శ్రీనగర్‌ బనిహాల్‌ రోడ్డుకు ఏక కాల పరిష్కారం: రామ్‌కీ ఇన్‌ఫ్రా

తన అనుబంధ సంస్థ శ్రీనగర్‌ బనిహాల్‌ ఎక్స్‌ప్రెస్‌వే లిమిటెడ్‌ (ఎస్‌బీఈఎల్‌)పై ఉన్న రుణ భారాన్ని ఏకకాల పరిష్కారం ద్వారా తీర్చనున్నట్లు రామ్‌కీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వెల్లడించింది.

Published : 01 Apr 2023 02:34 IST

ఈనాడు, హైదరాబాద్‌: తన అనుబంధ సంస్థ శ్రీనగర్‌ బనిహాల్‌ ఎక్స్‌ప్రెస్‌వే లిమిటెడ్‌ (ఎస్‌బీఈఎల్‌)పై ఉన్న రుణ భారాన్ని ఏకకాల పరిష్కారం ద్వారా తీర్చనున్నట్లు రామ్‌కీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వెల్లడించింది. ఎస్‌ఈబీఎల్‌పై ఉన్న రుణాలకు సంబంధించి బ్యాంకులతో ఏక కాల చెల్లింపు (ఓటీఎస్‌) కింద  రూ.1200 కోట్లు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొంది. రామ్‌కీ గ్రూపులో భాగమైన రామ్‌కీ ఇన్‌ఫ్రా ‘నిరర్థక ఆస్తి’గా మారిన ఈ రహదారిని విక్రయించేందుకు కొన్నేళ్లుగా పెట్టుబడిదారులతో చర్చలు జరుపుతోంది. జమ్మూకశ్మీర్‌లోని జాతీయ రహదారి 1ఏలోని శ్రీనగర్‌ బనిహాల్‌ సెక్షన్‌ను 4 వరుసల రహదారిగా మార్చేందుకు ఎస్‌బీఈఎల్‌ను సంస్థ ఏర్పాటు చేసింది. దీనికి సమయం పొడిగింపు, యాన్యుటీల నష్టం, కాంట్రాక్టర్ల నుంచి కేసులు తదితరాల వల్ల ఈ ప్రాజెక్టు ఆర్థికంగా లాభదాయకంగా లేదని రామ్‌కీ ఇన్‌ఫ్రా పేర్కొంది. ఫలితంగా ఆస్తుల కంటే రుణాలు అధికంగా మారాయి. అందువల్ల కంపెనీ కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు రుణాల నుంచి విముక్తి పొందాలని ఓటీఎస్‌ కోసం రుణదాతలను సంప్రదించినట్లు రామ్‌కీ ఇన్‌ఫ్రా శుక్రవారం స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది. ఎస్‌బీఈఎల్‌ ప్రస్తుత ఆర్థిక సామర్థ్యాలను గణించిన తర్వాత, బకాయిల కింద రుణదాతలు రూ.1,200 కోట్ల ఓటీఎస్‌కు అంగీకరించారని తెలిపింది. సెప్టెంబరు 30లోపు ఈ చెల్లింపును పూర్తి చేయాల్సి ఉందని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు