కార్యాలయాల లీజింగ్‌ తగ్గింది

ఈ ఏడాది జనవరి-మార్చిలో హైదరాబాద్‌లో కార్యాలయాల లీజింగ్‌ 0.04 మిలియన్‌ చదరపు అడుగుల మేరే జరిగిందని కొలియర్స్‌ ఇండియా తాజా నివేదికలో పేర్కొంది.

Published : 02 Apr 2023 01:41 IST

జనవరి-మార్చిపై కొలియర్స్‌ ఇండియా

ఈనాడు, హైదరాబాద్‌: ఈ ఏడాది జనవరి-మార్చిలో హైదరాబాద్‌లో కార్యాలయాల లీజింగ్‌ 0.04 మిలియన్‌ చదరపు అడుగుల మేరే జరిగిందని కొలియర్స్‌ ఇండియా తాజా నివేదికలో పేర్కొంది. గతేడాది ఇదే సమయంలో జరిగిన 0.23 మి.చ.అ.తో పోలిస్తే, ఇది 83% తక్కువ. ముంబయి, పుణె, చెన్నై ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయి. బెంగళూరులో మాత్రం 343% వృద్ధితో 1.02 మి.చ.అ. లీజింగ్‌ జరిగింది. దిల్లీలో 294 శాతం వృద్ధితో 0.63 మి.చ.అ. నమోదైంది.   దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో 2022లో 2.05 మి.చ.అ. లీజింగ్‌ జరగ్గా.. 2023లో 2.06 మి.చ.అ. లీజింగ్‌ నమోదైంది.

టెక్నాలజీ సంస్థలే ఎక్కువగా..: కార్యాలయాలను లీజ్‌కు తీసుకుంటున్న వాటిలో టెక్నాలజీ సంస్థల వాటా 22 శాతంగా ఉంది. ఫ్లెక్సీ స్పేస్‌ లీజింగ్‌ 20 శాతమని తెలిపింది. ఆ తర్వాత స్థానాల్లో బీఎఫ్‌ఎస్‌ఐ, కన్సల్టింగ్‌, ఇంజినీరింగ్‌, ఇ-కామర్స్‌, ఎఫ్‌ఎంసీజీ, ఆరోగ్య, ఫార్మా, ఇతర విభాగాల సంస్థలున్నాయి. ‘కార్పొరేట్‌ సంస్థలు హైబ్రిడ్‌ విధానంలో కార్యాలయాల నిర్వహణపై దృష్టి సారించడంతో.. కొత్త కార్యాలయాల లీజింగ్‌లో సాంకేతిక రంగం వాటా 2022లోని 34 శాతం నుంచి 2023 నాటికి 22 శాతానికి పడిపోయింది. అదే సమయంలో ఫ్లెక్సీ స్పేస్‌కు డిమాండ్‌ పెంచింది’ అని కొలియర్స్‌ ఇండియా ఆఫీస్‌ సర్వీసెస్‌ ఎండీ పీష్‌ జైన్‌ అన్నారు.

సరఫరా పరంగా..: కొత్త భవనాల సరఫరా పరంగా దిల్లీ, ముంబయి నగరాల్లో వృద్ధి నమోదైంది. ముంబయిలో 200 శాతం, దిల్లీలో 15 శాతం పెరగ్గా, పుణెలో 80 శాతం తగ్గింది. హైదరాబాద్‌లో 11 శాతం, బెంగళూరులో 4 శాతం, చెన్నైలో 74 శాతం తగ్గింది. దేశవ్యాప్తంగా చూస్తే 2022 మొదటి త్రైమాసికంలో 14.4 మి.చ.అ. ఆఫీస్‌ స్పేస్‌ కొత్తగా అందుబాటులోకి రాగా... 2023లో 34% తక్కువగా 9.5 మి.చ.అ. మాత్రమే కొత్తగా అందుబాటులోకి వచ్చింది.


3 నెలల గరిష్ఠానికి నిరుద్యోగిత రేటు

మార్చిలో 7.8 శాతానికి

ముంబయి: దేశ నిరుద్యోగిత రేటు మార్చిలో 7.8 శాతానికి చేరినట్లు సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ(సీఎమ్‌ఐఈ) శనివారం వెల్లడించింది. ఇది మూడు నెలల గరిష్ఠ స్థాయి. 2022 డిసెంబరులో ఇది 8.3 శాతంగా నమోదైనా, జనవరిలో 7.14 శాతానికి తగ్గింది. ఫిబ్రవరిలో 7.45 శాతంగా నమోదైంది. మార్చిలో ఇంకా పెరిగింది. మార్చిలో పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 8.4 శాతంగా; గ్రామీణ ప్రాంతాల్లో 7.5 శాతంగా నమోదైనట్లు సీఎమ్‌ఐఈ ఎండీ మహేశ్‌ వ్యాస్‌ పేర్కొన్నారు.

* రాష్ట్రాల వారీగా నిరుద్యోగ రేటు హరియాణాలో అత్యధికంగా 26.8 శాతం ఉండగా.. తర్వాతి స్థానాల్లో రాజస్థాన్‌(26.4%), జమ్ము-కశ్మీర్‌(23.1%), సిక్కిం(20.7%), బిహార్‌(17.6%), జార్ఖండ్‌(17.5%) ఉన్నాయి.

* అతి తక్కువ నిరుద్యోగ రేటు ఉన్న రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్‌(0.8%), ఛత్తీస్‌గఢ్‌(0.8%), పుదుచ్ఛేరి(1.5%), గుజరాత్‌(1.8%), కర్ణాటక(2.3%), మేఘాలయ (2.6%), ఒడిశా(2.6%) ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు