39 లక్షల వాహన విక్రయాలు

2022-23 ఆర్థిక సంవత్సరం వాహన పరిశ్రమకు అత్యుత్తమంగా నిలిచింది. మొత్తం అన్ని కంపెనీలు  కలిసి 38.89 లక్షల ప్రయాణికుల వాహనాలను (కార్లు, స్పోర్ట్స్‌ వినియోగ వాహనాలు, వ్యాన్లు) టోకుగా డీలర్లకు విక్రయించాయి.

Published : 02 Apr 2023 01:41 IST

2021-22 కంటే 27% అధికం
2023-24లో 40.5-41 లక్షలకు  చేరొచ్చని అంచనా

దిల్లీ: 2022-23 ఆర్థిక సంవత్సరం వాహన పరిశ్రమకు అత్యుత్తమంగా నిలిచింది. మొత్తం అన్ని కంపెనీలు  కలిసి 38.89 లక్షల ప్రయాణికుల వాహనాలను (కార్లు, స్పోర్ట్స్‌ వినియోగ వాహనాలు, వ్యాన్లు) టోకుగా డీలర్లకు విక్రయించాయి. 2021-22లో విక్రయించిన 30.68 లక్షలతో పోలిస్తే ఈ సంఖ్య 27% అధికమని మారుతీ సుజుకీ  ఇండియా సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారి (మార్కెటింగ్‌, విక్రయాలు) శశాంక్‌ శ్రీవాస్తవ వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో విక్రయాలు 40.5-41 లక్షలకు చేరొచ్చని అంచనా వేశారు. ఉత్పత్తి కార్యకలాపాలపై చిప్‌ల కొరత ప్రభావం ఉన్నా గత ఆర్థిక సంవత్సరంలో అత్యధిక విక్రయాలు నమోదయ్యాయని వివరించారు. నూతన ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ 5-7 శాతం వృద్ధి నమోదు చేయొచ్చని.. ఎంఎస్‌ఐ అంతకు మించి రాణిస్తుందని శ్రీవాస్తవ అంచనా వేశారు.

దిగ్గజాలు రాణించాయ్‌

మారుతీ సుజుకీ, హ్యుందాయ్‌, టాటా మోటార్స్‌ సంస్థలు డీలర్లకు అత్యధిక సంఖ్యలో వాహనాలను సరఫరా చేశాయి. మారుతీ సుజుకీ ఇండియా 2021-22లో మొత్తం 16,52,653 వాహనాలను టోకుగా విక్రయించగా, 2022-23లో ఈ సంఖ్య 19 శాతం మేర పెరిగి 19,66,164 కి చేరింది. ఇందులో దేశీయ సరఫరాలే 14,14,277 నుంచి 17,06,831 వాహనాలకు చేరాయి.

* భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి అత్యధికంగా గత ఆర్థిక సంవత్సరంలోనే టోకు విక్రయాలు నమోదు చేసినట్లు హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా తెలిపింది. ఈ సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో 7,20,565 వాహనాలను టోకుగా విక్రయించింది. 2021-22లో సరఫరా చేసిన 6,10,760 వాహనాలతో పోలిస్తే ఇవి 18 శాతం ఎక్కువ. దేశీయ సరఫరా 4,81,500 వాహనాల నుంచి 18 శాతం పెరిగి 5,67,546కు చేరింది.

* టాటా మోటార్స్‌ కూడా ఉత్తమ పని తీరు కనబరిచింది. దేశీయ విపణిలో ప్రయాణికుల వాహనాల సరఫరా 3,70,372 నుంచి 45 శాతం పెరిగి 5,38,640కు చేరింది.

* కియా ఇండియా విక్రయాలు 1,86,787 నుంచి 44 శాతం పెరిగి 2,69,229కు చేరాయి. మార్చి త్రైమాసికంలో అత్యధిక స్థాయిలో 7.4 శాతం మార్కెట్‌ వాటా సాధించింది.

* టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ (టీకేఎం) టోకు విక్రయాలు 1,23,770 నుంచి 41 శాతం పెరిగి 1,74,015కు చేరాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని