Infosys: మే నుంచి కార్యాలయాలకు రండి

కొవిడ్‌ పరిణామాల ఫలితంగా ఇంటి నుంచి పని చేస్తున్న ఉద్యోగులను వారానికి కొన్ని రోజులైనా కార్యాలయాలకు రప్పించాలని ఇన్ఫోసిస్‌ నిర్ణయం తీసుకుంది.

Updated : 19 Apr 2023 09:37 IST

వారానికి 3 రోజులైనా: ఇన్ఫోసిస్‌

ఈనాడు వాణిజ్య విభాగం: కొవిడ్‌ పరిణామాల ఫలితంగా ఇంటి నుంచి పని చేస్తున్న ఉద్యోగులను వారానికి కొన్ని రోజులైనా కార్యాలయాలకు రప్పించాలని ఇన్ఫోసిస్‌ నిర్ణయం తీసుకుంది. హైబ్రిడ్‌ పని విధానాన్ని కొనసాగిస్తూనే, బృంద సభ్యుల మధ్య మరింత అవగాహన, స్నేహపూర్వక సంబంధాలు మెరుగయ్యేందుకు ‘వారంలో 3 రోజులు కార్యాలయాలకు వచ్చి పనిచేయాలని’ ఉద్యోగులకు లేఖ పంపింది. దేశంలోని అన్ని డెలివరీ సెంటర్ల (డీసీ) పరిధిలో పనిచేస్తున్న వారికి ఈ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఈ ప్రకారం..

* ఐటీ ఉద్యోగులు తమ ఉద్యోగ కేంద్ర నగరంలోనే నివసిస్తుంటే, మే 2 నుంచి బేస్‌ లొకేషన్‌ కార్యాలయానికి వారంలో కనీసం 3 రోజులైనా తప్పనిసరిగా రావాలని పేర్కొంది.

* ఒకవేళ డీసీ కేంద్రమున్న నగరానికి దూరంగా, స్వస్థలాల్లో ఉంటూ, పనిచేస్తుంటే కనుక బేస్‌ లొకేషన్‌ ప్రాంతానికి తిరిగి వచ్చి, మే 15 నుంచి వారంలో కనీసం 3 రోజులైనా తప్పనిసరిగా కార్యాలయానికి రావాలని ఆదేశించింది.

* వారానికి 3 రోజులకు మించి కార్యాలయానికి రావాలని, ఇప్పటికే ఆదేశాలందుకున్న ఉద్యోగులు తప్పనిసరిగా ఆ ఆదేశాలను పాటించాలని స్పష్టం చేసింది.
పెళ్లి కాని వారే ఇంకా రావాల్సి ఉంటుందేమో!: కొవిడ్‌ మొదటిదశ ఆరంభమై మూడేళ్లు పూర్తయ్యింది. 1-2 దశల వ్యాప్తి తీవ్రత అధికంగా ఉండటం, దాదాపు అన్ని కుటుంబాల వారు ఇబ్బంది పడటంతో, అప్పట్లో స్వస్థలాలు, అమ్మానాన్నల వద్దకు వెళ్లిన ఐటీ ఉద్యోగుల కుటుంబాలు అధికం. కొవిడ్‌ మూడో దశ నుంచి వ్యాధి తీవ్రత తగ్గడం, విద్యాసంస్థలు కూడా ప్రారంభమైనందున, వివాహమై, పిల్లలున్న వారిలో అత్యధికులు తిరిగి తమ ఉద్యోగ నగరాలకు వచ్చేశారన్న అభిప్రాయాన్ని ఇన్ఫోసిస్‌ సీనియర్‌ అధికారి ఒకరు వ్యక్తం చేశారు. పెళ్లికాని వారు, కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారు మాత్రమే ఇంకా స్వస్థలాల నుంచి పనిచేస్తున్నారని, వచ్చే నెల నుంచి వారూ తప్పనిసరిగా బేస్‌ లొకేషన్‌కు రావాల్సిందేనని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని