ఐపీఓ జోష్‌ అరకొరే

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022-23) తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) ద్వారా మొత్తం నిధుల సమీకరణ సగానికి పైగా తగ్గి రూ.52,116 కోట్లకు పరిమితమైంది.

Published : 31 Mar 2023 01:14 IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.52,116 కోట్లే సమీకరణ
2021-22తో పోలిస్తే ఈ విలువ సగం కంటే తక్కువే
ఎల్‌ఐసీ లేకుంటే మరింత తగ్గేదే

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022-23) తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) ద్వారా మొత్తం నిధుల సమీకరణ సగానికి పైగా తగ్గి రూ.52,116 కోట్లకు పరిమితమైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఐపీఓల ద్వారా కంపెనీలు జీవనకాల గరిష్ఠమైన రూ.1,11,547 కోట్లను సమీకరించాయి. ‘ప్రైమ్‌ డేటాబేస్‌’ గణాంకాల ప్రకారం.. 2022-23లో ప్రధాన ప్లాట్‌ఫామ్‌పై 37 కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూకు వచ్చాయి. 2021-22లో ఈ సంఖ్య 53గా ఉంది. అయితే 2022-23లో ఐపీఓల ద్వారా సమీకరించిన మొత్తం నిధుల్లో ఎల్‌ఐసీ వాటానే 39 శాతంగా ఉంది. ఎల్‌ఐసీ సమీకరించిన రూ.20,557 కోట్లను మినహాయిస్తే.. మొత్తం నిధుల సమీకరణ రూ.31,559 కోట్లకే పరిమితం అయ్యేదని ప్రైమ్‌ డేటాబేస్‌ మేనేజింగ్‌ డైరెక్టరు ప్రణవ్‌ హల్దియా తెలిపారు. అయితే నిధుల సమీకరణపరంగా 2022-23.. మూడో అత్యుత్తమ సంవత్సరంగా నిలిచిందని పేర్కొన్నారు.

ఏయే మార్గాల్లో.. ఎంతెంత...

* ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ ఈక్విటీ మార్గాల ద్వారా నిధుల సమీకరణ రూ.76,076 కోట్లుగా ఉంది. 2021-22లో నమోదైన రూ.1,73,728 కోట్లతో పోలిస్తే బాగా తగ్గింది.

* 2022-23లో ఐపీఓల ద్వారా రూ.54,344 కోట్ల నిధులను సమీకరించగా (ఎస్‌ఎమ్‌ఈ ఇష్యూలతో కలిపి).. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ పద్ధతిలో (ఓఎఫ్‌ఎస్‌) రూ.11,231 కోట్లు, క్యూఐపీలు/ ఇన్విట్స్‌/ రీట్స్‌ ద్వారా రూ.9,335 కోట్లు వచ్చాయి. దీంతో మొత్తంగా నిధుల సమీకరణ రూ.76,076 కోట్లకు చేరింది. పబ్లిక్‌ బాండ్ల ద్వారా సమీకరించిన రూ.8,944 కోట్లను కూడా కలిపితే.. కేపిటల్‌ మార్కెట్ల (ఈక్విటీ, డెట్‌) ద్వారా మొత్తం నిధుల సమీకరణ రూ.85,021 కోట్లుగా నమోదైంది.

* 2021-22 విషయానికొస్తే.. ఐపీఓల ద్వారా రూ.1,12,512 కోట్లు, ఎస్‌ఎమ్‌ఈ ఇష్యూల ద్వారా రూ.4,314 కోట్లు, ఓఎఫ్‌ఎస్‌ ద్వారా రూ.14,530 కోట్లు, క్యూఐపీ/ ఇన్విట్స్‌/ రీట్స్‌ రూ.13,841 కోట్లు చొప్పున మొత్తంగా ఈక్విటీ రూపేణా రూ.1,73,728 కోట్ల నిధుల సమీకరణ జరిగింది. పబ్లిక్‌ బాండ్ల ద్వారా సమీకరించిన రూ.11,710 కోట్లతో కలిపితే కేపిటల్‌ మార్కెట్ల ద్వారా మొత్తం నిధుల సమీకరణ రూ.1,85,438 కోట్లకు చేరింది.

* కొవిడ్‌ మహమ్మారి పరిణామాలు ప్రభావం చూపినా.. 2020-21లోనే కేపిటల్‌ మార్కెట్ల ద్వారా అత్యధికంగా రూ.2,00,812 కోట్ల నిధుల సమీకరణ జరిగింది. ఇది జీవనకాల గరిష్ఠ స్థాయి కావడం గమనార్హం.

3 నెలల్లోనే 25 ఇష్యూలు

* 2022-23లో వచ్చిన మొత్తం 37 పబ్లిక్‌ ఇష్యూలో మూడు నెలల్లోనే (మే, నవంబరు, డిసెంబరు) 25 ఇష్యూలు జరిగాయి. గత తొమ్మిది ఏళ్లలోనే అత్యంత తక్కువ ఐపీఓలు వచ్చిన త్రైమాసికంగా నాలుగో త్రైమాసికం (జనవరి- మార్చి) నిలిచింది.

* కొత్త తరం సాంకేతికత రంగం నుంచి కేవలం 2 కంపెనీలే (డెలివరీ, ట్రాక్సన్‌) ఉన్నాయి. 2021-22లో ఈ రంగం నుంచి ఐదు కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూకు రాగా.. మొత్తంగా రూ.41,733 కోట్లను సమీకరించాయి. ఈ రంగం నుంచి ఐపీఓకు వస్తున్న కంపెనీలు సంఖ్య తగ్గుముఖం పట్టిందనే సంకేతాన్ని ఈ గణంకాలు తెలియజేస్తున్నాయి.

స్పందన తగ్గింది..

* 2022-23లో పబ్లిక్‌ ఇష్యూలకు స్పందన కూడా తగ్గింది. 37 ఇష్యూల్లో కేవలం 11 ఇష్యూలకు మాత్రమే 10 రెట్లకు పైగా స్పందన లభించింది. ఇందులో రెండింటికి 50 రెట్లకు పైగా స్పందన వచ్చింది. 7 ఇష్యూలకు 3 రెట్లకు పైగా, 18 ఇష్యూలకు 1-3 రెట్ల మేర స్పందన లభించింది.

* 2021-22తో పోలిస్తే 2022-23లో చిన్న మదుపర్ల నుంచి కూడా ఐపీఓలకు స్పందన తగ్గింది. చిన్న మదుపర్ల సగటు దరఖాస్తులు 5.64 లక్షలకు తగ్గాయి. 2021-22లో 13.32 లక్షలు, 2020-21లో 12.73 లక్షలుగా ఇవి నమోదయ్యాయి. ఎల్‌ఐసీకి అత్యధికంగా చిన్న మదుపర్ల నుంచి స్పందన (32.76 లక్షల దరఖాస్తులు) లభించింది. ఆ తర్వాతి స్థానాల్లో హర్ష ఇంజినీర్స్‌ (23.86 లక్షలు), క్యాంపస్‌ యాక్టివ్‌వేర్‌ (17.27 లక్షలు) ఉన్నాయి.

* భవిష్యత్‌ ఐపీఓల విషయానికొస్తే.. మొత్తంగా 54 కంపెనీల ఐపీఓ ప్రతిపాదనలకు సెబీ ఆమోదం తెలిపింది. ఇవి మొత్తంగా రూ.76,189 కోట్లు సమీకరించే యోచనలో ఉన్నాయి. మరో 19 కంపెనీల ఇష్యూలు సెబీ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాయి. ఇవి సమీకరించాలని అనుకుంటున్న నిధుల విలువ రూ.32,940 కోట్ల వరకు ఉంటుందని ప్రైమ్‌ డేటాబేస్‌ చెబుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని