ప్రపంచ బ్యాంకు అధిపతి మన అజయ్‌ బంగానే!

ప్రపంచ బ్యాంకు తదుపరి అధ్యక్షుడిగా, భారత-అమెరికన్‌ వ్యాపారవేత్త అజయ్‌ బంగా (63) నియమితులు కానున్నారు.

Published : 01 Apr 2023 04:53 IST

ఆ స్థానంలో తొలి భారతీయుడు!
మే మొదట్లో ప్రకటించే అవకాశం
ఏకైక నామినేషన్‌ ఆయనదే

వాషింగ్టన్‌: ప్రపంచ బ్యాంకు తదుపరి అధ్యక్షుడిగా, భారత-అమెరికన్‌ వ్యాపారవేత్త అజయ్‌ బంగా (63) నియమితులు కానున్నారు. బుధవారంతో నామినేషన్ల ప్రక్రియ ముగియగా, ఈ పదవికి అందిన ఏకైక నామినేషన్‌ బంగాదేనని ప్రపంచబ్యాంక్‌ గురువారం ప్రకటించింది. అధికారికంగా బంగా నియామకాన్ని మేలో ప్రకటించొచ్చు. అంతకుముందుగా ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ల బోర్డు బంగాను ఇంటర్వ్యూ చేస్తుంది. ఆర్థిక పరిస్థితుల రీత్యా అత్యంత కీలకమైన ప్రస్తుత సమయంలో, ప్రపంచ బ్యాంకుకు నేతృత్వం వహించడానికి అజయ్‌ బంగాను నామినేట్‌ చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఫిబ్రవరిలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బంగా జనరల్‌ అట్లాంటిక్‌కు వైస్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో ఈయన మాస్టర్‌కార్డ్‌కు నేతృత్వం వహించారు.

మనకు చరిత్రే: అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎమ్‌ఎఫ్‌), ప్రపంచ బ్యాంకుల్లో ఏదో ఒకదానికి అధిపతిగా మారిన తొలి భారతీయ-అమెరికన్‌, సిక్కు-అమెరికన్‌ బంగాయే అవుతారు. ప్రపంచబ్యాంక్‌ ప్రస్తుత అధ్యక్షుడు డేవిడ్‌ మలపాస్‌ జూన్‌లో వైదొలగనున్నారు. ఆయన పదవీకాలం ఇంకా ఏడాది ఉండగానే, తప్పుకుంటున్నారు. పర్యావరణ మార్పులపై ఆయన వ్యక్తిగత అభిప్రాయాలపై తీవ్ర విమర్శలు రావడం ఇందుకు నేపథ్యం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని