అప్పులు తీర్చే ప్రణాళికలో అదానీ!

వచ్చే 3-4 ఏళ్లలో 23 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.1.89 లక్షల కోట్లు) రుణాలను చెల్లించేందుకు ఏటా తమ వ్యాపారాల ఎబిటా 20 శాతం మేర పెరగాల్సి ఉంటుందని అదానీ గ్రూపు భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

Updated : 31 Mar 2023 10:31 IST

ఏటా ఎబిటాలో 20% వృద్ధి అవసరం
23 బి.డాలర్ల రుణాల చెల్లింపునకు ఇదే దారి

దిల్లీ: వచ్చే 3-4 ఏళ్లలో 23 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.1.89 లక్షల కోట్లు) రుణాలను చెల్లించేందుకు ఏటా తమ వ్యాపారాల ఎబిటా 20 శాతం మేర పెరగాల్సి ఉంటుందని అదానీ గ్రూపు భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. హిండెన్‌బర్గ్‌ నివేదిక అనంతరం అదానీ గ్రూపుతో సంబంధమున్న వర్గాల్లో నెలకొన్న ఆందోళనలను తగ్గించే ఉద్దేశంతో సింగపూర్‌ నుంచి అమెరికా వరకు పలువురు బ్యాంకర్లు, బాండుహోల్డర్లు, విశ్లేషకులు, మదుపర్లతో అదానీ గ్రూపు అధికారులు సమావేశాలు నిర్వహించారని పేర్కొన్నాయి. ఇందులో అదానీ గ్రూపు వృద్ధి గాథను వివరించడంతో పాటు వ్యాపారాలపై మరింత దృష్టి సారించనున్నామనే విషయాన్ని తెలియజేశారని ఆ వర్గాలు తెలిపాయి. వేగంగా వ్యాపారాలను విస్తరించాలనే దాని కంటే అప్పులను తగ్గించుకోవడానికే ప్రాధాన్యమిస్తున్నట్లు అదానీ గ్రూపు అధికారులు చెప్పారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. 2013-2022 మధ్య వార్షిక  ప్రాతిపదికన ఎబిటాలో 22 శాతం వృద్ధిని అదానీ గ్రూపు నమోదుచేసింది. ఇప్పుడు 20 శాతం వృద్ధిని సాధిస్తే రుణాలు-ఎబిటా మధ్య నిష్పత్తి ప్రస్తుతమున్న 7.6 శాతం నుంచి 2025 కల్లా 3 శాతానికి తగ్గుతుందని పేర్కొన్నాయి. కంపెనీలు రుణాలు చెల్లించగల సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు రుణాలు-ఎబిటా నిష్పత్తిని ఓ ప్రామాణికంగా తీసుకుంటారు. ఒక్కసారి ఆదాయాలు పెరిగితే.. రుణాల నిష్పత్తి దానంతట అదే కిందకు దిగివస్తుందని మదుపర్లకు కంపెనీ యాజమాన్యం తెలియజేసిందని ఆ వర్గాలు చెప్పాయి. ప్రస్తుతం అదానీ గ్రూపు ఎబిటా రూ.61,200 కోట్లుగా ఉండగా.. నికర రుణం రూ.1.89 లక్షల కోట్లుగా ఉంది. ఈ మొత్తం రుణాల్లో  37 శాతం బాండ్ల రూపేణా, 31 శాతం ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి, 8 శాతం ప్రైవేట్‌ రంగ బ్యాంకుల నుంచి రుణాలను తీసుకుంది. షేర్ల తనఖా ద్వారా తీసుకున్న 2.15 బిలియన్‌ డాలర్ల మేర రుణాలను ఇప్పటికే ప్రమోటర్లు చెల్లించిన సంగతి తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు