అదానీ ఆఫ్‌షోర్‌ ఒప్పందాలపై సెబీ దర్యాప్తు!

గౌతమ్‌ అదానీ సోదరుడు వినోద్‌ అదానీతో సంబంధమున్న కనీసం మూడు ఆఫ్‌షోర్‌ కంపెనీలు.. అదానీ గ్రూప్‌తో జరిపిన లావాదేవీల్లో, నిబంధనల ఉల్లంఘనలు జరిగాయన్న ఆరోపణలపై మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ సెబీ దర్యాప్తు జరుపుతోంది.

Published : 02 Apr 2023 01:40 IST

నిబంధనల ఉల్లంఘనలపై దృష్టి

ముంబయి: గౌతమ్‌ అదానీ సోదరుడు వినోద్‌ అదానీతో సంబంధమున్న కనీసం మూడు ఆఫ్‌షోర్‌ కంపెనీలు.. అదానీ గ్రూప్‌తో జరిపిన లావాదేవీల్లో, నిబంధనల ఉల్లంఘనలు జరిగాయన్న ఆరోపణలపై మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ సెబీ దర్యాప్తు జరుపుతోంది. ఈ అంశాలతో సంబంధమున్న ఇద్దరు వ్యక్తులను ఉటంకిస్తూ వార్తా సంస్థ రాయిటర్స్‌ ఈ విషయాన్ని తెలిపింది. గత 13 ఏళ్లుగా అదానీ గ్రూప్‌నకు సంబంధమున్న అన్‌లిస్టెడ్‌ కంపెనీలతో ఈ మూడు కంపెనీలు పలు పెట్టుబడుల లావాదేవీలు కుదుర్చుకున్నట్లు ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. వినోద్‌ అదానీ సదరు మూడు ఆఫ్‌షోర్‌ సంస్థలకు పరోక్షంగా యజమాని లేదా డైరెక్టర్‌ లేదా ఏదో విధమైన అనుబంధం కలిగి ఉన్నారని సంబంధితులు తెలిపారు. ‘రిలేటెడ్‌ పార్టీ ట్రాన్సాక్షన్‌’ నిబంధనలను ఉల్లంఘించారన్న అనుమానాలతోనే సెబీ దర్యాప్తు చేపట్టిందని చెబుతున్నారు.

రిలేటెడ్‌ పార్టీలంటే..: భారతీయ చట్టాల ప్రకారం.. స్టాక్‌ ఎక్స్ఛేంల్లో నమోదైన (లిస్టెడ్‌) కంపెనీలతో నేరుగా సంబంధమున్న వారు, ప్రమోటరు గ్రూప్‌లు, అనుబంధ సంస్థలను రిలేటెడ్‌ పార్టీలంటారు. ఇటువంటి సంస్థలతో లావాదేవీలు జరిగితే నియంత్రణ సంస్థలకు వెల్లడించాలి. స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇవ్వాలి. పరిమితికి మించిన లావాదేవీలకైతే వాటాదార్ల అనుమతి తీసుకోవాలి. ఈ నిబంధనల ఉల్లంఘన జరిగితే జరిమానాలు వేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ అంశాలపై సెబీ ఇంకా స్పందించలేదు. అదానీ లావాదేవీలకు సంబంధించిన దర్యాప్తుపై వ్యాఖ్యానించడానికి సెబీ ఛైర్‌పర్సన్‌ మాధబి పురి బచ్‌ ఇది వరకే నిరాకరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు