హైదరాబాద్‌లో ఏడీఆర్‌ తొలి కేంద్రం

మారుతున్న కాలానికి అనుగుణంగా కంపెనీ సెక్రటరీ కోర్సులో ఆర్బిట్రేషన్‌, ఫోరెన్సిక్‌ ఆడిటం్, కార్పొరేట్‌ గవర్నెన్స్‌, కృత్రిమ మేధ, ఈఎస్‌జీలాంటి అంశాలనూ చేరుస్తున్నట్లు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఎస్‌ఐ) జాతీయ అధ్యక్షుడు మనీష్‌ గుప్తా తెలిపారు.

Published : 02 Apr 2023 01:41 IST

ఐసీఎస్‌ఐ జాతీయ అధ్యక్షుడు మనీష్‌ గుప్తా

ఈనాడు, హైదరాబాద్‌: మారుతున్న కాలానికి అనుగుణంగా కంపెనీ సెక్రటరీ కోర్సులో ఆర్బిట్రేషన్‌, ఫోరెన్సిక్‌ ఆడిటం్, కార్పొరేట్‌ గవర్నెన్స్‌, కృత్రిమ మేధ, ఈఎస్‌జీలాంటి అంశాలనూ చేరుస్తున్నట్లు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఎస్‌ఐ) జాతీయ అధ్యక్షుడు మనీష్‌ గుప్తా తెలిపారు. హైదరాబాద్‌లో ప్రత్యామ్నాయ వివాద పరిష్కార కేంద్రం (ఏడీఆర్‌ సెంటర్‌)ను మూడు నెలల్లో ప్రారంభిస్తామని వెల్లడించారు. ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కారంపై శనివారం ఇక్కడ జరిగిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న ఏడీఆర్‌కు ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌ సెంటర్‌ (ఐఏఎంసీ) నాలెడ్జ్‌ పార్ట్‌నర్‌గా ఉంటుందని పేర్కొన్నారు. మెరుగైన వసతులు ఉన్నందునే హైదరాబాద్‌లో తొలి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. తదుపరి కోల్‌కతా, మానేసర్‌లతో పాటు ముంబయిలో కూడా నెలకొల్పుతామన్నారు. రానున్న రోజుల్లో దేశ వ్యాప్తంగా ఉన్న ఐసీఎస్‌ 72 ఛాప్టర్లలోనూ ఏడీఆర్‌ కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు. ప్రపంచంలో మొత్తం 1,05,000 మంది కంపెనీ సెక్రటరీలు ఉండగా, దేశంలోనే 71,000 మంది ఉన్నారన్నారు. దేశవ్యాప్తంగా 200కు పైగా విశ్వవిద్యాలయాలతో తమకు అవగాహన ఒప్పందం ఉందని తెలిపారు.త్వరలోనే ఉస్మానియా, కాకతీయ, నల్సార్‌ విశ్వవిద్యాలయాలతోనూ ఒప్పందం కుదుర్చుకుంటామని వెల్లడించారు. 14 రకాల ఆన్‌లైన్‌ కోర్సులను ప్రవేశపెట్టడం వల్ల 15,000 మందికి ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. అదానీ గ్రూపు సంస్థల లావాదేవీలపై అడిగిన ప్రశ్నకు సమాధానం దాటవేస్తూ.. ఆ గ్రూపులోని 100 మంది కంపెనీ సెక్రటరీలు ఎక్కడా నిబంధనలు మీరలేదని పేర్కొన్నారు. దేశంలో సోషల్‌ ఆడిట్‌ను బలోపేతం చేసేందుకు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ ఆడిటర్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని