచి రూ.282.61 కోట్ల ఆర్డరును హెచ్‌ఎఫ్‌సీఎల్‌ దక్కించుకుంది.

* ఎన్‌ఎల్‌సీ నుంచి రూ.1755 కోట్ల విలువైన 300 మెగావాట్ల ప్రాజెక్ట్‌ను దక్కించుకున్నట్లు టాటా పవర్‌ సోలార్‌ సిస్టమ్స్‌ వెల్లడించింది.

* దేశీయ సర్వర్‌ తయారీ సంస్థ నెట్‌వెబ్‌ టెక్నాలజీస్‌ ఐపీఓ ద్వారా రూ.700 కోట్లు సమీకరించేందుకు సెబీ వద్ద ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది.

* రైట్‌ఇష్యూ ద్వారా ఎడ్‌టెక్‌ సంస్థ అప్‌గ్రేడ్‌ రూ.300 కోట్ల నిధులు సమీకరించింది. ఇందులో సంస్థ సహవ్యవస్థాపకుడు రోనీ స్క్రూవాలా రూ.212 కోట్లు, ప్రస్తుత పెట్టుబడిదారు టెమాసెక్‌ రూ.81 కోట్ల మేర చొప్పించారు.

నేడు మార్కెట్లకు సెలవు: శ్రీరామ నవమి సందర్భంగా నేడు (గురువారం) బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలకు సెలవు ప్రకటించారు. బులియన్‌, ఫారెక్స్‌, కమొడిటీ మార్కెట్లు కూడా పని చేయవు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు