దిగ్గజ సంస్థల గుత్తాధిపత్యం నిరోధించాలి

దేశంలో దిగ్గజ సంస్థలైన రిలయన్స్‌ గ్రూప్‌, టాటా గ్రూప్‌, ఆదిత్య బిర్లా గ్రూప్‌, అదానీ గ్రూప్‌, భారతీ టెలికాంల గుత్తాధిపత్యాన్ని నిరోధించాల్సిన అవసరం ఉందని ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ విరాల్‌ ఆచార్య పేర్కొన్నారు.

Published : 31 Mar 2023 01:14 IST

వాటి వల్లే ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది
ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ విరాల్‌ ఆచార్య

ముంబయి: దేశంలో దిగ్గజ సంస్థలైన రిలయన్స్‌ గ్రూప్‌, టాటా గ్రూప్‌, ఆదిత్య బిర్లా గ్రూప్‌, అదానీ గ్రూప్‌, భారతీ టెలికాంల గుత్తాధిపత్యాన్ని నిరోధించాల్సిన అవసరం ఉందని ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ విరాల్‌ ఆచార్య పేర్కొన్నారు. ఈయన 2017-19 మధ్య రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్‌గా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం న్యూయార్క్‌ యూనివర్సిటీ స్టెర్న్‌ స్కూల్‌లో ఆర్థిక శాస్త్ర ఆచార్యులుగా పనిచేస్తున్నారు. భారత్‌లోని అతి పెద్ద సంస్థలు అన్ని రంగాల్లో ఊహించని రీతిన ఎదిగిపోవడమే కాకుండా ధరల్ని నియంత్రించే స్థాయికి చేరాయని పేర్కొన్నారు. రిటైల్‌, వనరులు, టెలికమ్యూనికేషన్ల రంగాలు.. ఇలా ప్రతిచోటా ధరలు పెంచి రిటైల్‌ ద్రవ్యోల్బణం పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. అధిక ద్రవ్యోల్బణం సాకు చూపి ఆయా సంస్థలు ఉత్పత్తులు-సేవల ధరలను మళ్లీ పెంచుతుండటంతో ఒత్తిడి మరింత పెరిగి ద్రవ్యోల్బణం అధికమవుతోందని, దీనిపై కేంద్ర బ్యాంకులు దృష్టి సారించాలని సూచించారు. ధరలను నిర్ణయించే శక్తిని తగ్గించి, సంస్థల మధ్య పోటీని పెంచే విధంగా పెద్ద సంస్థలను అడ్డుకోవాలని తెలిపారు. ఇది కుదరని పక్షంలో వాటిని ఆర్థికంగా ఆకర్షణీయం కాని వాటిగా చేయాలని సూచించారు. ముడి పదార్థాల వ్యయాలు తగ్గినా, ఆ ప్రయోజనం భారతీయ వినియోగదార్లకు చేరడం లేదని.. ఈ 5 అగ్ర సంస్థలు లోహాలు, కోక్‌, శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులు, రిటైల్‌ వాణిజ్యం, టెలీకమ్యూనికేషన్లను నియంత్రిస్తున్నాయని పేర్కొన్నారు. అందుకే గత ఏడాది సరఫరా వ్యవస్థ సమస్యలు తొలగిపోయి అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం తగ్గినా, భారత్‌లో తగ్గలేదని గుర్తు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు