ఖరీదైన స్మార్ట్‌ఫోన్లకే అధిక గిరాకీ

దేశంలో ఖరీదైన (ప్రీమియం), అత్యంత ఖరీదైన (అల్ట్రా ప్రీమియం) స్మార్ట్‌ఫోన్ల అమ్మకాల్లో వృద్ధి గణనీయంగా పెరుగుతోంది. అయితే అందుబాటు ధర మోడళ్ల అమ్మకాలు మాత్రం తగ్గుతున్నాయి.

Published : 01 May 2023 01:55 IST

ఏడాది క్రితంతో పోలిస్తే అమ్మకాలు 60-66% పెరిగాయ్‌
మొత్తం స్మార్ట్‌ఫోన్ల సరఫరాలు 19% తగ్గాయ్‌
కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ నివేదిక
ఈనాడు వాణిజ్య విభాగం

దేశంలో ఖరీదైన (ప్రీమియం), అత్యంత ఖరీదైన (అల్ట్రా ప్రీమియం) స్మార్ట్‌ఫోన్ల అమ్మకాల్లో వృద్ధి గణనీయంగా పెరుగుతోంది. అయితే అందుబాటు ధర మోడళ్ల అమ్మకాలు మాత్రం తగ్గుతున్నాయి. కొవిడ్‌ పరిణామాల్లో ఆన్‌లైన్‌ తరగతులు, ఇంటి నుంచి పని కారణంగా అత్యధికులు స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేశారు. కుటుంబసభ్యుల్లో దాదాపు ప్రతి ఒక్కరికీ స్మార్ట్‌ఫోన్‌ అమరడం, ద్రవ్యోల్బణ ప్రభావంతో కొత్తగా ఫోన్‌ కొనే సామాన్యుల సంఖ్య నెమ్మదించింది. ధరల పెరుగుదల ప్రభావం అంతగా ఉండని సంపన్న వర్గాలు మాత్రం నచ్చిన మోడల్‌ను ఎంతకైనా కొనడమే ప్రీమియం మోడళ్ల అమ్మకాలు పెరగడానికి కారణం.

తొలి త్రైమాసికంలో 3.1 కోట్లే

స్మార్ట్‌ఫోన్ల సరఫరాలు ఈ ఏడాది జనవరి-మార్చిలో 3.1 కోట్లకు పరిమితం అయ్యాయని.. 2022 ఇదే కాల సరఫరాలతో పోలిస్తే, ఇవి 19% తక్కువని మార్కెట్‌ పరిశోధనా సంస్థ కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ తెలిపింది. అత్యధికులు కొనుగోలు చేసే రూ.30,000 కంటే తక్కువ విలువైన స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు బాగా తగ్గడమే ఇందుకు కారణమంది. ఇదే సమయంలో ఖరీదైన, అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు 60-66% పెరిగినట్లు వివరించింది.

ఇదే తొలిసారి

 మార్చి త్రైమాసికంలో దేశీయంగా స్మార్ట్‌ఫోన్‌ సరఫరాలు ఇంతలా తగ్గడం ఇదే తొలిసారి. వరుసగా మూడో త్రైమాసికంలోనూ వీటి సరఫరాల్లో క్షీణత కొనసాగడం గమనార్హం. వినియోగదారుల నుంచి గిరాకీ తగ్గడాన్ని ఇది ప్రతిబింబిస్తోంది. అమ్మకాలు తగ్గడంతో, 2022 నుంచి దుకాణదారుల వల్ల నిల్వలు పేరుకుపోవడమూ మరో కారణం.
* ఏడాది క్రితంతో పోలిస్తే, ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో రూ.10,000 లోపు స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు 9%, రూ.10,000-20,000 శ్రేణి స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు 34%, రూ.20,000-30,000 మోడళ్ల అమ్మకాలు 33% తగ్గాయి.

మందగమన ప్రభావం స్పష్టం

‘కొవిడ్‌ పరిణామాల్లో పలువురు ఫీచర్‌ఫోన్ల నుంచి స్మార్ట్‌ఫోన్లకు మారారు. ఫలితంగా అత్యధిక కుటుంబాల్లో, దాదాపు ప్రతి ఒక్కరికీ స్మార్ట్‌ఫోన్‌ సమకూరింది. అందువల్లే గత ఏడాది నుంచి వీటి విక్రయాలు నెమ్మదించాయి. ద్రవ్యోల్బణ ప్రభావం సామాన్య, మధ్యతరగతి ప్రజలపైనే ఎక్కువగా ఉంటుది. అన్నిరకాల సేవలు, ఉత్పత్తుల ధరలు పెరగడంతో, ఆచితూచి ఖర్చు పెడుతున్నారు. అదే సంపన్నులపై ద్రవ్యోల్బణ ప్రభావం తక్కువగానే ఉంటుంది. యాపిల్‌, శామ్‌సంగ్‌ సంస్థలు ప్రీమియంలో స్మార్ట్‌ఫోన్ల మోడళ్లను విడుదల చేస్తుండటం, 5జీ సేవలు విస్తరిస్తున్నందున, వీటి అమ్మకాలు గణనీయంగా పెరిగాయ’ని ఒక ప్రముఖ విక్రయశాల అధిపతి చెబుతున్నారు. పాత స్మార్ట్‌ఫోన్‌ నుంచి అప్‌గ్రేడ్‌ అవుదామనుకునేవారు, వడ్డీలేని సులభ వాయిదాల్లో ‘ప్రీమియం’ మోడళ్లు కొంటున్నట్లు తెలిపారు.

5జీ మోడళ్ల వాటా 43%

మొత్తం స్మార్ట్‌ఫోన్ల అమ్మకాల్లో 5జీ మోడళ్ల వాటా 43 శాతానికి చేరిందని కౌంటర్‌పాయింట్‌ వెల్లడించింది. ఏడాది క్రితంతో పోలిస్తే ఈ వాటా 23% పెరిగింది. వాడుతున్న స్మార్ట్‌ఫోన్‌ మార్చుకునే వారు, ఫీచర్‌ ఫోన్ల నుంచి స్మార్ట్‌కు మారుతున్న వారు కూడా కొత్తగా అందుబాటులోకి వస్తున్న 5జీ స్మార్ట్‌ఫోన్లే తీసుకోవడం ఇందుకు కారణం. కంపెనీలు కూడా రూ.10,000 నుంచీ 5జీ స్మార్ట్‌ఫోన్‌ మోడళ్లను విడుదల చేస్తుండటం, ఈ విభాగం రాణించడానికి దోహద పడుతోంది.


శామ్‌సంగ్‌కు అగ్రస్థానం

స్మార్ట్‌ఫోన్‌ విపణిలో 20% వాటాతో వరుసగా రెండో త్రైమాసికంలోనూ శామ్‌సంగ్‌ అగ్రస్థానంలో నిలిచినట్లు కౌంటర్‌పాయింట్‌ తెలిపింది. 5జీ మోడళ్లలోనూ ఈ సంస్థదే ఆధిపత్యం. సంప్రదాయ విక్రయశాలలకు ఏ సిరీస్‌ 5జీ స్మార్ట్‌ఫోన్లను సరఫరా చేస్తోంది. ఎస్‌ 23 సిరీస్‌ వల్ల రూ.45,000 అంతకంటే ఖరీదైన స్మార్ట్‌ఫోన్ల అమ్మకాల్లో శామ్‌సంగ్‌ ఏడాది క్రితంతో పోలిస్తే 247% వృద్ధి సాధించింది.
* యాపిల్‌ సంస్థ అమ్మకాలు ఏడాది వ్యవధిలో 50% పెరిగాయి. దేశీయ స్మార్ట్‌ఫోన్‌ విపణిలో సంస్థ వాటా 6 శాతానికి చేరింది. రూ.30,000 అంతకంటే విలువైన ప్రీమియం శ్రేణిలో 36%, రూ.45,000 అంతకంటే విలువైన అల్ట్రా ప్రీమియం విభాగంలో 62% వాటా యాపిల్‌దే.
* ఏడాది క్రితంతో పోలిస్తే మార్కెట్‌ వాటా 3% తగ్గి 17 శాతానికి పరిమితం అయినా, రెండోస్థానంలో వివో కొనసాగుతోంది.
* షియామీ సంస్థ మార్కెట్‌ వాటా 44% క్షీణించి, 16 శాతానికి పరిమితం కావడంతో 3వ స్థానానికి దిగివచ్చింది. రూ.10,000 కంటే మోడళ్ల అమ్మకాలు తగ్గడం ప్రభావం చూపింది.
* అమ్మకాల్లో 72% వృద్ధి ద్వారా, అత్యంత వేగంగా రాణించిన సంస్థగా వన్‌ప్లస్‌ నిలిచింది.
* దేశీయ బ్రాండ్లకు వస్తే రూ.10,000 శ్రేణిలో లావా రాణించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని