పోయిన ఫోన్లను ట్రాక్‌ చేసి బ్లాక్‌ చేసే వ్యవస్థ 17 నుంచి అమలు!

పోయిన లేదా దొంగతనానికి గురైన మొబైల్‌ ఫోన్లను ట్రాక్‌ చేసి బ్లాక్‌ చేసే సాంకేతికతను ఈ వారమే దేశ వ్యాప్తంగా ప్రభుత్వం అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.

Published : 15 May 2023 06:57 IST

దిల్లీ: పోయిన లేదా దొంగతనానికి గురైన మొబైల్‌ ఫోన్లను ట్రాక్‌ చేసి బ్లాక్‌ చేసే సాంకేతికతను ఈ వారమే దేశ వ్యాప్తంగా ప్రభుత్వం అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయినట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. సెంటర్‌ ఫర్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలీమేటిక్స్‌ (సీడాట్‌) అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థను ఇప్పటికే ప్రయోగాత్మక ప్రాజెక్టు కింద దిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఈశాన్య రాష్ట్రాల్లో అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. మే 17న ఈ సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెండిటీ రిజిస్టర్‌ (సీఈఐఆర్‌) వ్యవస్థను దేశవ్యాప్తంగా అమలు చేసే అవకాశం ఉందని సదరు అధికారి తెలిపారు. సీడాట్‌ సీఈఓ రాజ్‌కుమార్‌ ఉపాధ్యాయ్‌ మాత్రం ఇంకా తేదీని ధ్రువీకరించలేదు. కానీ దేశవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు మాత్రం స్పష్టం చేశారు. అందుకోసం వ్యవస్థ సిద్ధంగా ఉందని తెలిపారు.

ఐఎంఈఐ నంబర్ల ఆధారంగా..

మొబైల్‌ ఫోన్‌ను విక్రయించడానికి ముందే దాని ఐఎంఈఐ నంబరును బహిర్గతం చేయాలనేది నిబంధన. మొబైల్‌ నెట్‌వర్క్‌ల వద్ద ఈ అధీకృత ఐఎంఈఐ నంబర్ల జాబితా ఉంటుంది. ఒకవేళ ఏవైనా అనధికార మొబైళ్లు తమ నెట్‌వర్క్‌లోకి వస్తే టెలికాం సంస్థలు గుర్తించగలుగుతాయి. సీఈఐఆర్‌ వ్యవస్థ, మొబైల్‌ నెట్‌వర్క్‌ల దగ్గర ఐఎంఈఐ నంబర్లు, వాటికి అనుసంధానమైన మొబైల్‌ నంబర్ల జాబితా ఉంటుంది. ఈ సమాచారం ఆధారంగానే పోయిన ఫోన్లను ట్రాక్‌ చేసి, బ్లాక్‌ చేస్తారు. తద్వారా ఫోన్ల దొంగతనాలు తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే దొంగల్ని గుర్తించడానికి కూడా పోలీసులకు సులభమవుతుంది. ఇటీవల కర్ణాటక పోలీసులు 2,500కు పైగా పోయిన మొబైల్‌ ఫోన్లను సీఈఐఆర్‌ వ్యవస్థను వినియోగించుకుని రికవరీ చేసి యజమానులకు అప్పగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని