ఆర్థికం జోష్‌

ఈ ఏడాది మార్చిలో జీఎస్‌టీ (వస్తు, సేవల పన్ను) వసూళ్లు రూ.1,60,122 కోట్లకు చేరాయి. పరోక్ష పన్నుల్లో జీఎస్‌టీ వ్యవస్థ ప్రారంభమయ్యాక,  వసూలైన రెండో అత్యధిక మొత్తమిది.

Updated : 02 Apr 2023 03:01 IST

మార్చి జీఎస్‌టీ వసూళ్లు రూ.1,60,122 కోట్లు
రెండో అత్యధిక మొత్తం ఇది
ఆర్థిక సంవత్సరం మొత్తం వసూళ్లు రూ.18.10 లక్షల కోట్లు

ఈనాడు, దిల్లీ: ఈ ఏడాది మార్చిలో జీఎస్‌టీ (వస్తు, సేవల పన్ను) వసూళ్లు రూ.1,60,122 కోట్లకు చేరాయి. పరోక్ష పన్నుల్లో జీఎస్‌టీ వ్యవస్థ ప్రారంభమయ్యాక,  వసూలైన రెండో అత్యధిక మొత్తమిది. 2022 ఏప్రిల్‌లో వసూలైన రూ.1,67,540 కోట్లు ఇప్పటివరకు వసూలైన అత్యధిక మొత్తం. గత ఏడాది మార్చిలో వసూలైన రూ.1,42,095 కోట్లతో పోలిస్తే ఈసారి 13% పెరిగాయి.

* మార్చి వసూళ్లలో సీజీఎస్‌టీ రూ.29,546 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ రూ.37,314 కోట్లు, ఐజీఎస్‌టీ రూ.82,907 కోట్లు, సెస్సు రూ.10,355 కోట్లుగా ఉన్నాయి.
* 2022-23లో నెలవారీ వసూళ్లు రూ.1.50 లక్షల కోట్లను మించడం ఇది నాలుగోసారి. ఐజీఎస్‌టీ వసూళ్లు మాత్రం గత నెలలోనే అత్యధికం.

* ఐజీఎస్‌టీ కింద వచ్చిన మొత్తంలో రూ.33,408 కోట్లు సీజీఎస్‌టీ, రూ.28,187 కోట్లు ఎస్‌జీఎస్‌టీ కింద సర్దుబాటు చేశారు. దీని తర్వాత కేంద్ర ప్రభుత్వానికి రూ.62,954 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.65,501 కోట్ల ఆదాయం దక్కింది.

* దిగుమతి చేసుకున్న వస్తువులపై ఆదాయం గత ఏడాది మార్చితో పోలిస్తే 8% పెరిగింది. దేశీయ లావాదేవీలపై వసూళ్లు 14% వృద్ధి చెందాయి. మార్చిలో రిటర్న్స్‌ కూడా గతంలో ఎన్నడూలేనంతగా  దాఖలయ్యాయి.

ఆర్థిక సంవత్సరం మొత్తంమీద: 2022-23 మొత్తంమీద జీఎస్‌టీ స్థూల వసూళ్లు రూ.18.10 లక్షల కోట్లకు చేరాయి. అంటే నెలవారీ సగటు  రూ.1.51 లక్షల కోట్లకు చేరింది. 2021-22తో పోలిస్తే 2022-23లో స్థూల ఆదాయం 22% మేర పెరిగింది.

తెలంగాణకు రూ.4,804 కోట్లు, ఆంధ్రాకు రూ.3,532 కోట్లు: మార్చిలో జీఎస్‌టీ కింద తెలంగాణకు రూ.4,804 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.3,532 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాది మార్చితో పోలిస్తే ఈసారి తెలంగాణ ఆదాయంలో 13.25%, ఆంధ్రప్రదేశ్‌ ఆదాయంలో 11.26% వృద్ధి నమోదైంది. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక 18.40%, తమిళనాడు 15.24%, కేరళ 12.67% వృద్ధిరేటు నమోదుచేశాయి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ దక్షిణాదిలో చివరిస్థానంలో నిలిచింది.


యూపీఐ లావాదేవీలు 870 కోట్లు

జీవన కాల గరిష్ఠమిదే

దిల్లీ: దేశీయంగా యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) లావాదేవీలు ఈ ఏడాది మార్చిలో రికార్డు గరిష్ఠమైన 870 కోట్లను అధిగమించాయి. వీటి విలువ  రూ.14.05 లక్షల కోట్లుగా నమోదైంది. యూపీఐ సేవలు  ప్రారంభమైన 2016 తరవాత ఒక నెలలో నమోదైన అత్యధిక లావాదేవీలు ఇవేనని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌సీపీఐ) గణాంకాలు వెల్లడించాయి. 2022 మార్చిలో రూ.9.6 లక్షల కోట్ల విలువైన 540 కోట్ల లావాదేవీలు జరిగాయి. అప్పటితో పోలిస్తే గత నెలలో పరిమాణం పరంగా 60 శాతం, విలువ పరంగా 46 శాతం మేర లావాదేవీలు పెరిగాయి. ఈ ఏడాది జనవరిలో యూపీఐ లావాదేవీలు తొలిసారిగా 800 కోట్ల మైలురాయిని అధిగమించాయి.  2019 అక్టోబరులో తొలిసారిగా 100 కోట్ల లావాదేవీల మార్కును అధిగమించాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని